ఆంధ్రప్రదేశ్‌

కన్హయ్యకుమార్ దేశద్రోహ వ్యాఖ్యలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 25: దేశ రాజధాని ఢిల్లీలోని సెంట్రల్ యూనివర్సిటీలో ఎబివిపిని తుడిచిపెట్టి విద్యాసంఘ అధ్యక్షునిగా ఎన్నికయ్యాడనే కసితో కన్హయ్యకుమార్‌ను అన్ని విధాలుగా దెబ్బతీసేందుకు బిజెపి మతతత్వ శక్తులు కుట్ర పన్నుతున్నాయంటూ సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. తనకు తెలిసినంతవరకు కన్హయ్‌కుమార్ ఎక్కడా కూడా తన ప్రసంగాల్లో అబ్జల్‌గురును పొగడటం కాని, జాతి వ్యతిరేక నినాదాలు చేయడం గాని జరుగలేదని, అయితే ఒకవేళ ఎవరైనా నిరూపించగలిగితే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని నారాయణ అన్నారు. కన్హయ్‌కుమార్ సభలను అడ్డుకోటానికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రోద్బలంతో విజయవాడలో జరిగిన కుట్రలను విద్యార్థి సంఘాలు ఐక్యంగా తిప్పికొట్టగలిగాయన్నారు. వెంకయ్యనాయుడు తలుచుకుంటే తమ శ్రేణులను అదుపులో పెట్టలేకపోయారా అని ప్రశ్నించారు. త్వరలో జరుగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజెపికి భంగపాటు తప్పదన్నారు. దాసరి నాగభూషణరావు భవన్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జెఎన్‌యు ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని వేసిందని, న్యాయ నిపుణులతో పాటు ఆ కమిటీ కూడా కన్హయ్ ఎక్కడా దేశద్రోహ వ్యాఖ్యలు చేయలేదని తమ నివేదికలో పొందుపర్చటం జరిగిందన్నారు. అయితే కేవలం రెండు టీవీలు మార్కింగ్ చేశారనేది ఆ తరువాత వెల్లడైందన్నారు. పార్లమెంట్‌లో దీనిపై జరిగిన చర్చలో కూడా ఎన్‌డిఎ కూటమిలోని పార్టీలు కూడా బిజెపి అనుసరిస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయంటూ ఆయన గుర్తుచేశారు. న్యాయవిచారణ జరుగుతున్న సమయంలో దొడ్డిదారిన పారిపోయిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్ అప్పారావును తిరిగి పదవిలోకి తీసుకురావటం ఎబివిపితో చర్చలు జరిపి విధ్వంసాన్ని సృష్టించడం కేవలం కన్హయ్ సభను భగ్నం చేయటం కోసమేనన్నారు. అలహాబాద్ విశ్వవిద్యాలయంలో కూడా ఒక మహిళ స్వతంత్ర అభ్యర్థిగా ఎబివిపిపై గెలుపొందటాన్ని తట్టుకోలేక అక్కడ కూడా మతతత్వ శక్తులు అరాచకాలను సృష్టిస్తున్నాయని అన్నారు. రాజకీయ పోరాటం కంటే మతోన్మాద పోరాటం ద్వారా తన అస్థిత్వాన్ని కాపాడుకోగలమన్న స్థితికి బిజెపి దిగజారిపోయిందన్నారు. ఇందులో నాగపూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ కేంద్రం చురుకైన పాత్రను పోషిస్తుందన్నారు. ప్రస్తుతం ఆర్‌ఎస్‌ఎస్ ఒక్కటే బిజెపిని నడిపిస్తోందన్నారు. ఇటీవల జైపూర్‌లో జరిగిన సమావేశంలో కూడా వామపక్షాలనే లక్ష్యం చేసుకోవాలని తీర్మానం చేశారని అన్నారు. బిజెపికి అందరూ భావిస్తున్నట్టుగా ప్రథమ శత్రువులు ముస్లిం మతోన్మాదులు కాదని వామపక్ష భావాలు కలిగినవారే ప్రథమ శత్రువులని అన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో పిడిపితో కలిపి బిజెపి కాపురం చేయబోతున్నదన్నారు. అబ్జల్‌గురు ఉరిని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తూ పాకిస్తాన్ జెండా రెపరెపలాడిస్తున్న కాశ్మీర్‌లో బిజెపి ఎవరితో పొత్తు పెట్టుకుంటుందో ప్రజలు గుర్తెరగాలన్నారు. తమకు వ్యతిరేకంగా వున్నవారిపై దేశ వ్యతిరేకులుగా ముద్రవేసి దాడులకు పాల్పడుతున్నారంటూ నారాయణ ధ్వజమెత్తారు. ఇక ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల నేపధ్యంలో తమిళనాడులో తొలిసారిగా మంచి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. ఇప్పటివరకు డిఎంకె, ఎఐడిఎంకె మధ్యే ఆట సాగుతూ వచ్చిందని, ఈదఫా వామపక్షాలు, ఇతర పార్టీలన్నీ కలిసి పీపుల్స్ వెల్ఫేర్ కమిటీ పేరుతో ప్రత్యామ్నాయ ఫ్రంట్‌ను ఏర్పాటుచేయటం జరిగిందన్నారు. విజయకాంత్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా తాము ప్రచారం చేపట్టామన్నారు. ఇప్పటికే జైలుకు వెళ్లి మళ్లీ ఎప్పుడైనా జైలుకు వెళ్లే నేతలు కావాలో అక్కర్లేదో ఆ రాష్ట్ర ప్రజలే నిర్ణయించుకోవాల్సి వుందన్నారు. కేరళలో కాంగ్రెస్ కోమాలోకి వెళ్లిపోయిందని, ఎల్డీఎఫ్ తిరిగి అధికారంలోకి రాగలదన్నారు. పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయనున్నామన్నారు.
అస్సాంలో మాత్రం వామపక్షాలు వేర్వేరుగా పోటీ చేస్తున్నాయన్నారు. ఏది ఏమైనా దేశవ్యాప్తంగా పైన పటారం, లోన లొటారం చందంగా బిజెపి పరిస్థితి తయారైందంటూ నారాయణ ఎద్దేవా చేశారు. విలేఖరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ పాల్గొన్నారు.