ఆంధ్రప్రదేశ్‌

దేవాలయ భూములను కాపాడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 18: రాష్ట్రంలోని ఆలయాలను అభివృద్ధి చేయటంతో పాటు దేవాలయ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. నగరంలోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఆయన దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ఆలయ భూముల పరిరక్షణ, ఆదాయం పెంపు, ఆలయాల అభివృద్ధి, తదితర అంశాలకు సంబంధించి జిల్లాస్థాయి అధికారులతో నవంబర్ 1వ తేదీ నుండి డిసెంబర్ నెలాఖరు వరకూ సమీక్షలు నిర్వహిస్తామని అనంతరం ఆయన విలేఖరులకు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఆలయాలకు ధూప, దీప, నైవేద్యం కోసం 5వేల నుంచి 10వేల రూపాయలకు బడ్జెట్ పెంచేలా చర్యలు చేపడతామని చెప్పారు. ఇందుకోసం సుమారు 234 కోట్ల రూపాయలు ఇప్పటికే కేటాయించామన్నారు. గతంలో కొన్ని ఆలయాలకు మత్రమే ధూప, దీప, నైవేద్యానికి నిధులు ఇచ్చేవారని, అర్హత ఉన్న అన్ని దేవాలయాలకు నేడు నిధులు అందించేందుకు ప్రణాళిక తయారుచేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ఆలయాలకు చెందిన ఖాళీ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా రిజిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ సహకారంతో పాటు మున్సిపాల్టీ, పంచాయతీలకు వివరాలు అందించి ప్రైవేట్ వ్యక్తుల పరం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఒక్కోసారి ఆలయ భూములు కాపాడటానికి అధికారుల బలం కూడా సరిపోవడం లేదని, ఇందుకు ఒక ఐపీఎస్ అధికారిని నియమించే విధంగా ప్రభుత్వాన్ని అడగాలని భావిస్తున్నామని చెప్పారు.
ఉద్యోగ ఖాళీల భర్తీకి చర్యలు
దేవాదాయ శాఖలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయని, దీంతో ఒక్కో అధికారి అదనపు విధులు నిర్వహించడంతో పాటు ఇతర శాఖల నుంచి కూడా డిప్యూటేషన్‌పై ఇక్కడకు వచ్చి పనిచేస్తున్నారన్నారు. ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కోరతామన్నారు. అర్చకులకు ఇళ్లస్థలాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అర్చకుల భవిష్యత్తు బాగుండాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. రాష్ట్రంలో పెద్ద ఆలయాల ఆదాయ, వ్యయాలపై పూర్తి సమీక్ష సమావేశం నిర్వహించి మాస్టర్‌ప్లాన్ తయారుచేయాలని సూచించామన్నారు. సూరాయిపాలెంలో గత ప్రభుత్వం చట్టవిరుద్ధంగా జీవోలు ఇచ్చి 10 ఎకరాలు ధారాదత్తం చేసిందని, భూములను బినామీలకు ఇచ్చుకున్నారని, వాటిని రద్దుచేస్తామన్నారు. భక్తులు దేవుడికి ఇచ్చిన భూములను పరిరక్షించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని, వాటిని పరిరక్షిస్తామన్నారు. మాజీ ముఖ్యమంత్రికి దేవుడన్నా, దేవుని భూములు అన్నా లెక్క లేకుండా గతంలో విజయవాడ నగరంలో అక్రమంగా దేవాలయాలు కూల్చేసారని అదే ప్రాంతంలో గానీ, దానికి దగ్గరలో గాని కొత్త దేవాలయాలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. దేవాదాయశాఖ కమిషనర్ బీ పద్మ, ఏడీసీ-1 చంద్రకుమార్, ఏడీసీ-2 రామచంద్రమోహన్, ఎస్టేట్ అధికారి ఆజాద్, పదమూడు జిల్లాల్లో ఉన్న దేవాదాయశాఖ డీసీ, ఏసీలు పాల్గొన్నారు.