ఆంధ్రప్రదేశ్‌

మహాలక్ష్మిగా కరుణించిన కనకదుర్గ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 7: ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శ్రీ దుర్ముఖనామ సంవత్సర దసరా మహోత్సవాల్లో ఏడో రోజైన ఆశ్వయుజ శుద్ధ షష్టి శుక్రవారం కావటంతో మహిళలకు ఎంతో ప్రీతిపాత్రమైన బెజవాడ దుర్గమ్మ శ్రీ మహాలక్ష్మిదేవిగా ఆశీనులై భక్తజనానికి దర్శనమిచ్చింది. దసరా సెలవులు.. అన్నింటిని మించి మహిళలకు పవిత్రమైన దినం కావటంతో తెల్లవారుఝాము నుంచే వేల సంఖ్యలో భక్తులు ఆబాల గోపాలంతో క్యూలైన్లలో బారులు దీరారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు అంతరాలయ దర్శనాన్ని కూడా రద్దుచేశారు. సిరిసంపదలు, సౌభాగ్యం, సంతానం, ధైర్య సాహసాలు, విజయానికి అధిష్టాన దేవత మహాలక్ష్మీ అమ్మవారు. పైగా సకల లోకాలకు ఐశ్వర్య ప్రదాయిని.. ఇరువైపులా గజరాజులు సేవిస్తుండగా రెండు చేతులతో కమలాలు ధరించి, అభయ, వార ముద్రలతో క్షీరాబ్ది పుత్రిక ఈ తల్లి భక్తులకు దర్శనమిచ్చింది. డోలాసురుడనే రాక్షసుడిని సంహరించి లోకాలకు శాంతిని ప్రసాదించింది. త్రిపుర త్రయంలో ఈమె మధ్య శక్తి.. ఈ లక్ష్మీదేవి ప్రతి రూపానికి గుర్తుగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయ ప్రాకారం చుట్టూ అష్టలక్ష్ములను ప్రతిష్ఠించడం జరిగింది.
శుక్రవారం దుర్గమ్మను దర్శించుకున్న ప్రముఖుల్లో టిడిపి ఏపి అధ్యక్షుడు కళా వెంకట్రావు, రాజమండ్రి ఎంపి మురళీమోహన్, సమాచారశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, డిజిపి నండూరి సాంబశివరావు, సమాచార హక్కు చట్టం కమిషనర్ విజయనిర్మల, పలువురు శాసనసభ్యులు వున్నారు. ఎంపి మురళీమోహన్ మాట్లాడుతూ ఇతర మతాలు విస్తరిస్తున్న తరుణంలో హిందూ మతం కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నందున హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందుకోసం హిందువులు ప్రతి ఒక్కరూ భవానీమాల, అయ్యప్పమాల, గోవిందమాల, శివమాల ధారణ చేసి హిందూ మత ప్రచారానికి తోడ్పడాలన్నారు.
ఇదిలా వుండగా శనివారం అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం కావటంతో శ్రీ సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు విశేషంగా తరలి రానున్నారు. దీన్ని దృష్టిలో వుంచుకుని నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ నేతృత్వంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచే నగరంలో ట్రాఫిక్ మళ్లింపు చర్యలతో పాటు క్యూలైన్‌ల నిడివిని పొడిగించడం జరిగింది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో రానున్నారు. దాన్ని కూడా దృష్టిలో వుంచుకుని అడుగడుగునా సాయుధ పోలీస్ బలగాలను మోహరించారు. ఇదే సమయంలో డిజిపి నండూరి సాంబశివరావు తన కార్యాలయం నుంచి సిసి కెమెరాల ద్వారా బందోబస్తు ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మూలా నక్షత్రం సందర్భంగా తెల్లవారుఝాము రెండు గంటల నుంచే భక్తులకు అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామని ఆలయ ఇవో ఎ.సూర్యకుమారి తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ఉండే విఐపిల దర్శనాన్ని రద్దుచేస్తూ రెండు నుంచి నాలుగు గంటల వరకు అనుమతిస్తామని చెప్పారు. అయితే అందరికీ అంతరాలయ దర్శనాన్ని రద్దు చేస్తున్నామన్నారు.