ఆంధ్రప్రదేశ్‌

శాసనమండలి రద్దు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్ర శాసనమండలి భవితవ్యం సోమవారం జరగనున్న మంత్రి మండలి సమావేశంలో తేలనుంది. మండలి రద్దుపై అధికార పక్షం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మండలి వ్యవహారాన్ని అసెంబ్లీలో సోమవారం చర్చించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించడంతో అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకూడదని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. అసెంబ్లీలో ఆమోదం పొందిన వికేంద్రీకరణ, ఏపీ సీఆర్డీఏ రద్దు బిల్లులను శాసనమండలి చైర్మన్ షరీఫ్ సెలక్ట్ కమిటీకి పంపడం తెలిసిందే. మూడు రాజధానుల అంశంపై వేగంగా ముందుకు వెళుతున్న ప్రభుత్వానికి మండలి నిర్ణయంతో కొంతమేర బ్రేక్ పడింది. ఈనేపథ్యంలో మండలి రద్దు వ్యవహారం తెరపైకి వచ్చింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపడంతో ఇతర మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. మండలిలో టీడీపీకి బలం ఉండటంతో బిల్లుల ఆమోదం కష్టసాధ్యం గా మారుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో సోమవారం మండలి రద్దు అంశంపై చర్చిద్దామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఇందులోభాగంగా సోమవారం ఉదయం 9గంటలకు వెలగపూడి సచివాలయంలో మంత్రి మండలి సమావేశం కానుంది. మండలి రద్దు అంశమే ప్రధాన అజెండా అని తెలుస్తోంది. అయితే మండలి రద్దు వ్యవహారంపై అధికార పక్షం వ్యూహాత్మకంగా
పావులు కదుపుతోంది. మండలిలో టీడీపీ బలానికి అడ్డుకట్ట వేయడంపై కూడా దృష్టి సారించింది. టీడీపీ ఎమ్మెల్సీలకు గాలం వేస్తున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అధికార పక్షానికి సహకరించేందుకు తగినంత మంది టీడీపీ ఎమ్మెల్సీలు ముందుకొస్తే, మండలి రద్దుచేసే అవకాశం లేకపోవచ్చని తెలుస్తోంది. చివరి నిముషం వరకూ మండలిని రద్దు చేస్తున్నామన్న సంకేతాలను అధికార పక్షం ఇస్తోంది. సంవత్సరం తరువాత మండలిలో వైకాపాదే పైచేయి అయ్యే అవకాశం ఉండటం, రద్దుకు తీర్మానం చేసి పంపినా ఎంతకాలంలోగా పార్లమెంట్ ఆమోదం లభిస్తుందో స్పష్టత లేని నేపథ్యంలో మండలి రద్దును కొంతమంది వైకాపా నేతలు వ్యతిరేకిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్సీల నుంచి వచ్చే సానుకూలత పైనే మండలి భవిత ఆధారపడి ఉందనే ప్రచారం జరుగుతోంది. మంగళగిరిలో జరిగిన టీడీఎల్పీ సమావేశంలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకూదని టీడీపీ నిర్ణయించింది. అసెంబ్లీలో శాసనమండలి గురించి మాట్లాడటమే రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానిస్తోంది. ఎమ్మెల్సీలు జారిపోకుండా టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఆదివారం నాటి టీడీఎల్పీ సమావేశానికి కొందరు ఎమ్మెల్సీలు గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మండలి కొనసాగుతుందా? రద్దవుతుందా? అనే చర్చతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి.