ఆంధ్రప్రదేశ్‌

ఇళ్ల స్థలాల సర్వేను అడ్డుకున్న మహిళలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 19: ఓ వైపు రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ పెద్ద ఎత్తున ఉద్యమం నడుస్తున్న క్రమంలో రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు భూముల సర్వే నిమిత్తం అడుగుపెట్టిన రెవెన్యూ అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం రాజధాని పరిధిలోని మందడం, కృష్ణాయపాలెం గ్రామాల మధ్య భూముల సర్వే కోసం వచ్చిన అధికారులను రాజధాని ప్రాంత రైతులు, మహిళలు అడ్డుకుని ప్రశ్నల వర్షం కురిపించారు. బుధవారం దుగ్గిరాల, మంగళగిరి తహశీల్దార్‌లు, రెవెన్యూ సిబ్బంది వాహనాల్లో మంగళగిరి నుంచి మందడం వైపునకు వచ్చారు. సమాచారం తెలుసుకున్న రాజధాని రైతులు, మహిళలు నిముషాల వ్యవధిలో వందలాదిగా తరలివచ్చి అధికారుల వాహనాలను అడ్డగించారు. ఎటువంటి సమాచారం లేకుండా మా పొలాల్లో ఎందుకు సర్వే చేస్తున్నారంటూ నిలదీశారు. ఓ పక్క రాజధాని ఉద్యమానికి సంబంధించి అమరావతి తరలింపు అంశంపై కోర్టులో కేసులు నడుస్తున్న సమయంలో ఈ ప్రాంతంలో ఎందుకు సర్వే చేయాల్సి వచ్చిందో చెప్పాలని అధికారులను నిలదీశారు. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే భూముల సర్వేకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టంచేస్తూ అధికారుల వాహనాలను వందలాది మంది మహిళలు చుట్టుముట్టి ధర్నాకు దిగారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం రైతులకు ఎటువంటి సమాధానం చెప్పకపోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులకు సర్దిచెప్పగా, రెవెన్యూ అధికారులు సర్వేకు తాత్కాలికంగా స్వస్తిచెప్పి తిరుగుముఖం పట్టారు.
*చిత్రం...అధికారుల వాహనాలను చుట్టుముట్టిన రాజధాని ప్రాంత మహిళలు, రైతులు