ఆంధ్రప్రదేశ్‌

అదే దూకుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 9:ప్రత్యేక హోదా అంశం ఏపి అసెంబ్లీలో రెండో రోజూ ప్రకంపనలు సృష్టించింది. అధికార, విపక్ష సభ్యుల ఆందోళనలతో ప్రత్యేక హోదా అంశంపై చర్చకు ఆస్కారమే లేకుండా పోయింది. హోదాపై ముందుగా చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ వైకాపా సభ్యులు సభలో శుక్రవారం వీరంగం సృష్టించారు. దీనికి మంత్రి యనమల రామకృష్ణుడు లోటస్‌పాండ్ రూల్స్ శాసనసభలో నడవబోవని వ్యాఖ్యనించారు. ముఖ్యమంత్రి ప్రకటన చేశాకే చర్చ చేపట్టాలని ఖరాఖండీగా చెప్పడంతో వైకాపా సభ్యులు ఆగ్రహంతో పోడియాన్ని చుట్టుముట్టి పెద్దపెట్టున నినాదాలు చేశారు. స్పీకర్ ముందున్న మైక్‌ను పీకేశారు. కాగితాలు చించి స్పీకర్‌పైకి విసిరేశారు. ఒక దశలో స్పీకర్ వద్దకు వెళ్లేందుకు దూసుకురాగా మార్షల్స్ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, మార్షల్స్ మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలు కిందపడిపోయారు. ఒకరిద్దరు విపక్ష ఎమ్మెల్యేలు ఏకంగా స్పీకర్ ముందున్న బల్లలు ఎక్కి ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’ అంటూ నినాదాలు చేశారు. ఉదయం 9 గంటలకు శాసనసభ ప్రారంభమైన వెంటనే వైకాపా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రాకు ప్రత్యేక హోదా అంశంపై ముందుగా చర్చకు అనుమతించాలని, ఆ తర్వాత కేంద్రం ప్రకటనపై ప్రభుత్వం వివరణ ఇస్తే బాగుంటుందని సూచించారు. ఈ ప్రతిపాదనను మంత్రి యనమల రామకృష్ణుడు తిరస్కరించారు. కేంద్ర సాయంపై ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని, ఆ తర్వాత సభ్యులు సందేహాలు అడిగితే వివరణ ఇస్తారని, దీనిపై ఎంతసేపైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. లోటస్‌పాండ్ రూల్స్ అసెంబ్లీలో చెల్లవని యనమల చేసిన వ్యాఖ్యతో సభలో గలభా మొదలైంది. వైకాపా ఎమ్మెల్యేలు ఒక్క ఉదుటన పోడియం వద్దకు చేరుకుని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. స్పీకర్ కూర్చున్న స్ధానం వైపుకు చెవిరెడ్డి, రాచమల్లు వెళ్లేందుకు ప్రయత్నించగా మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో తోపులాట ప్రారంభమైంది. సభ అదుపుతప్పుతోందని గ్రహించిన స్పీకర్ సభను వాయిదా వేశారు. మళ్లీరెండు గంటల తర్వాత సభ ప్రారంభమైంది.
ముందుగా స్పీకర్‌కు కుడివైపు మార్షల్స్ నిలబడగా, మార్షల్ ఆఫీసర్ వచ్చి వారిని బయటకు రమ్మనడం కనిపించింది. దీంతో అక్కడ నిలబడిన మార్షల్స్ బయటకు వెళ్లిపోయారు. మరికొంతమంది మార్షల్స్ ప్రతిపక్ష సభ్యులు కూర్చునే స్ధానాల పక్కన నిలబడ్డారు. స్పీకర్ ఆదేశాలు లేకుండా తమ స్ధానాల వద్ద మార్షల్స్ నిలబడటంపై వైకాపా ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోడియం వద్దకు దూసుకెళ్లారు. మార్షల్స్‌ను శాసనసభలో పెట్టి సభను నడిపిస్తారా అంటూ స్పీకర్‌ను ప్రశ్నించారు. ఆ సమయంలో మృతి చెందిన ఎమ్మెల్యేలకు నివాళులు అర్పించేందుకు వీలుగా ఒక నిమిషంసేపు వౌనం పాటించాలని స్పీకర్ కోరినా ఎమ్మెల్యేలు ఖాతరు చేయలేదు. కె శ్రీనివాసులు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, సునీల్ స్పీకర్ ఎదుట ఉన్న బల్లలు ఎక్కి ఆవేశంగా చేతులు ఊపుతూ నినాదాలు చేశారు. స్పీకర్ ముందున్న మైక్‌ను పీకేశారు. కాగితాలను చించి స్పీకర్ వద్ద గాలిలో ఎగరవేశారు. ఒకవైపు స్పీకర్ వైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఎమ్మెల్యేలు, మరో వైపు స్పీకర్ ఎదుట చేరిన ఎమ్మెల్యేల నినాదాలు, మార్షల్స్ ప్రతిఘటించడంతో సభలో రభస నెలకొంది. అప్పటికే రెండుసార్లు సభను వాయిదా వేసిన స్పీకర్, పరిస్థితి సద్దుమణగకపోవడంతో శనివారానికి వాయిదా వేశారు.