ఆంధ్రప్రదేశ్‌

‘కాపు’లర్ లేకనే కష్టాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 8: ఉద్యమాలతో సర్కారును వణిస్తున్న కాపునేత ముద్రగడను ఎదుర్కొనే స్థాయి నేతలు లేకపోవడం తెలుగుదేశం పార్టీకి సమస్యగా మారింది. కాపుకార్పొరేషన్ రుణాలు, ఆ కులానికి చెందిన విద్యార్థులు విదేశాలకు వెళుతున్నా ముద్రగడ చేస్తున్న ప్రచారానికి మెజారిటీ కాపు వర్గం ఆకర్షితులన్న వైనం పార్టీ నాయకత్వానికి ఆందోళనగా పరిణమించింది. దీనిపై ఏం చేయాలో తెలియక మల్లగుల్లాలు పడుతోంది.
ముద్రగడ దీక్షకు ముందు తెదేపాకు అనుకూలంగా ఉన్న కాపులలో ఒక పెద్ద వర్గం, ముఖ్యంగా యువకులు పార్టీకి వ్యతిరేకంగా మారుతుండటం తెదేపా నాయకత్వానికి ఆందోళన కలిగిస్తోంది. ముద్రగడకు వ్యతిరేకంగా కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ, పార్టీ ఎమ్మెల్యేలు ప్రకటనలిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. చైర్మన్‌గా నియమితులైన రామానుజయకు కాపులలో ఇమేజ్ లేకపోవడం, ఆయనకు అన్ని జిల్లాల కాపులతో పరిచయం, పట్టు లేకపోవడం, పెద్దగా వర్గబలం లేకపోవడం పార్టీకి మైనస్‌గా మారిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నిజానికి చరిత్రలో తొలిసారిగా కాపులకు కార్పొరేషన్ ఇచ్చిన నేపథ్యంలో దానిని వినియోగించుకుని, ఈపాటికే ముద్రగడకు సమాంతర నేతగా ఎదిగి ఉండాల్సింది. కానీ ఆ విషయంలో ఆయన విఫలమయ్యాయన్న వ్యాఖ్యలు పార్టీవర్గాల్లో చాలాకాలం నుంచి వినిపిస్తున్నాయి.
నిజానికి ఆయనకంటే పేరు, పరిచయాలున్న కాపునేతలున్నప్పటికీ వారినెవరినీ పరిగణనలోకి తీసుకోలేదు. చిరంజీవి పీఆర్పీ స్థాపించినప్పుడు మెజారిటీ కాపులు అందులో చేరినప్పటికీ, పార్టీ వెంటే ఉన్న కాపులను నాయకత్వం విస్మరించింది. గుంటూరు జిల్లా సీనియర్ నేత చందు సాంబశివరావు కొనే్నళ్ల నుంచి మీడియా చర్చల్లో పాల్గొంటూ పార్టీ వాణి వినిపిస్తున్నారు. ఆయనకంటే జూనియర్ అయిన వారికి ఎమ్మెల్సీలిచ్చిన నాయకత్వం, చందుకు మాత్రం మొండిచేయి చూపింది. ఈవిధంగా జిల్లాల్లో అనేకమంది సమర్ధులున్నా వారిని విస్మరించిన ఫలితంగా ముద్రగడ ఇతర కాపు నేతలపై ఎదురుదాడి చేసేవారు కరవయిపోయారు. సమర్ధులను పక్కకుపెట్టి, ఎదురుదాడి చేసే ధైర్యం లేనివారికి పదవులివ్వడమే ఈ దుస్థితికి కారణమని విశే్లషిస్తున్నారు.
హోంమంత్రి చినరాజప్ప వివాదరహితుడు, పీఆర్పీలో ‘తూర్పు’ నేతలంతా చేరినా ఆయన మాత్రం పార్టీకే కట్టుబడ్డారు. కానీ ఆయనకు ముద్రగడను ఎదుర్కొనే స్థాయి, పలుకుబడి లేదు. రాజప్ప మంచితనం, కులాన్ని అడ్డుపెట్టుకుని చాలామంది బతకనేర్చిన వారు పేషీల్లో, ఇతర శాఖల్లో వివిధ ఉద్యోగాల్లో చేరిపోయారు. తెలంగాణ, ఏపికి చెందిన కాపు, మున్నూరు కాపుప్రముఖులకు ముఖ్యంగా రెండు రాష్ట్రాలకు చెందిన ఈ వర్గ మీడియా ప్రముఖులకు ఇప్పుడు రాజప్ప పేషీ కేంద్రంగా మారిందన్న వ్యాఖ్యలతోపాటు, అది పార్టీకి అక్కరకురావడం లేదన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.
ఇక గంటా శ్రీనివాస్‌కు మాస్‌లో ఇమేజ్ ఉంది. అందుకే ఆయన ఎక్కడినుంచి పోటీ చేసినా గెలుస్తున్నారు. కానీ కులపరంగా ఆయనకు ముద్రగడను ఎదుర్కొనే శక్తి, ఇమేజ్ లేదంటున్నారు. అంగబలం, అర్ధబలం ఉన్నా కులంలో బలం లేదని చెబుతున్నారు. ముద్రగడతోపాటు వైసీపీ,కాంగ్రెస్‌కు చెందిన కాపునేతలు సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుంటే గంటా మాత్రం ఆ స్థాయిలో ఎదురుదాడి చేయటంలో విఫలమయ్యారన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది. కడప జిల్లా ఇన్చార్జిగా అక్కడ మెజారిటీ సంఖ్యలో ఉన్న బలిజలను కూడా, పార్టీ వైపు ఆకర్షితులను చేయలేకపోయారంటున్నారు.
నారాయణ వివాదరహితుడయినా ఎప్పుడూ నాయకుడు కాదు. కులంలో కూడా బలం లేదు. ఎన్నికల సమయంలో పార్టీని ఆర్ధికంగా ఆదుకున్న కారణంగా ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేశారు. కానీ ఆయనకు ముద్రగడ ఇమేజ్‌లో పదోవంతు కూడా లేదన్నది పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. సొంత శాఖలో సొంత కులానికి పెద్దపీట వేసినా, బయట మాత్రం అదే కులంపై పట్టు సాధించలేకపోతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముద్రగడ దీక్ష నుంచి ఇప్పటివరకూ ఆయన సర్కారుపై విరచుకుపడుతున్నా, నారాయణ మాత్రం ఆ స్థాయిలో ఎదురుదాడి చేయడంలో విఫమవుతున్నారన్న విమర్శలున్నాయి. ‘ఏదో విమర్శించాలి కాబట్టి’ అన్నట్లు ఉంటున్నాయే తప్ప, ఎదురుదాడిలో పస లేదంటున్నారు.
మంత్రి మృణాళిని సాంకేతికంగా తూర్పు కాపు బిసి అయినప్పటికీ కాపుగానే చెలామణి అవుతున్నారు. ఆమె వల్ల కులానికి ఉపయోగం లేదని, ఎప్పుడూ ముద్రగడపై విరుచుకుపడిన దాఖలాలు లేవని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి కారణాల వల్లే తమ పార్టీలో ముద్రగడను సవాల్ చేసే స్థాయి నేత లేకుండా పోయారని నేతలు విశే్లషిస్తున్నారు.
ముఖ్యంగా ఇటీవలి కాలంలో కొందరు ముద్రగడ బూచిని చూపి, ఎదిగే రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారన్న చర్చ పార్టీలో జరుగుతోంది. తుని సభకు మంత్రులు సహా పార్టీకి చెందిన కాపు ఎమ్మెల్యేలు, సీనియర్లంతా తమ కులం వారికి బస్సులు, కార్లు ఇచ్చి పంపించారని గుర్తు చేస్తున్నారు. ముద్రగడ బలంగా ఉంటేనే తాము పార్టీలో బలపడతామన్న వ్యూహంతో బాబుపై పరోక్ష ఒత్తిడి తీసుకువస్తున్నారని చెబుతున్నారు. గతంలో బాబు సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ నేతలు కూడా కేసీఆర్ బూచి చూపి పార్టీలో ఎదిగారని, ఇప్పుడు కాపుమంత్రులు, నేతలు కూడా అదే వ్యూహం అమలుచేస్తున్నారని విశే్లషిస్తున్నారు.

చిత్రం.. ముద్రగడ