ఆంధ్రప్రదేశ్‌

అభివృద్ధి వికేంద్రీకరణకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుండి అభివృద్ధిని వికేంద్రీకరించడమే మూల సిద్ధాంతంగా సాగుతూ వచ్చిందని, ఇప్పటికీ అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు సమపాళ్లలో అందించేందుకు తాము మనస్ఫూర్తిగా సహకరిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, విపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరిగి పరిపాలన ప్రజల చెంతకు చేరాలనేది ఎన్టీఆర్ హయాం నుంచి టీడీపీ విధానమని గుర్తుచేశారు. నాడు ఎన్టీఆర్ మాండలిక వ్యవస్థ తేవడం ద్వారా ప్రజల వద్దకు పరిపాలనను తీసుకెళ్లగలిగామన్నారు. ఆదివారం మంగళగిరి సమీపంలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్యాలయాలు మారిస్తేనో, 10మంది ఉద్యోగులను అటుఇటు బదిలీ చేస్తేనో అభివృద్ధి జరగదన్నారు. వైసీపీ ప్రభుత్వం పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో అంతా రివర్స్‌లో వెళుతోందని మండిపడ్డారు. ప్రజల సౌలభ్యం కోసం పరిపాలన ఉండాలే తప్ప పాలకుల స్వార్థం కోసం ప్రజలను ఇబ్బందులకు గురిచేయకూడదని సూచించారు. ప్రస్తుతం పాలనా వికేంద్రీకరణతో రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బాధ్యతాయుతమైన స్థానాల్లో
ఉన్నవారు ఇలా చేయడం సరికాదని సూచించారు. మండల, జిల్లాస్థాయిలో అన్ని శాఖల కార్యాలయాలు ఒకేచోట కేంద్రీకృతమైన నేపథ్యంలో రాష్టస్థ్రాయిలో కూడా అన్ని శాఖల కార్యాలయాలు ఒకేచోట సెక్రటేరియట్‌లో ఉండాలన్నారు. అప్పుడే వివిధ పనులపై వచ్చిన ప్రజలకు సులువుగా ఉంటుందని తెలిపారు. ఒక్కో శాఖ పనికి ఒక్కో ప్రాంతానికి వెళ్లాల్సి రావడం వల్ల ప్రజలపై వ్యయప్రయాసల భారం పడే అవకాశం ఉందన్నారు. ఓపక్క ఢిల్లీలో కేంద్ర కార్యాలయాలన్నింటినీ ఒకేచోటికి తీసుకొచ్చి 70వేల మంది ఉద్యోగులను కేంద్రీకృతం చేసి పరిపాలన కేంద్రీకృతం చేస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం ఉన్న శాఖలను నాలుగుచోట్లకు మార్చి పాలనా విచ్ఛిన్నానికి వైసీపీ ప్రభుత్వం పాల్పడుతోందని ఆయన విమర్శించారు. 10వేల ఎకరాల భూములపై కనే్నసినందుకే విశాఖకు రాజధానిని తరలించాలనే ఎత్తుగడ వేశారని ఆరోపించారు. నీటిపారుదల ప్రాజెక్టులపై టీడీపీ ప్రభుత్వం రూ. 72వేల కోట్లు ఖర్చు చేస్తే అందులో 40వేల కోట్లకు పైగా వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోనే ఖర్చు చేశామని గుర్తుచేశారు. నిజంగా ఉత్తరాంధ్రపై ప్రేమ ఉంటే ఈ 7నెలల్లో విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఏమేరకు నిధులు ఖర్చుచేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతిలో పనులన్నింటినీ నిలపివేసి లక్ష కోట్ల సంపదను నాశనం చేశారని విరుచుకుపడ్డారు. అభివృద్ధి వికేంద్రీకరణలో ఒక భాగమే అమరావతి అని, రాజధానితో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ, 13 జిల్లాల అభివృద్ధి ప్రణాళికను గత ఏడాది సెప్టెంబర్ 4న తాను అసెంబ్లీలో ప్రకటించిన విషయాన్ని ఈసందర్భంగా గుర్తుచేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ, రాజధానిగా అమరావతి అనే శీర్షికతో తాను చేసిన ప్రకటన అసెంబ్లీ రికార్డుల్లో ఉందన్నారు. అమరావతిని మూడు ముక్కలు చేసి ఒక్కో ముక్క ఒక్కో ప్రాంతంలో పెట్టడమే ముద్దు అంటూ ర్యాలీలు చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోతారని చంద్రబాబు హెచ్చరించారు.
ఇదిలావుండగా, టీడీఎల్పీ సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గైర్హాజరయ్యారు. 23మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురు సమావేశానికి గైర్హాజరయ్యారు. అలాగే సుమారు 10మందికి పైగా ఎమ్మెల్సీలు రాలేదు. ఎమ్మెల్యేల్లో గంటా శ్రీనివాసరావు, అనగాని సత్యప్రసాద్, ఆదిరెడ్డి భవాని, వాసుపల్లి గణేష్, బీ అశోక్ గైర్హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని పార్టీ విప్ జారీ చేసింది.