ఆంధ్రప్రదేశ్‌

రూ. 12,308 కోట్లతో తాగునీటి ప్రాజెక్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 20: రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో 12,308 కోట్ల రూపాయల వ్యయంతో తాగునీటి సరఫరా ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 13 జిల్లాల్లో ఏపీ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ ద్వారా తాగునీటి సరఫరా ప్రాజెక్టులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకుని ఈ ప్రాజెక్టులు నిర్మించాలని ప్రతిపాదించింది. ముందుగా ఆరు జిల్లాల్లో అమలు చేయాలని నిర్ణయించింది. తూర్పు గోదావరి జిల్లాలో 3960 కోట్ల రూపాయలతో, పశ్చిమ గోదావరి జిల్లాలో 3670 కోట్ల రూపాయలతో, శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో 700 కోట్లతో, గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో 2665 కోట్ల రూపాయలతో, ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతంలో 833 కోట్ల రూపాయలతో, కడప జిల్లా పులివెందుల ప్రాంతంలో 480 కోట్ల రూపాయలతో తాగునీటి సరఫరా ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు మనిషికి 100 లీటర్లు, పట్టణ ప్రాంతాల్లో 135 లీటర్ల చొప్పున తాగునీరు సరఫరా చేయాలని నిర్ణయించింది. 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుని 2051 నాటికి జనాభాను అంచనా వేసి, ఆ మేరకు ప్రాజెక్టులకు డిజైన్ చేయాలని ఆదేశించింది. పశువులు, తదితర అవసరాలకు స్థానిక జలవనరుల నుంచి నీటి సౌకర్యం కల్పించాలని, డిమాండ్ అంచనా నుంచి వాటిని తొలగించాలని ఆదేశించింది. నీటి కేటాయింపులకు సంబంధించి జలవనరుల శాఖ నుంచి స్పష్టమైన అనుమతులు తీసుకోవాలని ఆదేశించింది. రానున్న 30 సంవత్సరాలకు సరిపడా నీటి డిమాండ్‌ను అంచనా వేసి సరఫరా ప్రాజెక్టులకు డిజైన్ చేయాలని ఆదేశించింది. ఇళ్లకు సరఫరా చేసే నీటికి తప్పనిసరిగా మీటరింగ్ చేయాలని, టారిఫ్ నమూనా, రాయితీ, తదితర అంశాలను కూడా ప్రాజెక్టులో భాగంగా చేయాలని స్పష్టం చేసింది. కనిగిరి ప్రాంతంలో ప్రాజెక్టుకు సంబంధించి ఏడీబీ రుణానికి ఇప్పటికే రూపొందించిన నివేదికను సవరించాలని ఆదేశించింది. మిగిలిన ప్రాజెక్టులను హైబ్రీడ్ యాన్యుటీ విధానంలో చేపట్టేలా చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం గురువారం పాలనా ఆమోదం తెలిపింది.