ఆంధ్రప్రదేశ్‌

నానాటికీ తీసికట్టు తుంగభద్ర ఆయకట్టు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, సెప్టెంబర్ 20: కర్నాటకలోని తుంగభద్ర జలాశయంపై ఆధారపడిన కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌లోని ఆయకట్టు రైతుల పరిస్థితి ఈసారి మరీ అధ్వాన్నంగా తయారైంది. జలాశయానికి ఈసారి 50 టిఎంసిల నీరు మాత్రమే వచ్చి చేరింది. తుంగభద్ర జలాశయం చరిత్రలో ఇంత తక్కువ పరిణామంలో వరద నీరు రావడం ఇదే మొదటిసారి. జలాశయంలో అనుకున్న మేరకు నీరు లేకపోవడంతో 10 రోజులకు ఒక్కసారి తుంగభద్ర కాల్వలకు నీరు విడుదల చేయాలని నిర్ణయించారు. ఇలా వంతుల వారీ నీటి విడుదల ఉత్తర్వులు జారీచేయడం జలాశయం చరిత్రలో ఇదే ప్రథమం. 10 రోజులకు ఒక్కసారి తుంగభద్ర దిగువ, ఎగువ కాల్వలు, రాయచూరు కాల్వ, రాయబసవ కెనాల్‌కు నీటిని విడుదల చేస్తామని అధికారులు ప్రకటించడంతో కర్నాటక రైతుల్లో ఆందోళన మొదలైంది. అదే సమయంలో మన రాష్ట్ర రైతుల పరిస్థితి పోకచెక్కలా తయారైంది. మన వాటా నీటిని విడుదల చేసుకుంటే కర్నాటక రైతులు వాడుకుంటారు. అదే సమయంలో జలాశయంలో మన నీటివాటా 11 టిఎంసిలు ఖాళీ అవుతాయి. నీరు వస్తేనే పంటలు పచ్చగుంటాయి. లేదంటే ఎండిపోతాయి. దీంతో ఏం చేయాలో తెలియక రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. తుంగభద్ర జలాశయం క్యాచ్‌మెంట్ ప్రాంతాలైన శిమొగ్గ, మలనాడు, ఆగుంబె, పశ్చిమ కనుమల్లో ఈసారి తక్కువ వర్షపాతం నమోదైంది. ఫలితంగా జలాశయానికి ఆశించిన మేరకు నీరు చేరలేదు. దీనికితోడు కర్నాటక ప్రభుత్వం తుంగభద్ర జలాశయం ఎగువన ఎత్తిపోతల పథకాలు, చెక్‌డ్యామ్‌లు కట్టడంతో వరద నీరు సక్రమంగా చేరడం లేదు. గత పదేళ్లలో జలాశయానికి వచ్చిన నీటిని పరిశీలిస్తే ఈ విషయం అవగతమవుతుంది. 2010-11 సంవత్సరంలో 103.315 టిఎంసిల నీరు తుంగభద్ర జలాశయం చేరుకుంది. 2011-12లో 100,855 టిఎంసిలు, 2012-13లో 98.457 టిఎంసిలు, 2013-14లో 100.855 టిఎంసిలు, 2014-15లో 100.855 టిఎంసిలు, 2015-16లో 75.825 టిఎంసిలు, 2016-17 సంవత్సరంలో 50.633 టిఎంసిల నీరు మాత్రమే వచ్చింది. గత సంవత్సరం తక్కువ నీరు రావడంతో రబీ సీజన్ పంటలు, ఆయకట్టు భూములకు సాగునీరు ఇవ్వలేదు. అయితే ఈసారి కేవలం 50 టిఎంసిలు మాత్రమే రావడంతో ఖరీఫ్, రబీ సీజన్ పంటలకు నీరు రాని పరిస్థితి నెలకొంది. కర్నాటకలోని బళ్ళారి, గంగావతి, శిరుగుప్ప, కొప్పల్, హొస్పేట్ తదితర ప్రాంతాల్లో 2.50 లక్షల ఎకరాల్లో వరి పంట వేశారు. రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో 40 వేల ఎకరాలు, అనంతపురం జిల్లాలో 60 వేల ఎకరాల్లో వరి, పత్తి, ఆముదం, మిరప పంటలు వేశారు. వర్షాకాలం ప్రారంభంలో భారీ వర్షాలు కురిసి తుంగభద్ర జలాశయానికి భారీగా వరద రావడంతో డ్యాం నిండుతుందని భావించి రైతులు విరివిగా పంటలు సాగుచేశారు. అయితే ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో సరైన వర్షాలు లేకపోవడంతో 50 టిఎంసిలు కూడా దాటలేదు. దీంతో వంతుల వారి నీటి సరఫరాకు చర్యతీసుకోవడం రైతుల పాలీట శాపంగా మారింది. 10 రోజులకు ఒక్కసారి నీరు సరఫరా చేస్తే పంట దిగుబడి రాదని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట వేసుకున్న తరువాత నీరు లేదని చెప్పడం దారుణమని, ఎకరాకు రూ.50 వేలు ఖర్చు చేసి పంటలు వేసుకున్నామని, తీరా ఇప్పుడు నీళ్లు లేవంటే తామేం చేయాలని రైతులు అంటున్నారు. అధికారులు ముందుగానే హెచ్చరించి ఉంటే పంట వేసుకునేవారం కాదని రైతులు వాపోతున్నారు. ఈసారి జలాశయం నిండకపోవడం రైతులకు మనోవేదన మిగిల్చింది.
తుంగభద్ర ఎగువ, దిగువ కాలువలను నమ్ముకుని కర్నూలు, అనంతపురం జిల్లాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. అయితే ఈసారి జలాశయంలో నీళ్లు తక్కువగా ఉండడంతో తాగునీటికీ గండం ఏర్పడింది. కర్నాటకలోని హొస్పేట్, బళ్ళారి, శిరుగుప్ప, మాన్వి, సింధనూరు, కాటికి, కంప్లి, గంగావతి, కొప్పళ, రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో హాలహర్వి, హొళగుంద, ఆలూరు, ఆదోని, కౌతాళం, మంత్రాలయం, కోసిగి, ఎమ్మిగనూరు, పెద్దకడబూరు, నందవరం, కర్నూలు, గోనెగండ్ల,కోడుమూరు, అనంతపురం జిల్లాలో సగానికి పైగా మండలాలు, అనంతపురం నగరానికి తాగునీరు తుంగభద్ర కాల్వల ద్వారా సరఫరా జరుగుతోంది.