ఆంధ్రప్రదేశ్‌

జాలర్లకు ‘సిరి’గంగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం: చేపల వేటే ప్రధాన జీవనాధారంగా బతుకుతున్న గంగపుత్రుల జీవితాల్లో మార్పు తీసుకురావడానికే వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకానికి శ్రీకారం చుడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. మత్స్యకారులను వివిధ రకాలుగా ఆదుకోవడానికి ఉద్దేశించిన ‘వైఎస్సార్ మత్స్యకార భరోసా’ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం గురువారం శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం కొమనాపల్లిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 974 కిలోమీటర్ల తీరప్రాంతం ఉన్నప్పటికీ, బతుకుతెరువు కోసం మత్స్యకారులు గుజరాత్ వంటి ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికే మత్స్యకార భరోసా పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ పథకం కింద ఏటా చేపల వేట నిషేధ కాలమైన ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు ఉపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు అందించే ఆర్థిక సాయాన్ని రూ.4000 నుంచి రూ.10వేలకు పెంచుతున్నామన్నారు. ఇది తాను నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ అని, ఈ ఏడాది తాము అధికారంలోకి వచ్చేసరికి జూన్ మాసం వచ్చేసిందని, అందువల్ల ఈ ఏడాదికి ఆర్థికసాయం పెంచకపోయినా ఫర్వాలేదని కొందరు సూచించారని, అయినా తాను అంగీకరించక ఈ ఏడాదికి కూడా రూ.10 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. అలాగే ఇప్పటివరకు చేపల వేటకు ఉపయోగించే బోట్లకు డీజిల్‌పై ఇస్తున్న సబ్సిడీని లీటరుకు రూ.6 నుండి రూ.9కి పెంచుతున్నామన్నారు. ఈ పథకానికి రాష్ట్రంలో 81 బంకులను గుర్తించామని, ఈ బంకుల్లో డీజిల్ కొనుగోలుచేసిన వెంటనే సబ్సిడీ మినహా, మిగిలిన మొత్తం చెల్లించే అవకాశం ఉంటుందన్నారు. గురువారం నుంచే ఈ పథకం అమల్లోకి వచ్చిందని ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు తిరిగివచ్చే వరకూ జీవితాలకు భరోసా ఉండదని, దురదృష్టకర పరిస్థితుల్లో వారు చనిపోతే ఆ కుటుంబానికి ఇచ్చే నష్ట పరిహారాన్ని

రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామన్నారు. తాను పాదయాత్ర చేసిన సమయంలో పలువురు మత్స్యకారులు ఫిషింగ్ జెట్టీల కోసం వినతిపత్రాలు ఇచ్చారని, అప్పుడు ఇచ్చిన హామీలో భాగంగా మచిలీపట్నం నుంచి శ్రీకాకుళం వరకు పలు జెట్టీల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. మత్స్యకారులకు సహకారం అందించడానికి ఇటీవల ఏర్పాటుచేసిన గ్రామ సచివాలయాల్లో 794మంది మత్స్యకార సహాయకులను నియమించామన్నారు.

ట్యాబ్‌లో బటన్ నొక్కి ప్రారంభించిన ముఖ్యమంత్రి
వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకాన్ని వేదికపై ట్యాబ్‌లో బటన్ నొక్కడం ద్వారా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. దీని ఆధారంగా మత్స్యకార కుటుంబాల ఖాతాల్లోకి రూ.10వేలు జమ అవుతుందని ప్రకటించారు. అంతకుముందు రాష్టవ్య్రాప్తంగా టూరిజం బోట్ల నియంత్రణకు నెలకొల్పనున్న తొమ్మిది పర్యాటక జలవిహార నియంత్రణ కేంద్రాల నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు.

ధర్మాడి సత్యంకు సత్కారం
దేవీపట్నం మండలం కచ్చులూరుమందం వద్ద గోదావరిలో మునిగిపోయిన పర్యాటక బోటును వెలికితీసిన మత్స్యకార కుటుంబానికి చెందిన ధర్మాడి సత్యంను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి మోదిదేవి వెంకటరమణ, వ్యవసాయ, సహకార శాఖ మంత్రి కురసాల కన్నబాబు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

*చిత్రం... బహిరంగ సభలో జాలర్ల టోపీ, బుట్ట ధరించి, వల చేతపట్టుకున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి