ఆంధ్రప్రదేశ్‌

ఉధృతమవుతున్న రైతుల నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 27: అమరావతిని రాజధానిగా కొనసాగించాలని, ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ రాజధాని ప్రాంత రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలు రోజురోజుకూ ఉద్ధృతమవుతున్నాయి. ఓ పక్క రాజధాని ప్రాంత 29 గ్రామాల ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తుంటే మరో పక్క ప్రభుత్వం నిరంకుశ ధోరణితో మూడు రాజధానుల నిర్ణయానికి చట్టబద్దత కల్పించే అంశంపై ముందుకు వెళ్లడాన్ని రాజధాని రైతులు తీవ్రస్థాయిలో తప్పుబడుతున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల తీరుపై ఆ ప్రాంత ప్రజలు తమ నిరసన స్వరాన్ని పెంచుతున్నారు. రాజధాని రైతుల ఆందోళనలు సోమవారం నాటికి 41వ రోజుకు చేరాయి. అమరావతిలోని మందడం, తుళ్లూరులో రైతులు మహాధర్నాలు నిర్వహించగా వెలగపూడి, కృష్ణాయపాలెం, నవులూరు, ఎర్రబాలెం, నిడమర్రు తదితర గ్రామాల్లో రైతులు, మహిళలు రిలే నిరాహార దీక్షలను కొనసాగించారు. వెలగపూడి, ఎర్రబాలెంలలో దీక్షలు చేస్తున్న రైతులు, మహిళలకు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ సంఘీభావం తెలిపారు. దీక్షల్లో కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎర్రబాలెంలో నిర్వహించిన దీక్షా శిబిరంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించి ముఖ్యమంత్రి జగన్ మనసు మార్చుకునేలా చేయాలని కోరారు. పెనుమాకలో నిర్వహించిన దీక్షా శిబిరంలో రైతులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజధాని అమరావతిని మూడు ముక్కలు చేయవద్దని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దెబ్బతీయవద్దంటూ తుళ్లూరులో ధర్నాలో పాల్గొన్న రైతులు, మహిళలు ఒక్కటై నినదించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఆందోళనలు చేస్తున్న రైతులు, మహిళలు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని సైతం కాలరాస్తూ ఏకపక్షంగా ముందుకెళ్తోందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓ వైపు తామంతా ఉద్యమాలు చేస్తుంటే ప్రభుత్వం అవన్నీ పట్టనట్లు మండలిని రద్దు చేసిందని మండిపడ్డారు. భూములు ఇచ్చిన రైతులు, మహిళలపైనే విచక్షణా రహితంగా దాడులు చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. తమ ఆవేదనను బయటి ప్రపంచానికి తెలియజేస్తున్న మీడియాపైనా ఉక్కుపాదం మోపడాన్ని రైతులు ఈ సందర్భంగా ఖండించారు. మండలి రద్దును ఆమోదించిన క్యాబినెట్ శాసనసభను కూడా రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. .
జేఏసీకి మద్దతుగా కర్నాటక రైతులు
విజయవాడ: రాజధాని అమరావతి పరిరక్షణ కోసం ఉద్యమం చేస్తున్న రైతులను పరామర్శించేందుకు వచ్చిన కర్నాటక రైతులను పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించడంతో నగరంలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. నగరంలోని ధర్నా చౌక్ వద్ద అమరావతి పరిరక్షణ కోసం జరుగుతున్న నిరసన దీక్షా శిబిరాన్ని సోమవారం సందర్శించిన కర్నాటక రైతుల బృందం కొద్ది సేపు నిరసన కార్యక్రమంలో కూర్చుని రాజధాని ప్రాంతం మందడంలోని రైతులను పరామర్శించేందుకు బయలుదేరారు. రెండు బృందాలుగా బయలుదేరిన రైతులు కొంత మంది మందడం చేరుకోగా మరికొంత మందిని ప్రకాశం బ్యారేజీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకు దిగిన రైతులను కృష్ణలంక పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ సభ్యులు పెద్ద సంఖ్యలో కృష్ణలంక స్టేషన్‌కు చేరుకుని పోలీసు స్టేషన్ వద్ద బైఠాయించారు. పోలీసు స్టేషన్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెద్ద సంఖ్యలో నిరసన జరగడంతో సాయంత్రం 4 గంటల సమయంలో స్థానికులు, రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో పోలీసు స్టేషన్ వద్ద చేరుకున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పీ రామకృష్ణ తదితరులు స్టేషన్ వద్దకు చేరుకుని రైతులకు మద్దతుగా నిలిచారు. అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ కన్వీనర్ ఏ శివారెడ్డి, కో కన్వీనర్ గద్దె తిరుపతిరావు, సభ్యులు ఆర్‌వీ స్వామి పలువురు రైతులకు అండగా నిరసన వ్యక్తం చేశారు.
వెంటనే విడుదల చేయాలి: చంద్రబాబు
గుంటూరు: అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ గత 40 రోజులుగా ఆందోళనలు, నిరసనలు చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు కర్ణాటక నుంచి వచ్చిన రైతులను పోలీసులు అరెస్టు చేయటం దారుణమని టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఖండించారు. సోమవారం విజయవాడ నుండి రాజధాని ప్రాంతానికి వస్తున్న కర్ణాటక రైతులను ప్రకాశం బ్యారేజీ వద్ద పోలీసులు అడ్డుకుని కృష్ణలంక పోలీసుస్టేషన్‌కు తరలించడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సంఘీభావం తెలిపేందుకు కర్ణాటక నుంచి వచ్చిన వారిని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. సాటిరైతులు కష్టంలో ఉన్నారని, వారికి సంఘీభావం చెప్పడం నేరమా అంటూ నిలదీశారు.
*చిత్రం... దీక్షా శిబిరంలో రైతులు