ఆంధ్రప్రదేశ్‌

ఆరు గంటల హైడ్రామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 27: విశాఖ విమానాశ్రయం గురువారం రణరంగంగా మారింది. వైసీపీ, టీడీపీ శ్రేణులు భారీగా తరలిరావడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విపక్షనేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు ప్రజాచైతన్యయాత్రలో భాగంగా ఉదయం 11 గంటలకు విశాఖ విమానాశ్రయం చేరుకోగా టీడీపీ నాయకులు,కార్యకర్తలు ఘనస్వాగతం పలికేందుకు భారీగా తరలిరాగా, ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ వైసీపీ నేతలు బలప్రదర్శనకు దిగాయి. దీంతో విశాఖ విమానాశ్రయం అంతటా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కాన్వాయ్‌లో తన వాహనంలోనే దాదాపు నాలుగు గంటలపాటు ఉండిపోగా, మధ్యాహ్నం కొద్దిసేపు వాహనం నుంచి దిగి రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలియజేశారు. చివరకు బాబును పోలీసులు 151 సెక్షన్ కింద అరెస్టు చేసి విమానాశ్రయం వీఐపీ లాంజ్‌లోకి తరలించారు.చంద్రబాబునాయుడు ఉదయం 11 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకోగా టీడీపీ నేతలు భారీగా స్థాయిలో స్వాగతం పలికేందుకు బాబు వాహనశ్రేణి కొంత దూరం వెళ్లేసరికి విశాఖ పాలనా రాజధానిగా వ్యతిరేకిస్తున్న బాబు ‘గో బ్యాక్’ అంటూ వైసీపీ శ్రేణులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ తీవ్రస్థాయిలో నినాదాలు చేస్తూ నిరసనకు దిగాయి. చంద్రబాబునాయుడు కాన్వాయ్‌కు అడ్డుగా పడుకుని కదలనీయకుండా చేశాయి. నాలుగున్నర గంటలకు పైగానే ఈ హైడ్రామా కొనసాగింది. కాన్వాయ్‌లోని తన కారులోనే ఉండిపోయిన చంద్రబాబు ఒకానొక దశలో నడుచుకుని వెళ్లడానికి కిందకు దిగి కొరంత మేరకు ముందుకు సాగారు. అయితే చంద్రబాబునాయుడు వ్యక్తిగత భద్రతా సిబ్బంది, స్థానిక పోలీసులు వారించి తిరిగి ఆయన్ని వాహనంలోకి పంపాల్సి వచ్చింది. అప్పటికీ వైసీపీ శ్రేణులు వెనక్కి తగ్గకపోవడంతో మరో రెండు గంటలపాటు బాబు వాహనంలోనే ఉండిపోయారు. ఈ సందర్భంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో విశాఖ విమానాశ్రయం పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విశాఖను పాలనా రాజధానిగా అంగీకరించే వరకు బాబును విశాఖలో కాలు మోపనీయమంటూ వైసీపీ శ్రేణులు భీష్మించడంతో పరిస్థితులు ఎక్కడకి దారితీస్తాయోనన్న ఆందోళన నెలకొంది. ఎట్టకేలకు సాయంత్రం నాలుగు గంటల తరువాత పోలీసులు చంద్రబాబునాయుడ్ని వెనక్కి వెళ్ళాల్సిందిగా అభ్యర్థించారు. దీనికి ససేమీరా అన్న చంద్రబాబు తాను వెనక్కి మళ్ళేది లేదంటూ తేల్చి చెప్పారు. తనను ఎందుకు వెనక్కి పంపుతున్నారనేది చెప్పాలంటూ పోలీసులను బాబు నిలదీశారు. దీనికి స్పందించిన పోలీసులు శాంతిభద్రతల దృష్ట్యా తమకు సహకరించాల్సిందిగా కోరుతూ సెక్షన్-151 ప్రకారం చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకుని విశాఖ విమానాశ్రయంలో వీఐపీ లాంజ్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసుల వైఖరి పట్ల బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాన్వాయ్‌లో ఉన్న వాహనంలోనే దాదాపు నాలుగు గంటలపాటు గడిపిన బాబు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. ఎండ తీవ్రతతో బ్లాక్ కమెండోలు బాబుకు గొడుగుపెట్టారు. మరోపక్క ఇదే
సమయంలో పరిసరాల్లో టీడీపీ, వైసీపీ మహిళల మధ్య పరసర్ప దూషణలతో పరిస్థితులు అదుపుతప్పాయి. ఇరువర్గాల శ్రేణులు పరస్పర ఆరోపణలు, వాగ్వివాదాలతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న తొలి రెండు గంటలపాటు అడ్డుకునే ప్రయత్నాలు చేసిన పోలీసులు ఆ తరువాత ప్రేక్షకపాత్రనే పోషించిన సంఘటన అందర్నీ విస్మయపరిచింది. విమానాశ్రయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు నెలకొన్న పరిస్థితులతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. లాంజ్ లోపలకి వెళ్ళేందుకు వీల్లేని పరిస్థితుల్లో చేసేదిలేక పోలీసుల సహాయాన్ని తీసుకున్న ప్రయాణికులు లోపలకు వెళ్ళి ఊపిరి పీల్చుకున్నారు. మరికొంతమంది ప్రయాణికులను పోలీసులు తమ వాహనాల్లో ఎక్కించి లోపలకు చేర్చారు.
*చిత్రం...వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు, పోలీసుల తీరును నిరసిస్తూ బైఠాయించిన చంద్రబాబు