ఆంధ్రప్రదేశ్‌

బెడ్‌కు ముగ్గురు... నేలపై ఇంకొందరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, సెప్టెంబర్ 18: ‘బెడ్‌కు ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు, నలుగురు రోగులు.. ఇంకొందరికి కటిక నేలే గతి.. తల్లితో పాటు బెడ్‌పై ఉండాల్సిన చిన్నారులు ఒంటరిగా ఇలాంటి దైన్య పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నారు. అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో దర్శనమిస్తున్న దుస్థితి ఇది. అనంతపురం జిల్లాను డెంగ్యూ, మలేరియా వ్యాధులు వణికిస్తున్నాయి. వీటితో పాటు టైఫాయిడ్, చికున్‌గన్యా, డయేరియా తదితర వ్యాధుల బారినపడి వేలాది మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు విష జ్వరాల బారిన పడి ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. దీంతో హిందూపురంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, అనంతపురంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చేరుతున్న చిన్నారుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చిన్నపిల్లల వార్డుల్లో తగినన్ని మంచాలు లేకపోవడంతో ఒక్కో బెడ్‌పై ముగ్గురు, నలుగురు పిల్లలను పడుకోబెడుతున్నారు. అనంతపురంలోని సర్వజన ఆసుపత్రిలో ఆదివారం చిన్నపిల్లల వార్డు కిక్కిరిసిపోయింది.
మంచాల కొరత కారణంగా ఒక్కో బెడ్‌పై నలుగురి వరకూ పిల్లల్ని పడుకోబెట్టి వైద్యం అందిస్తున్నారు. ఇంకొందరు చిన్నారులను కటిక నేలపైనే పడుకోబెట్టుకోవాల్సిన దుస్థితి తప్పడం లేదు. కాగా శనివారం తన జన్మదినం కావడంతో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్వయంగా పిల్లల వార్డులను పరిశీలించి బెడ్స్ కొరతను గుర్తించారు. మంచాలు, బెడ్లు అద్దెకు తీసుకు వచ్చి ఏర్పాటు చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామస్వామినాయక్‌ను ఆదేశించారు. ఇదిలా ఉండగా మూడు, నాలుగు రోజుల నుంచి తాము తమ చిన్నారులను ఇక్కడే ఉంచుకుని చికిత్స చేయించుకుంటున్నామని తల్లిదండ్రులు వాపోయారు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో ఈ నెలలోనే ఇప్పటి వరకూ 40 దాకా డెంగ్యూ కేసులు నమోదు కాగా, ఈ ఏడాదిలో మొత్తం 144 కేసులు నమోదయ్యాయి. ఇక మలేరియా కేసులు 506 నమోదయ్యాయి. గత ఐదారు నెలల్లో మలేరియాతో దాదాపు 15 మంది చిన్నారులు మృత్యువాత పడినట్లు సమాచారం. సీజనల్ వ్యాధుల నివారణకు కలెక్టర్ కోన శశిధర్ ఆధ్వర్యంలో యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టినట్లు డిఎంఅండ్‌హెచ్‌ఓ వెంకటరమణ ఆంధ్రభూమికి తెలిపారు.

అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఒకే బెడ్‌పై చికిత్స పొందుతున్న ముగ్గురు చిన్నారులు