ఆంధ్రప్రదేశ్‌

కొరత లేకుండా ఇసుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 12: ఈ నెల 14 నుంచి 21వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక వారోత్సవాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇసుక సరఫరా మెరుగుదలకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు. వరదనీరు తగ్గి మరిన్ని రీచ్‌లు అందుబాటులోకి వచ్చాయన్నారు. రోజువారీ 97వేల మెట్రిక్ టన్నుల నుంచి 1.2 లక్షల మెట్రిక్ టన్నుల వరకు పెంచామని రెండు, మూడు రోజుల్లో 2 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా చేయాలన్నారు. గత వారం రోజులుగా పరిస్థితి మెరుగుపడిందన్నారు. 1.2 లక్ష టన్నులు రోజు సరఫరా చేసేందుకు వీలు కలిగిందని రీచ్‌ల సంఖ్య కూడా 60 నుంచి 90 వరకు పెరిగిందన్నారు. వచ్చే వారం రోజుల్లో 2 లక్షల టన్నులు సరఫరా చేయాలని అధికారులకు నిర్దేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టాక్ పాయింట్లు 137 నుంచి 180 వరకు పెంచాలని సూచించారు. ఇసుక వారోత్సవాల్లో భాగంగా వీటిని ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా జేసీలను ఇన్‌చార్జిలుగా బాధ్యత తీసుకోవాలన్నారు. నియోజకవర్గాల వారీగా ఇసుక రేట్ కార్డును ప్రకటించాలని రెండురోజుల్లో ఇది అమల్లోకి రావాలన్నారు. నిర్దేశించిన ధర కంటే అధిక
మొత్తంలో వసూలు చేస్తే జరిమానా విధించటం, వాహనాలను సీజ్ చేయటంతో పాటు రెండేళ్ల జైలు శిక్ష విధించేలా చర్యలు ఉండాలన్నారు. దీనిపై కేబినెట్‌లో ఆమోదం తీసుకుంటామని జిల్లాల వారీగా ప్రకటించిన ఇసుక రేట్ కార్డులపై విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. ఇసుక కొరత తీరేంత వరకు అధికారులు సెలవులో వెళ్లవద్దని స్పష్టం చేశారు. ఇసుక తవ్వకాలు, విక్రయాల్లో సిబ్బంది భాగస్వామ్యం కావాలన్నారు. సరిహద్దుల్లో ప్రతి చోట చెక్‌పోస్టులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. 10 రోజుల్లో వీటిని అందుబాటులోకి తేవాలన్నారు. కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్ అండ్ బీ, ఏపీ ఎండీసీ, అధికారులు తక్షణమే స్పందించాలన్నారు. అక్రమ రవాణా చేసినా, ప్రకటించిన ధరలకు మించి ఎవరైనా అమ్మినా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
14న నాడు- నేడు
ఈనెల 14వ తేదీన ఒంగోలులో నాడు- నేడు కార్యక్రమాన్ని ప్రారంభించ నున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. మొదటి దశలో 15 వేలకు పైగా పాటశాలల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల బోధన అమల్లోకి తెస్తామన్నారు. తెలుగు తప్పనిసరి సబ్జక్టుగా ఉంటుందని చెప్పారు. కలెక్టర్లు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆదేశించారు. జనవరి 1 వరకు ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించాలన్నారు. డిసెంబర్ లోగా పాఠ్య ప్రణాళికలను సిద్ధం చేయాలని, పాఠశాలల్లో వౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలన్నారు. తల్లిదండ్రుల కమిటీల భాగస్వామ్యం కూడా అవసరమన్నారు. జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.
21న మత్స్యకారులకు భరోసా
మత్స్యకారులకు ప్రభుత్వ భరోసాను ఈనెల 21వ తేదీన తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరంలో ప్రారంభిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. నవంబర్ 16 లోగా సోషల్ ఆడిట్ నిర్వహించాలన్నారు. అన్ని గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించాలన్నారు. సముద్రంలో తెప్పల ద్వారా వేట నిర్వహిస్తున్న వారికి కూడా మత్స్యకారుల భరోసా వర్తిస్తుందని వెల్లడించారు. డీజిల్ సబ్సిడీకి డిజిటల్ కార్డులు అందిస్తామన్నారు.
వచ్చే నెల 15 వరకు రైతు భరోసా గడువు
రైతు భరోసా పథకం కింద కౌలు రైతులకు వచ్చేనెల 15వ తేదీ వరకు గడువు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి నిర్ణయించారు. రైతులతో ఒప్పందాలు కుదుర్చుకనేందుకు, ఒప్పందాలపై అవగాహన కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో సామాజిక తనిఖీ చేయాలని ఎక్కడైనా పొరపాట్ల కారణంగా అర్హులు మిగిలితే వారి విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వచ్చే రైతు భరోసాలో వారికి లబ్ధి చేకూరుతుందన్నారు.
అగ్రిగోల్డ్ చెల్లింపులపై సమీక్ష
అగ్రిగోల్డ్ బాధితులకు నగదు చెల్లింపులపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష జరిపారు. పెండింగ్‌లో ఉన్న లబ్ధిదారులకు వెంటనే డబ్బులు అందేలా చూడాలన్నారు. జిల్లా లీగల్ సెల్ అథారిటీ ఆమోదం తరువాత వారికే డబ్బులు జమవుతాయని వివరించారు. పెండింగ్‌లో ఉన్న జాబితాను ఆమోదించాలని సూచించారు. లీగల్‌సెల్ అథారిటీతో సమన్వయం చేసుకుని వారికి నగదు అందించాలన్నారు.
ఇళ్ల స్థలాలకు భూ సేకరణ పూర్తికావాలి
ప్రభుత్వ మానసపుత్రిక అయిన 25 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఉగాది నాడు అందజేసేందుకు నిరంతరం శ్రమించాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. దేశం మొత్తం ఈ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. వచ్చే నాలుగు నెలలు పూర్తి స్థాయిలో దీనిపై దృష్టి కేంద్రీకరించాలని కలెక్టర్లను ఆదేశించారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని, అవసరమైతే ప్రైవేట్ భూములు కొనుగోలు చేయాలని సూచించారు. పేదలకు ఇళ్ల స్థలాలు అందించడంపైనే కలెక్టర్లు దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో ఎవరైనా భాగస్వాములు కావచ్చని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఏదైనా కార్యక్రమానికి సహాయం చేస్తే వారి పేరు కూడా చేరుస్తామన్నారు. గ్రామ సచివాలయాల వద్ద ఏర్పాటు చేయాల్సిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాల దుకాణాలపై సీఎం ఆరా తీశారు. వచ్చే వారం లోగా దీనిపై స్పష్టమైన నివేదిక అందించాలని ఆదేశించారు.

*చిత్రం...ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ వెబ్‌సైట్ ఆవిష్కరించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి