ఆంధ్రప్రదేశ్‌

దద్దరిల్లిన శాసనసభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 12: శాంతియుతంగా ర్యాలీగా శాసనసభలోకి ప్రవేశిస్తున్న తమను దాదాపు 40 నిమిషాలపాటు వెలుపల నిల్పివేసి తమపై దౌర్జన్యం చేసిన మార్షల్స్‌పై చర్య తీసుకోవాలంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబుతో సహా ఆ పార్టీ సభ్యులు ఓ వైపు... శాసనసభ ప్రాంగణంలోనే సీఎం జగన్‌ను ఉన్మాది అంటూ చంద్రబాబు కించపరచినందుకు క్షమాపణ చెప్పే వరకు సభను సాగనివ్వబోమంటూ అధికారపక్ష సభ్యులు పోటాపోటీగా నినాదాలు...విమర్శలు... ప్రతి విమర్శలు చేసుకోవటంతో గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల ఆరంభంలోనే దాదాపు అరగంట సేపు పైగా తీవ్ర స్థాయిలో గందరగోళం చెలరేగింది. సవాళ్లు ప్రతి సవాళ్లతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో అధికారపక్ష సభ్యులు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కే రోజా తదితరులు బాబు హయాంలో తమకు జరిగిన పరాభవాలు, పోలీసు దౌర్జన్యాలను ఏకరువు పెట్టారు. రోజా మరో అడుగు ముందుకేసి బాబుకు వయస్సు మీరుతున్న కొద్ది చాదస్తం పెరుగుతున్నదని, తక్షణం ఆసుపత్రిలో చేర్పించాలన్నారు. టీడీపీ సభ్యులు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు ఆగ్రహావేశాలతో చీఫ్‌మార్షల్‌గా కొత్తగా నియమితులైన ఎం థియోఫిలాస్ సీఎంకు బంధువు కావచ్చని, దురహంకారంతో చంద్రబాబుతో సహా తమను చేతులతో గుండెలపై బాదుతూ వెనక్కి నెట్టే ప్రయత్నం చేసినందున అతని పై చర్య తీసుకోవాలంటూ నినదించారు. ముందు టీడీపీ సభ్యులు లోపలికి ప్రవేశిస్తూనే ఆవేశంతో అరుపులు, కేకలతో నేరుగా స్పీకర్ పోడియం వైపు దూసుకుపోయారు. తమపై దౌర్జన్యం జరిగిందంటూ కేకలు వేశారు. ఈ పరిణామాల పట్ల అధ్యక్ష స్థానంలోనున్న తమ్మినేని సీతారామ్ ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. వెంటనే తేరుకుని అసలు ఏమి జరిగింది... ముందు కూర్చొని చెప్పండి అంటూ పదే పదే చెప్పినప్పటికీ ఏ ఒక్కరూ ఖాతరు చేయలేదు. దీంతో వైకాపా సభ్యులందరూ మూక్కుమ్ముడిగా లేచి నిరసన తెలిపారు. ఎంతో సజావుగా సాగుతున్న సభను వ్యూహాత్మకంగా భగ్నం చేస్తున్నారంటూ విమర్శించారు. అంబటి రాంబాబు కల్పించుకుంటూ తమకేదో అన్యాయం, ఘోరం జరిగిందంటూ సభలో ఈ దౌర్జన్యపూరిత వాతావరణం ఏమిటని ప్రశ్నించారు. మీడియాపై ఆంక్షలు విధించే 2430 జీవోకు... ఈటీవీ, ఏబీఎన్, టీవీ 5లకు అనుమతి నిరాకరణను నిరసిస్తూ తాము నల్లబాడ్జీలు ధరించి ప్లకార్డులు చేతబూని సభలోకి ప్రవేశిస్తుంటే పోలీసులు, మార్షల్స్ అడ్డుకుని దౌర్జన్యం చేశారని, ప్లకార్డులతో పాటు తమ చేతుల్లోని కాగితాలను లాగివేసి నల్లబ్యాడ్జీలను సైతం తొలగించారని టీడీపీ సభ్యులు ఫిర్యాదు చేశారు. సభ వెలుపల ఏమి జరిగిందో తనకు ఎలా తెలుస్తుందని శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అంటూ, సమాచారం తెప్పించుకున్నానన్నారు. సీఎం జగన్ సూచనపై మంగళవారం టీడీపీ సభ్యుల వాకౌట్ దృశ్యాలను టీవీలో చూపించారు. అందులో చంద్రబాబు సీఎం జగన్‌ను ఓ ఉన్మాదిగా చిత్రీకరిస్తూ విమర్శచేయడాన్ని అధికార పక్ష సభ్యులందరూ మూక్కుమ్ముడిగా లేచి బాబు క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. ఇలా దాదాపు అరగంట సేపు గందరగోళం చెలరేగింది. చివరగా సీఎం జగన్ మాట్లాడుతూ చంద్రబాబు నుంచి క్షమాపణ వస్తుందని తాను అనుకోవడం లేదన్నారు. కొంత మంది మనుషులు కరుడుగట్టిన స్వభావంతో ఉంటాని వారిలో మానవత్వం ఎక్కడా కన్పించదని అన్నారు. జరిగిన ఘటనలను టీవీలలో స్పష్టంగా చూస్తున్నాం.. బాబు చుట్టూ బ్లాక్ క్యాట్ కమాండ్‌లు ఉన్నారు. అసలు వారు ఎవరినీ బాబు దగ్గరకు రానీయరు. బాబు అలాంటి కమాండోలను పెట్టుకుని మార్షల్స్‌పై దౌర్జన్యం చేస్తూ తనను ఉన్మాది అంటూ రెచ్చగొట్టే మాటలను మాట్లాడుతున్నారని అన్నారు. మళ్లీ ఇవాళ మార్షల్స్‌ను ఉద్దేశించి అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఏదిఏమైనా సభ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఏ అంశం లేకపోయే సరికి ఒక జీవోను తీసుకువచ్చి వెలుపల రాద్ధాంతం చేశారు. దీనికి కాస్త మసాలా జోడించి జరగని గొడవను ఏదో జరిగినట్లుగా సృష్టించే కార్యక్రమం చేశారు. పాపం ఆ మార్షల్స్‌పై అభాండాలు వేస్తున్నారు. ఇక చంద్రబాబు క్షమాపణ చెప్తారా? లేదా? అన్నది ఆయన విజ్ఞతకే వదిలేద్దాం.. ఆయనకు మానవత్వం లేదన్న విషయం మనందరికీ తెలిసిందే...పైన ఉన్న భగవంతుడే అన్నీ చూసుకుంటాడు సభను కొనసాగించేందుకు ముందుకు సాగుదామంటూ తమ పార్టీ సభ్యులను శాంతింప చేశారు. అయితే గడచిన ఐదేళ్లలో జగన్‌తోపాటు ఆ పార్టీ సభ్యులు ఎన్నిమార్లు ప్లకార్డులు చేతబట్టి స్పీకర్ పోడియం వద్దకు దూసుకురాలేదంటూ టీడీపీ సభ్యులు ఆగ్రహంతో మాట్లాడారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ 1999లో నాటి స్పీకర్ యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన నిబంధనలు, ఆంక్షలు నేటికీ కొనసాగుతున్నాయంటూ వాటిని చదివి విన్పించారు. శాసన సభ ప్రాంగణంలో ఐదుగురికి మించి గుమికూడరాదని, బహిరంగ సభలు, ర్యాలీలు, ధర్నాలు, పికెటింగ్‌లు, ప్లకార్డులు నిషేధమన్నారు. వెలుపల జరిగిన దానిపై స్పీకర్ విచారించటానికి అవకాశం ఇవ్వకుండా తక్షణమే నిర్ణయం చెప్పాలనటం చిన్న పిల్లలు ఫలానా బొమ్మ ఇప్పుడే కావాలని అల్లరి చేసినట్లుగా ఉందన్నారు. దీనిపై బుచ్చయ్య చౌదరి కాస్తంత తగ్గుతూనే నిబంధనలు ఉండవచ్చు... గత ఐదేళ్లలో మీరు చేసిందేమిటని ప్రశ్నించారు. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ నేడు జరిగిన పరిణామాలను ఎథిక్స్ కమిటీ ముందు ఉంచి విచారణ జరిపించి సభలో నివేదికను ప్రవేశపెట్టించాలని సూచించారు. చివరగా స్పీకర్ సీతారాం మాట్లాడుతూ ఏదిఏమైనా క్షమాపణ విషయాన్ని బాబు విజ్ఞతకు వదిలేస్తున్నానంటూ ఈ అంశాలన్నీ ఎథిక్స్ కమిటీ ముందుంచే విషయాన్ని పరిశీలిస్తానంటూ ప్రశ్నోత్తర కార్యక్రమాన్ని కొనసాగించారు.