ఆంధ్రప్రదేశ్‌

ఆలయాలు, చర్చిల్లో రాజధాని మహిళల ప్రార్థనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: ఆంధ్ర ప్రజల ఆకాంక్ష అయిన అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని, అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట తెచ్చిన మూడు రాజధానుల అంశాన్ని ఉపసంహరించుకోవాలని చేపట్టిన రాజధాని ఉద్యమం రోజురోజుకూ ఉగ్రరూపం దాల్చుతూనే ఉంది. మొక్కవోని దీక్షతో రైతులు, మహిళలు, రైతుకూలీలు, యువకులు, జేఏసీ నాయకులు అందివచ్చిన ప్రతీ అంశాన్ని వినియోగించుకుంటూ తమదైన పంథాలో ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేసేందుకు శుభకార్యాలు, పండుగలు, పబ్బాలనే తేడాలేకుండా అన్ని సందర్భాల్లోనూ తమదైన ఏకైక నినాదాన్ని వినిపిస్తూనే ఉన్నారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా రాజధాని రైతులు చేస్తున్న ఆందోళనలు ఆదివారంతో 68వ రోజుకు చేరుకున్నాయి. రాజధాని ప్రాంతానికి చెందిన మహిళలు ఆలయాలు, చర్చిలు, మసీదులకు వెళ్లి పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మనసు మార్చాలని దైవాలను వేడుకున్నారు. ఇందులోభాగంగా రాయపూడి నుండి పశ్చిమ గోదావరి జిల్లాలోని నిర్మలగిరి పుణ్యక్షేత్రానికి దళిత రైతులు యాత్రగా బయలుదేరి వెళ్లారు. అక్కడ మేరీమాతను దర్శించుకుని అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగేలా చూడాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. తుళ్లూరు, తాడికొండ, వెలగపూడి, కృష్ణాయపాలెం, మందడం గ్రామాలకు చెందిన మహిళలు అమరావతిలోని పుణ్యక్షేత్రమైన అమరేశ్వరుని దర్శనానికి తరలివెళ్లారు. యాత్రలో భాగంగా పచ్చజెండాలు చేతపట్టి ‘జై అమరావతి .. సేవ్ అమరావతి’ అంటూ నినాదాలు చేశారు. రాజధాని చిహ్నమైన అమరావతిలోని ధ్యానబుద్ధ విగ్రహం వద్ద జాతీయ, ఆకుపచ్చ జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. కాగా, అదే సమయంలో అమరావతి శివారు ప్రాంతం మీదుగా వెళుతున్న బాపట్ల పార్లమెంట్ సభ్యుడు నందిగం సురేష్ వాహనం రైతులను రాసుకుంటూ ముందుకెళ్లింది. దీంతో తుళ్లూరుకు చెందిన రైతు తాడికొండ హనుమంతరావు కిందపడ్డాడు. ఆయన కుడికాలు చిటికెన వేలికి గాయమైంది. స్పందించిన సహచర రైతులు దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. ఘటన జరిగిన సమయంలో ఎంపీ సురేష్ కారులోనే ఉన్నారు. ఇదిలావుంటే, రాజధాని ప్రాంతంలో మరో గుండె ఆగింది. ఎర్రబాలేనికి చెందిన కోలా సీతారావమ్మ(70) అనే మహిళ గుండెపోటుతో కన్నుమూసింది. రాజధాని అమరావతి కోసం తనకున్న రెండు ఎకరాల పొలం ప్రభుత్వానికి ఇచ్చింది. రాజధాని ఉద్యమంలో కొద్దికాలంగా చురుగ్గా పాల్గొంటూ వస్తోందని, రాజధాని మార్పుపై మనోవేదనతోనే సీతారావమ్మ మృతి చెందిందని బంధువులు తెలిపారు. తుళ్లూరు దీక్షా శిబిరంలో చిన్నారులు, మహిళలు కళారూపాలు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. మందడం, కృష్ణాయపాలెం, పెనుమాక, వెలగపూడి, తదితర గ్రామాల్లో రైతులు 24గంటల దీక్షలు కొనసాగించారు. 150 మందికి పైగా దళిత రైతులు, మహిళా జేఏసీ నాయకులు రాజధాని గ్రామాలను సందర్శించి రైతులకు సంఘీభావం తెలిపారు. సుంకర పద్మశ్రీ, సునీత, మాలతి, అనుపమ, అనూరాధ, తదితరులు పాల్గొన్నారు. మరోవైపు సోమవారం రాజధాని పరిధిలోని 29 గ్రామాల రైతులు, రైతుకూలీలు, మహిళలు సీడ్ యాక్సెస్ రోడ్డులోని రాయపూడి వద్ద ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి వెంకటపాలెం వరకు మానవహారం ఏర్పాటు చేయనున్నారు. అటువైపుగా వెళ్లే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నమస్కరిస్తూ నిశ్శబ్దంగా నిరసన తెలియజేయాలని నిర్ణయించారు.

*చిత్రం... అమరేశ్వరుని దర్శించుకునేందుకు పాదయాత్రగా వెళుతున్న రైతులు, మహిళలు