ఆంధ్రప్రదేశ్‌

రష్యాపై ఆధారపడే పరిస్థితులు మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 20: రక్షణ రంగానికి సంబంధించి యుద్ధ నౌకలు, జలాంతర్గాముల మరమ్మతుల కోసం మిత్రదేశం రష్యాపై ఆధారపడే పరిస్థితులు మారాలని హిందుస్తాన్ షిప్‌యార్డ్ సీఎండీ రియల్ అడ్మిరల్ ఎల్‌వీ శరత్‌బాబు అన్నారు. భారత నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్ సింధువీర్‌కు మరమ్మతులు పూర్తిచేసి నేవల్ డాక్‌యార్డుకు అప్పగించే సందర్భంలో హెచ్‌ఎస్‌ఎల్‌లో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారత రక్షణ రంగంలోని కీలక భూమిక పోషించే యుద్ధ నౌకలు, జలాంతర్గాములను దేశీయంగానే మరమ్మతులు చేసుకునే శక్తి సామర్థ్యాలు మనకున్నాయన్నారు. జలాంతర్గాములను గతంలో పలు సందర్భాల్లో రష్యాకు తీసుకువెళ్లి మరమ్మతులు చేయించి తిరిగి తీసుకువచ్చిన సందర్భాలను ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. మరమ్మతులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పొరుగు దేశాల నుంచి అభ్యర్థించే పరిస్థితులు మారాయన్నారు. దేశీయంగా ప్రభుత్వ రంగ సంస్థలే కాకుండా, ప్రైవేటు సంస్థలు కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనులు చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నాయన్నారు. ప్రస్తుతం రికార్డు సమయంలో మరమ్మతులు పూర్తి చేసుకున్న ఐఎన్‌ఎస్ సింధువీర్ జలాంతర్గామి మరమ్మతుల నిమిత్తం హెచ్‌ఎస్‌ఎల్‌కు రావడం వెనుక పలువురి కృషి ఉందన్నారు. తొలుత జలాంతర్గామిని మరమ్మతుల కోసం రష్యా పంపాలని నిర్ణయించినా చివరి నిముషంలో హెచ్‌ఎస్‌ఎల్‌కు పంపారన్నారు. 30 నెలల కాల వ్యవధిలో నేవల్ డాక్‌యార్డు, సింధువీర్ సిబ్బంది పూర్తి సహకారంతో హెచ్‌ఎస్‌ఎల్ పూర్తి చేయగలిగిందన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ), ఇతర ఔట్‌సోర్సింగ్ సంస్థలు పూర్తిగా సహకరించాయన్నారు. సింధువీర్ మరమ్మతుల సమయంలో ఒక్క ప్రమాదం కూడా జరగలేదని, భద్రత అంశాల్లో కూడా ఎక్కడా పొరపాట్లు చోటుచేసుకోలేదని, ఒక్క పని గంట కూడా ఓవర్ టైం చేయలేదని సీఎండీ తెలిపారు. నేవల్ డాక్‌యార్డ్ కమాండ్ సూపరింటెండెంట్ శ్రీ కుమార్ నాయర్ మాట్లాడుతూ దేశ రక్షణలో కీలకమైన సింధువీర్ జలాంతర్గామిని అనుకున్న సమయంలో మరమ్మతులు పూర్తి చేసి రక్షణ శాఖకు అందజేసిన హెచ్‌ఎస్‌ఎల్ ఘనతను ప్రశంసించారు. ఐఎన్‌ఎస్ సింధువీర్ కమాండింగ్ అఫీసర్ అమిత్ శర్మ మాట్లాడుతూ జాతి ప్రయోజనాలను కాంక్షించి పనిచేసే రక్షణ రంగంలో కీలకమైన జలాంతర్గామి మరమ్మతులను హెచ్‌ఎస్‌ఎల్ రికార్డు సమయంలో పూర్తి చేసిందన్నారు. సుమారు 500 కోట్ల వ్యయంతో 30 నెలల కాల వ్యవధిలో దీన్ని పూర్తి చేయడం విశేషమన్నారు. ఈ సందర్భంగా సాంకేతిక సహకారం అందించిన రష్యన్ ఇంజనీరింగ్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
*చిత్రం...హెచ్‌ఎస్‌ఎల్ సీఎండీ శరత్‌బాబుకు జ్ఞాపికను బహూకరిస్తున్న నేవల్ డాక్‌యార్డ్ కమాండింగ్ సూపరింటెండెంట్ శ్రీకుమార్ నాయర్