ఆంధ్రప్రదేశ్‌

రెండు దశాబ్దాలుగా వెట్టిచాకిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, నవంబర్ 9: ‘ఒకే సంస్థలో ఒకేపని చేస్తున్న వారిలో కొందరికి నెలకు రూ.లక్ష నుండి రూ.రెండు లక్షల వరకు వేతనం... కొందరికి రూ.10 వేల లోపు వేతనం...’ వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది కఠోర వాస్తవం. రాష్ట్రంలోని సుమారు 150 ఎయిడెడ్ కళాశాలల్లోని అధ్యాపకుల వేతనాల్లో ఉన్న వ్యత్యాసమిది. తేడాఏమిటంటే వారిలో కొందరు పోస్టులు పర్మినెంట్ కాగా, మరికొందరు ఏళ్ల తరబడి పార్ట్‌టైంగానే కొనసాగుతున్నారు. వీరిలో అత్యధికులు 20 ఏళ్లుగా పనిచేస్తుండటం విశేషం. రోజువారీ కూలీలుగా పనిచేసే వారికి సైతం కనీస వేతన నిబంధనలు వర్తిస్తున్న ప్రస్తుత తరుణంలో వెట్టిచాకిరీని మించిన తరహాలో పార్ట్‌టైం అధ్యాపకుల జీవనయానం సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నత విద్యనందించే ఉద్దేశంతో ప్రభుత్వం ఎయిడెడ్ విద్యావ్యస్థను ఏర్పాటుచేసింది. రాష్టవ్య్రాప్తంగా 170 ఎయిడెడ్ కళాశాలలు ఏర్పాటైనా, ఆర్థికపరమైన సమస్యలతో కొన్ని మూతబడ్డాయి. ప్రస్తుతం 147 కళాశాలలు మనుగడలో ఉన్నాయి. వీటిలో సుమారు 2500 మంది పార్ట్‌టైం అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. ఈ కళాశాలల్లో అత్యధిక సంఖ్యలో విద్యార్థినీ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే ఎయిడెడ్ విద్యావ్యవస్థపై ప్రభుత్వాల చిన్నచూపు కారణంగా సుమారు 2500 మంది అధ్యాపకులు అరకొర జీతాలతో జీవితాలను నెట్టుకొస్తున్నారు. ఇరవై ఏళ్లుగా వీరంతా ఎయిడెడ్ ఖాళీల్లో పనిచేస్తున్నా ప్రభుత్వం వీరిని గుర్తించకపోగా ఏ విధంగానూ ఆదుకోవడం లేదు. దీనికంతటికీ కారణం సరైన విధివిధానాల రూపకల్పన లేకపోవడమేనని ఆ అధ్యాపకులు వాపోతున్నారు. ఎప్పటికపుడు తాత్కాలిక జీవోలను విడుదలచేసి ఖాళీ అయిన పోస్టులను నింపిన ప్రభుత్వం 1993లో జీవో నెంబర్ 328 విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం 658 మంది రెగ్యులర్ అయ్యారు. ఆ తర్వాత జీవో నెంబర్ 35 ప్రకారం ఖాళీ అయిన పోస్టుల నియామకాలు నిలిచిపోయాయి. ఒక్క బ్యాక్‌లాగ్ పోస్టులు మినహా మిగిలిన ఎయిడెడ్ పోస్టుల నియామకాన్ని పట్టించుకోలేదు. ప్రస్తుతం ఎయిడెడ్ కళాశాలల్లో సీనియర్ అధ్యాపకులు నెలకు 2 లక్షల పైగా జీతం తీసుకుంటుంటే, ఖాళీ పోస్టుల్లో పనిచేస్తున్న అన్ ఎయిడెడ్ అధ్యాపకులు కనీసం 10 వేల జీతం కూడా అందక బతుకులు వెళ్ళదీస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రైవేటు కళాశాలలను ఎయిడెడ్ చేద్దామనే ఆలోచన చేశారు. తొమ్మిది మంది సభ్యులతో పాల్‌బూయాన్ ఛైర్మన్‌గా ఒక కమిటీని వేశారు. అయితే బడ్జెట్ అధికం కావడంతో ఆ ప్రతిపాదన విరమించుకున్నారు. ప్రస్తుతం అన్‌ఎయిడెడ్ పోస్టుల్లో పనిచేస్తున్న వారంతా పూర్తిగా ఖాళీ అయిన పోస్టుల్లో మాత్రమే పనిచేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం వెంట తిరిగి వేసారిన ఎయిడెడ్ కళాశాలల్లోని అన్ ఎయిడెడ్ అధ్యాపకులు ఇపుడు వైసీపీ ప్రభుత్వానికి తమ మొరను వినిపించారు. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్‌కు, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తదితరులను కలిసి తమ గోడు వినిపించుకున్నారు.
‘ఉన్నత విద్యకు ఊపిరి పోసింది ఎయిడెడ్ వ్యవస్థే. ఈ కళాశాలల్లోనే చదివిన ఎంతోమంది ప్రభుత్వ అధికారులుగా ఇప్పటి ప్రభుత్వంలోనూ ఉన్నారు. ఉన్నత విద్యాశాఖ మంత్రి కూడా ఎయిడెడ్ కళాశాలలో పనిచేశారు. పాత జీవోలతో నిమిత్తం లేకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని కోరుతున్నాం. ప్రభుత్వం దీనిపై ఒక మంచి ప్రకటన చేస్తుందని ఆశాభావంతో ఉన్నాం’
- విళ్ళ రాజ్‌కుమార్
రాష్ట్ర ఎయిడెడ్ కళాశాలల అన్
ఎయిడెడ్ లెక్చరర్స్ అసోసియేషన్
అధ్యక్షుడు
‘ఎయిడెడ్ ఖాళీల్లో పనిచేస్తున్న అన్‌ఎయిడెడ్ సిబ్బందిని వెంటనే క్రమబద్ధీకరించాలి. లేదంటే కనీసం మినిమం టైం స్కేలు వర్తింపచేయాలి. ఆర్థిక భారం లేని పోస్టులు, ఖాళీల్లో పనిచేస్తున్నవారిని వెంటనే ప్రభుత్వం క్రమబద్ధీకరించాలి. అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది వేతనాలు లేక దుర్భర జీవితాన్ని గడుపుతున్నాం’
-డా. పీవీబీ సంజీవరావు
రాష్ట్ర ఎయిడెడ్ కళాశాలల అన్
ఎయిడెడ్ లెక్చరర్స్ అసోసియేషన్
కార్యదర్శి