ఆంధ్రప్రదేశ్‌

సీఆర్డీఏ చట్టం రద్దు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాథికార అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) చట్టం రద్దుకానుంది. రాజధానిని విశాఖకు తరలిస్తున్న నేపథ్యంలో సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసి విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి పట్టణాభివృద్ధి సంస్థ (వీజీటీఎం ఉడా)ను పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి చట్ట సవరణ బిల్లును ఈనెల 20, 21,22 తేదీల్లో జరిగే శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు విశ్వసనీయ సమాచారం. వికేంద్రీకరణపై ఏర్పాటైన హైపవర్ కమిటీ దీనిపై పూర్తి స్థాయిలో కసరత్తు జరుపుతోంది. సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయటంతో పాటు ఉడాను పునరుద్ధరించాలనే ప్రతిపాదన ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే ఇందులో న్యాయపరమైన చిక్కులు ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై సుదీర్ఘ చర్చ జరుగుతోంది. శాసనసభ సమావేశాలకు ముందు జరిగే కేబినెట్ భేటీలో దీన్ని ఆమోదించే అంశం పరిశీలనలో ఉంది. ఉడాను పునరుద్ధరించి మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గాన్ని సీఆర్డీఏ పరిధి నుంచి మినహాయించాలని మంత్రి పేర్ని నాని ప్రతిపాదించిన నేపథ్యంలో దీనిపై హైపవర్ కమిటీలో సుదీర్ఘంగా చర్చించినట్లు చెప్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం రాజధాని నిర్మాణానికి
సంబంధించి భూ సమీకరణ, అర్బన్ ప్లానింగ్, అభివృద్ధికి సంబంధించి గత ప్రభుత్వం 2014లో సీఆర్డీఏ చట్టాన్ని ముందుకు తెచ్చింది. రాజధాని ప్రాంతంలో 33వేల 500 ఎకరాల భూ సమీకరణ ఒప్పందం కుదుర్చుకున్న 21వేల మంది రైతులకు ఏటా కౌలు, రైతు కూలీలకు పింఛన్ల చెల్లింపు, భూముల కేటాయింపు, జోన్ల వారీ అభివృద్ధికి ప్రణాళిక, ఇతర లావాదేవీలు నిర్వహించేందుకు గతంలో ఉన్న విజీటీఎం ఉడా స్థానే సీఆర్డీఏను ఏర్పాటు చేశారు. మునిసిపల్, రెవెన్యూ, వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి డిప్యూటేషన్‌పై అధికారులు, సిబ్బందిని నియమించటంతో పాటు గతంలో ఉన్న ఉడా పరిధిని విస్తృతం చేశారు. కృష్ణాజిల్లా నందిగామ మొదలు, గుంటూరు జిల్లా చిలకలూరిపేట వరకు సీఆర్డీఏ విస్తరించింది. 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రాజధాని నగరంతో పాటు 8630 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ వ్యవస్థ ఏర్పాటైంది. అయితే ప్రభుత్వం రాజధానిని వికేంద్రీకరిస్తున్న నేపథ్యంలో సీఆర్డీఏను రద్దుచేసి ఉడాను పునరుద్ధరిస్తోంది. ఇందులో భాగంగా వచ్చే శాసనసభ సమావేశాల్లో ‘ ది ఆంధ్రప్రదేశ్ కేపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ రిపీల్ యాక్ట్, 2020’ను ప్రవేశపెట్టాలనే యోచనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల అనంతరం తక్షణమే సీఆర్డీఏ అధికారాలన్నింటినీ ఉడాకు బదలాయించే విధంగా శరవేగంతో ఫైళ్లు కదులుతున్నట్లు తెలిసింది. సీఆర్డీఏ పరిధిలో రుణాలు, రైతులకు చెల్లింపులు తదితర ఆర్థిక లావాదేవీలు కూడా ఉడాకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. సింగపూర్ సంస్థలు అందించిన మాస్టర్ ప్లాన్‌ను పరిశీలించి అందులో మార్పులు, చేర్పులతో జోనల్ ప్లానింగ్‌ను ఉడా 15 రోజుల్లోగా పూర్తి చేయాలని వౌఖిక ఆదేశాలు అందినట్లు సమాచారం. సీఆర్డీఏను రద్దు చేసినా భూ సమీకరణకు భూములిచ్చిన రైతులకు మరో మూడేళ్ల పాటు కౌలు చెల్లింపులు జరపాలని భావిస్తున్నారు. ఇవికాక సీఆర్డీఏ విక్రయించిన బాండ్‌లకు సంబంధించిన చెల్లింపులు కూడా ఉడాకు బదలాయించాలనే ప్రతిపాదనలు కూడా తెరపైకి వచ్చాయి. రైతులకు నివాస ప్లాట్ల కింద గత ప్రభుత్వం ఇచ్చిన విస్తీర్ణం కంటే 200 చదరపు గజాలు పెంచాలనే యోచనతో ఉన్నట్లు తెలిసింది. సీఆర్డీఏకు ప్రస్తుతం ఐఏఎస్ అధికారి కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఉడాను పునరుద్ధరించటం ద్వారా నామినేటెడ్ పోస్టులకు కూడా అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలియవచ్చింది.

రాష్ట్రంలో మూడు అభివృద్ధి మండళ్లు: చైర్మన్‌గా సీఎం
ఇదిలా ఉండగా ప్రాంతీయ మండళ్ల ఏర్పాటుకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును కూడా ప్రభుత్వం వచ్చే శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. ‘ఏపీ డిసెంట్రలైజేషన్ అండ్ ఈక్వల్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఆల్ రీజియన్స్ యాక్ట్-2020’ (సమాన ప్రాతిపదికన అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి) చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ప్రాంతీయ అసమానతలు తొలగించేందుకు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధిని వికేంద్రీకరించే విధంగా చట్టానికి రూపకల్పన జరిగింది. ఈ ప్రకారం రాష్ట్రంలో మూడు ప్రాంతాలకు మూడు అభివృద్ధి మండళ్లు ఏర్పాటు కానున్నాయి. ఒక్కో బోర్డులో 9 మందికి పైగా సభ్యులను నియమిస్తారు. ఆయా ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ఆర్థిక వనరులు తదితర అంశాలపై సభ్యులు ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారు. ఈ మండళ్లకు ముఖ్యమంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. బోర్డులో వైస్ చైర్మన్‌తో పాటు ఒక పార్లమెంట్ సభ్యుడు, ఇద్దరు ఎమ్మెల్యేలు, నలుగురు నామినేటెడ్ సభ్యులు ఉంటారు. కార్యదర్శిగా ఐఏఎస్ స్థాయి కలిగిన అధికారిని నియమిస్తారు. దీనివల్ల పాలనా వికేంద్రీకరణతో పాటు నామినేటెడ్ పదవులకు అవకాశం ఉంటుందనేది ప్రభుత్వ భావన. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు రూపొందించింది.