ఆంధ్రప్రదేశ్‌

టమోటా రైతుకు జగన్ దన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, అక్టోబర్ 19: కర్నూలు జిల్లా పత్తికొండ టమోటా మార్కెట్‌లో కమీషన్ ఏజెంట్లు రైతులకు చేస్తున్న అన్యాయంపై ఆరా తీసిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తక్షణ చర్యలు చేపట్టారు. రైతుల నుంచి నేరుగా టమోటా కొనుగోలు చేయాలని మార్కెటింగ్‌శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు శనివారం మార్కెట్‌కు చేరుకుని ఐదు టన్నుల టమోటా కొనుగోలు చేశారు. దీంతో వ్యాపారులు సైతం ఓ మెట్టుదిగారు. సీఎం చర్యలను టమోటా రైతులు హర్షిస్తున్నారు. పత్తికొండ మార్కెట్‌లో రెండు రోజుల పాటు జరిగిన వ్యవహారంపై సీఎం ఆరా తీయడంతో కమీషన్ ఏజెంట్ల అన్యాయాలకు అడ్డుకట్ట పడింది.
సీఎం ఆదేశాలతో మార్కెటింగ్‌శాఖ అధికారులు పరుగులు పెట్టారు. కమీషన్ ఏజెంట్ల తీరుపై సీఎం సంబంధిత అధికారులతో చర్చించినట్లు మార్కెటింగ్‌శాఖ రాష్ట్ర కమిషనర్ ప్రద్యుమ్న తెలిపారు. వెంటనే రంగంలో దిగిన మార్కెటింగ్‌శాఖ పత్తికొండ మార్కెట్‌లో ఒక్కరోజే ధరల స్థిరీకరణ నిధికింద ఐదు టన్నుల టమోటాలను కొనుగోలు చేసింది. అంతేకాకుండా మార్కెట్‌లో పండ్లు, కూరగాయలను డీ రెగ్యులేట్ చేశామని సీఎంకు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. మార్కెటింగ్‌ఫీజు లేకుండా ఏజెంట్లకు కమీషన్ ఇవ్వకుండా రైతులు టమోటాలను అమ్ముకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. మార్కెట్‌లో కాకుండా బయట అమ్మినా టమోటాలు కొనుగోలు చేస్తామని ఏజెంట్లు పేర్కొంటున్న విషయాన్ని కూడా సీఎం దృష్టికి తెచ్చారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. సీఎం నిర్ణయంతో పత్తికొండలో టమోటా కొనుగోళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. ధర తగ్గకుండా ఉండేందుకు వేలం పాటలో మార్కెటింగ్‌శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. దీంతో వ్యాపారులు సైతం ముందుకువచ్చి టమోటాలు కొనుగోలు చేశారు. శనివారం ఏకంగా 50టన్నుల టమోటాలు అమ్ముడుపోయాయి. రైతులను ఇబ్బందులకు గురి చేసిన ఏజెంట్లపై పోలీసులు కేసు పెట్టి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు కమిషనర్ తెలిపారు. సీఎం తీసుకున్న చర్యలను టమోటా రైతులు హర్షిస్తున్నారు.
*చిత్రం...పత్తికొండ మార్కెట్‌లో టమోటాల వేలం పాటల్లో పాల్గొన్న మార్కెటింగ్‌శాఖ అధికారులు