ఆంధ్రప్రదేశ్‌

ఒకే రూల్.. ఒకే చట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), అక్టోబర్ 21: చట్టం ఎవరికీ చుట్టం కాదని, ఎంతటి వారైనా ఎలాంటి మినహాయింపు ఉండదు.. అందరికీ ఒకే రూల్ అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుశాఖ వెనుకడుగు వేసే పరిస్థితి ఉండకూడదన్నారు. ప్రత్యేకంగా మహిళలు, పిల్లల విషయంలో రాజీ పడొద్దని, బడుగు, బలహీన, పేద వర్గాలపై దాడులకు పాల్పడే వారిని ఏ మాత్రం ఉపేక్షించవద్దన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సోమవారం జరిగిన రాష్టస్థ్రాయి పోలీసు అమరుల సంస్మరణ దినం కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ పోలీసు వ్యవస్థపై ప్రజల్లో గౌరవం పెరగాలంటే పేదల పట్ల వివక్ష కూడదని, అందరికీ ఒకే రూలు ఉండాలన్నారు. న్యాయం, ధర్మాన్ని బతికించే బాధ్యత పోలీసులపై ఉందని గుర్తు చేశారు. దేశ భద్రత, సమాజ రక్షణ కోసం అమరవీరుల త్యాగాలు మరువలేమని, విధి నిర్వహణలో ప్రాణాలను కోల్పోయిన పోలీసులకు నివాళి అర్పించారు. అమరులైన పోలీసు కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తొలుత ముఖ్యమంత్రి సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించి ‘అమరులు వారు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ 1959 అక్టోబర్ 21వ తేదీన చైనా సరిహద్దులో వందల సంఖ్యలో ఉన్న చైనా సైన్యంతో కేవలం 20 మంది భారత జవాన్లు పోరాడి ప్రాణాలు పణంగా పెట్టారని, వారి త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం పోలీసు అమర వీరుల సంస్మరణ దినంగా జరుపుకుంటున్నామన్నారు. మన రాష్ట్రంలో కూడా ఎంతో మంది పోలీసులు విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించారని వారందరికీ తాను సెల్యూట్ చేస్తున్నానన్నారు. అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేస్తామని ఈ సందర్భంగా మాట ఇస్తున్నానని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. పోలీసు టోపీ మీద ఉన్న సింహాలు దేశ
సార్వభౌమాధికారానికి నిదర్శనమని అందుకే ప్రజలను నిరంతరం కాపాడే పోలీసులుండే స్టేషన్లకు గర్వంగా రక్షక భట నిలయాలని అంటున్నామన్నారు. మెరుగైన పోలీసు సేవలు అందించాలన్నా.. ప్రజల హృదయాల్లో నిలిచిపోవాలన్నా శాంతిభద్రతల విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదని ముఖ్యమంత్రి అన్నారు. అందుకే తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక మొదటి కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో శాంతిభద్రతల విషయంలో రాజీ పడొద్దని, ముఖ్యంగా మహిళలు, బడుగు బలహీన వర్గాల మీద దాడులు జరిగితే ఎంతటివారైనా ఉపేక్షించకుండా చట్టం ముందు నిలబెట్టమని చెప్పానని గుర్తు చేశారు. చట్టం ఏ కొందరికో చుట్టం కానప్పుడే న్యాయం, ధర్మం బతుకుతాయన్నారు. అందరికీ ఒకే రూలు, చట్టం ఉండాలన్నారు. రక్షణ కోసం వచ్చిన బలహీన వర్గాల వారు కూడా వివక్షకు గురి కాకుండా తమకు న్యాయం జరిగిందని చిరునవ్వుతో ఇంటికి వెళితేనే పోలీసులు ప్రజల మన్ననలు, గౌరవాన్ని పొందగలుగుతారని అప్పుడే మనకు తృప్తి లభిస్తుందన్నారు. పోలీసులు ఇది ఎప్పటికీ గుర్తు పెట్టుకోవాలని, అవినీతి, లంచగొండితనం, రౌడీయిజం వంటి నేరప్రవృత్తి మీద నిజాయితీగా పోరాటం చేయాల్సిన బాధ్యత ప్రతి పోలీసు సోదరునిపై ఉందన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా వీక్లీ ఆఫ్
ఎండనకా.. వాననకా..పగలనకా.. రేయనకా.. కనీసం సెలవు కూడా లేకుండా డ్యూటీలు చేస్తూ పోలీసులు పడుతున్న కష్టాన్ని తాను కళ్ళారా చూశానని అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో వీక్లీఆఫ్‌ను ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి అన్నారు. వారమంతా విధి నిర్వహణలో కష్టపడిన వారు వీక్లీ ఆఫ్ వల్ల వారానికి ఒకరోజు కుటుంబాలతో హాయిగా గడిపి, ఎంతో మానసికోల్లాసాన్ని పొంది బాగా పని చేయగలుగుతారని తెలిపారు. పోలీసులతో పాటే కలిసి పని చేస్తున్న హోంగార్డులకు కూడా జీతాలను మెరుగుపరిచి 18వేల నుంచి 21వేలకు పెంచామన్నారు.
హోం మంత్రి సుచరిత మాట్లాడుతూ సమాజంలో మహిళలు, బాలికలపై ఎక్కువగా దాడులు జరుగుతున్నాయన్నారు. వారికి రక్షణ కల్పించేందుకు బాలికలు, మహిళల రక్షణ కోసం మహిళా మిత్ర, సైబర్ మిత్ర ఏర్పాటు చేశామన్నారు. సమాజంలో నేటి యువత పెద్ద ఎత్తున మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారని దాన్ని అరికట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు.
దేశంలో 292 మంది అమరులయ్యారు : డీజీపీ
డీజీపీ దామోదర గౌతం సవాంగ్ మాట్లాడుతూ దేశంలో ఈ ఏడాది 292 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారని అన్నారు. సమాజం కోసం కష్టనష్టాలకోర్చి నిస్వార్థంగా సేవ చేస్తున్న పోలీసుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం వీక్లీ ఆఫ్ ప్రకటించినందుకు, అదేవిధంగా హోంగార్డుల జీతాలు పెంచినందుకు ముఖ్యమంత్రి కృతఙ్ఞతలు తెలియచేశారు. అనంతరం ముఖ్యమంత్రి, హోం మంత్రి తదితరులు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించి వౌనం పాటించి నివాళులర్పించారు. అమరవీరుల సంక్షేమ సహాయ నిధికి తమ విరాళాలను అందచేశారు. ఆరో బెటాలియన్ ఆధ్వర్యాన పరేడ్ కొనసాగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రహ్మణ్యం, మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, కొడాలి శ్రీవెంకటేశ్వరావు, బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ డీజీపీ బి ప్రసాదరావు, పలువులు ఎమ్మెల్యేలు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
*చిత్రం...పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, హోంమంత్రి సుచరిత, డీజీపీ సవాంగ్