ఆంధ్రప్రదేశ్‌

విదేశీ రుణాలకు మోకాలడ్డు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 25: మరో ఆరు నెలల్లో ఈ ఆర్ధిక సంవత్సరం పూర్తవుతుంది. ఒక వైపు ఆర్ధిక లోటుతో కటకట. మరో వైపు కేంద్రం నుంచి ఆశించిన స్ధాయిలో నిధులు అందక సంక్షోభంలో కూరుకున్న రాష్ట్రానికి కేంద్రం విదేశీ రుణాలు సకాలంలో అందకుండా వేస్తున్న కొర్రీలతో అట్టహాసంగా ప్రారంభించిన 13 ప్రాజెక్టులు టేకాఫ్ కావడం లేదు. దాదాపు రూ. 37,778 కోట్ల విదేశీ రుణాలను అంతర్జాతీయ రుణ పరపతి సంస్ధల నుంచి పొందాలని రాష్ట్రప్రభుత్వం నివేదికలను, ప్రతిపాదనలను కేంద్రానికి పంపింది. ఈ ప్రతిపాదనలు కేంద్రం వద్ద నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం సగం గడిచినా కేంద్రం నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఉన్నతాధికారుల బృందం వచ్చే వారం ఢిల్లీకి వెళ్లి కేంద్రంపై వత్తిడి తేనుంది. ఈ ఏడాదికి కనీసం రూ. 25 వేల కోట్ల విదేశీ రుణాలు పొందేందుకు ఆమోదం ఇస్తే ఈ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది. ఏపి కమ్యూనిటీ ఆధారిత నీటి యాజమాన్య ప్రాజెక్టు-2, ఏపి ఇరిగేషన్ అభివృద్ధి ప్రాజెక్టు, ఏపి కరవు నివారణ ప్రాజెక్టు, ఏపి పట్టణ, గ్రామీణ మంచినీటి సరఫరా ప్రాజెక్టు, మండలాల మధ్య అనుసంధానం ప్రాజెక్టు, ఏపి రోడ్లు, వంతెనలు, పునర్నిర్మాణ ప్రాజెక్టు, ఏపి వైద్య శాఖ పటిష్టం చేసేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టు, రాష్ట్ర జాతీయ రహదారుల నిర్మాణ ప్రాజెక్టు, విస్తరణ ప్రాజెక్టు, అందరికీ 24 గంటల విద్యుత్, అమరావతి రాజధాని నగరాభివృద్ధి ప్రాజెక్టులను త్వరితగతిన చేపట్టేందుకు విదేశీ నిధుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత రెండేళ్లుగా కసరత్తు చేస్తున్నారు. ఈ ఏడాది రూ. 5 వేల కోట్ల కంటే ఎక్కువగా నిధులు తెచ్చుకునేందుకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవచ్చని ఆర్ధిక శాఖ వర్గాలు చెప్పాయి.
కేంద్రం వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టులకు క్లియరెన్సు ఇవ్వాలని చంద్రబాబు పలుసార్లు కేంద్రాన్ని కోరారు. ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా ప్రధానమంత్రి, ఆర్థిక శాఖ మంత్రిని చంద్రబాబు ఈ ప్రాజెక్టులకు విదేశీనిధులకు క్లియరెన్సుపై కోరారు. ఈ ప్రాజెక్టు మొత్తం విలువ రూ. 37,778 కోట్లు. కాగా ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ. 11,525 కోట్లు. విదేశీ ద్రవ్యపరపతి సంస్ధల నుంచి ఆంధ్ర రాష్ట్రం రూ. 26,253 కోట్ల నిధులను ఆశిస్తోంది.
గత ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రతిపాదనలను కేంద్రానికి ఆంధ్ర ప్రభుత్వం పంపింది.కాని ఇంతవరకు ఈ ప్రతిపాదనల క్లియరెన్సుపై కేంద్రం దృష్టిని సారించడం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నిధుల లేమి వల్ల ఇప్పటికే గ్రామీణ మంచినీటి పథకం, కమ్యూనిటీ నీటి యాజమాన్య పథకం, రాష్ట్ర హైవే విస్తరణ ప్రాజెక్టులను అనుకున్నట్లుగా రాష్ట్రప్రభుత్వం ప్రారంభించలేకపోయింది. ఈ ప్రతిపాదనలపై అనేక సార్లు వివరణలను కేంద్రం కోరిందని, ఎన్ని సార్లు స్పష్టత ఇచ్చినా, ఏదో ఒక సందేహంతో ఫైళ్లను పెండింగ్‌లో ఉంచుతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఈ నెలలో కేంద్రం రాష్ట్రానికి ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీ ప్రకటించి 20 రోజులు గడచినా, ఈ ప్రతిపాదనలకు మాత్రం మోక్షం లభించలేదు. ప్రపంచ బ్యాంకు, జపాన్ ఇంటర్నేషనల్ సహకార ఏజన్సీ, ఆసియాన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇనె్వస్ట్‌మెంట్ బ్యాంకు, ఆసియాన్ డెవలప్‌మెంట్ బ్యాంకు, బ్రిక్స్ బ్యాంకులు ఆంధ్రాకు నిధులు ఇచ్చేందుకు క్యూకడుతున్నాయి. తమకు కేంద్రం ఆమోదం తెలిపిన వెంటనే నిధులు ఇస్తామని ఈ బ్యాంకుల యాజమాన్యాలు రాష్ట్రప్రభుత్వానికి తెలిపాయి. ఈ ప్రాజెక్టుల ప్రారంభానికి కేంద్ర ఆర్ధిక వ్యవహారాల శాఖ,విదేశీ మారకద్రవ్య శాఖ అనుమతులు తప్పనిసరి.
రాష్ట్రప్రభుత్వం వైద్య, మంచినీటి పథకాలు, మండలాల మధ్య అనుసంధానం ప్రాజెక్టులను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వీటి అమలుకు అవసరమైన ప్రణాళికలను కూడా ఖరారు చేశారు.