ఆంధ్రప్రదేశ్‌

వీసీ..టీసీ.. రివ్యూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, నవంబర్ 17: వీసీ.. టీసీ.. రివ్యూ.. ఈ పదాలు ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. సాధారణంగా సమస్యలు, సంక్షేమ పథకాలు, లబ్ధిదారులు వంటి పదాలు వినిపించాల్సిన ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ వీసీ.. టీసీ.. రివ్యూల గొడవేంటని అనుకుంటున్నారా.. అదే వీసీ అంటే ‘వీడియో కాన్ఫరెన్స్’, టీసీ అంటే ‘టెలీ కాన్ఫరెన్స్’, రివ్యూ అంటూ ‘సమీక్ష’. ఈ సమీక్షలు, సమావేశాలతో ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి తిండి, నిద్ర కరువై ఏం చేస్తున్నామో కూడా తెలియని దయనీయ స్థితికి దిగజారిపోయారు. ప్రభుత్వం పెడుతున్న ఒత్తిడితో ఉద్యోగుల బాధలు వర్ణణాతీతంగా మారాయి. గతంలో చంద్రబాబు హయాంలో ఇలాంటి వీసీ, టీసీలను వ్యతిరేకించిన ప్రస్తుత సీఎం జగన్ అదే పంథాను అనుసరించడం ఉద్యోగులను ఆశ్చర్యచకితులను చేస్తోంది. 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో ఎక్కువగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో మాట్లాడేవారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వీలు కాకపోతే టెలీ కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ కార్యక్రమాలపై ఉన్నతాధికారులతో సంప్రదించేవారు. ముఖ్యమంత్రి బాదుడు ముగిసిన వెంటనే ఆయా శాఖల ఉన్నతాధికారులు టెలీ కాన్ఫరెన్స్‌లో అదే అంశాలపై మరోమారు దాడి చేసే వారని ఉద్యోగులు గుర్తు చేసుకుంటున్నారు. దీని కారణంగా ప్రజా సమస్యల పరిష్కారానికి సమయం లేకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే అన్న చందాన ఉండేవని పేర్కొంటున్నారు. ఇదే విషయాన్ని ఉద్యోగ సంఘాల నాయకులు నాడు ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత సీఎం జగన్‌కు వివరించడంతో ఆయన చంద్రబాబు వ్యవహార శైలిపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ ఉద్యోగులను స్వేచ్ఛగా పనిచేసుకోనిస్తే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని సూచించారు. అయినా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం వీసీ, టీసీలతో గడిపారు. ఆ తరువాత ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన వెంటనే వీసీ, టీసీల గోల పోయిందన్న ఉద్యోగుల సంతోషం ఎంతోకాలం నిలవలేదు. కొద్ది రోజులకే జగన్ సైతం వీసీ, టీసీలకు శ్రీకారం చుట్టడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. చంద్రబాబు హయాంలో ఉన్నతాధికారులు కాన్ఫరెన్స్‌లలో మాట్లాడి ఆ విషయాలను కిందిస్థాయి అధికారులకు తెలియపరచి అభివృద్ధి పనులను వేగవంతం చేయమని ఆదేశించేవారు. ఇప్పుడు ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ముగియగానే ఉన్నతాధికారులు కలెక్టర్, ఆర్డీఓ, తహశీల్దార్ స్థాయి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నారు. అది ముగిసిన గంటా, రెండు గంటల సమయంలోనే మళ్లీ జిల్లా కలెక్టర్ గ్రామస్థాయి అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌లలో అభివృద్ధి పనులపై సమీక్ష చేయడంతో పాటు నివేదికలను సిద్ధం చేయమని ఆదేశిస్తున్నారు. మండలాల నుంచి వచ్చిన నివేదికలపై చర్చించడానికి వారంలో రెండు, మూడు రోజులు జిల్లా కేంద్రంలో సమీక్ష సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లి రావడానికే సమయం సరిపోతుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమీక్షలు, సమావేశాలతో వేళకు భోజనం కూడా చేయలేకపోతున్నామని, నివేదికలు సిద్ధం చేయడానికి అర్ధరాత్రి వరకూ పని చేయాల్సివస్తోందని వాపోతున్నారు. దీని వల్ల తమ ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి వచ్చిందని ఆందోళన చెందుతున్నారు. ఈ వీసీ, టీసీ, రివ్యూలను పక్కన పెట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి కాన్ఫరెన్స్‌లతో పాటు ఉన్నతాధికారుల సమీక్షలను నిలిపివేస్తే ప్రజల సమస్యలపై దృష్టి పెట్టడానికి వీలవుతుందని వారంటున్నారు. లబ్ధిదారుల ఎంపికలో మండల స్థాయి అధికారులకు సమయం లేకపోవడంతో గ్రామ స్థాయి అధికారులు ఇచ్చిన నివేదికలను పంపాల్సి వస్తోందని వెల్లడిస్తున్నారు. దీనివల్ల అనర్హులు సైతం సంక్షేమ పథకాల్లో భాగస్వాములవుతున్నారని పేర్కొంటున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి మంచి పేరు రావడం పక్కనపెట్టి చెడ్డపేరు మూటగట్టుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ అనర్హులు ఎక్కువగా ఉంటే ఉద్యోగులపైనే నెపం వేసి క్రమశిక్షణ చర్యలంటూ తమను ఇబ్బందులు పెట్టే అవకాశాలు లేకపోలేదని ఆవేదన చెందుతున్నారు. వీసీ, టీసీలను వెంటనే మానేసి వారానికి ఒక రోజు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించాలని కోరుతున్నారు. దీనివల్ల ప్రజా సమస్యల పరిష్కారానికి తమకు సమయం లభించడమే కాకుండా సంక్షేమ పథకాల్లో అర్హులైన వారందరికీ చోటు కల్పించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారు సూచిస్తున్నారు.