ఆంధ్రప్రదేశ్‌

మరో నందిగ్రామ్ అవుతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 15: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలంలోని తుందుర్రు, బేతపూడి, జొన్నల గరువు ప్రాంతంలో చిచ్చు రేపుతున్న గోదావరి మెగా ఆక్వా పార్కు నిర్మాణాన్ని అక్కడి నుండి తక్షణమే తరలించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమస్యపై తక్షణమే ఆలోచించకపోతే నందిగ్రామ్ పరిస్థితి పునరావృతం అవుతుందని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం నాడు విశ్వమానవ వేదిక ఆధ్వర్యంలో భీమవరంలోని పలు మండలాలు నుండి వచ్చిన వందలాది రైతులు పవన్ కల్యాణ్‌ను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా పవన్ వారితో మాదాపూర్ ఇమేజ్ గార్డెన్స్‌లో సమావేశం నిర్వహించారు. బాధితులతో మాట్లాడించి సమస్యలను అర్థం చేసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో పవన్‌కల్యాణ్ మాట్లాడారు.
వద్దంటున్నా ఇదేం పద్ధతి?
ఉభయ గోదావరి జిల్లాలు అన్నంపెట్టే జిల్లాలని, నదులను కలుషితం చేసే పరిశ్రమలను ఏర్పాటు చేయడం రాష్ట్రానికి మంచిది కాదని అన్నారు. పంటలకు అనుకూలంగా లేని ప్రాంతాల్లో పరిశ్రమలను ఏర్పాటు చేయాలని పవన్ సూచించారు. ఆక్వాఫుడ్ పార్కు వద్దని ప్రజలు ఎప్పటినుండో మొరపెట్టుకుంటున్నా, ప్రభుత్వ నాయకులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. పరిశ్రమల వ్యర్థాలతో నదులు కలుషితం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులు నిర్మించేటప్పుడు తమ సమస్యలు చెప్పుకునే అవకాశం బాధితులకు ఇవ్వాలని పేర్కొన్నారు. తాను పారిశ్రామిక ప్రగతికి వ్యతిరేకిని కానని, ఆలోచనా రహితంగా పరిశ్రమలు ఏర్పాటు చేయడం మాత్రం ఏ ప్రభుత్వానికీ తగదని అన్నారు. అందువల్ల మెగా ఆక్వాఫుడ్ పార్కు ఏర్పాటును తీర ప్రాంతానికి తరలించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజలు ప్రతిఘటిస్తారు
ఒకవైపు నరేంద్రమోదీ గంగా ప్రక్షాళన అంటున్నారని, ఇంకో వైపు తెలుగుదేశం ప్రభుత్వం గోదావరి, కృష్ణా పుష్కరాల పేరుతో నదుల ఆవశ్యకతను, ఆధ్యాత్మికతను చాటిచెప్పేందుకు ప్రయత్నిస్తూనే మరోవైపు పవిత్ర నదులను కలుషితం చేసే పరిశ్రమలను ఎందుకు ప్రోత్సహిస్తున్నదని ప్రశ్నించారు. కనీస ప్రమాణాలు పాటించకుండా ప్రజలను ఇబ్బందులు కలుగచేస్తుంటే వారు తప్పకుండా ప్రతిఘటిస్తారని అన్నారు. 30 రోజులుగా ఆయా గ్రామాల్లో 144 సెక్షన్ ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదన్నారు. వారేమైనా ఆయుధాలు పట్టుకున్నారా అని నిలదీశారు. ఇదేదో ఇప్పుడే వచ్చిన సమస్య కాదని, రెండున్నరేళ్లుగా కొనసాగుతూనే ఉందని చెప్పారు. ఇటీవల అక్కడికి వెళ్లిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధును ఎందుకు నిర్బంధించారని ప్రశ్నించారు.
టిడిపి మళ్లీ అక్కడ గెలవదు
తొలుత తాను ఆ ఊరికే వెళ్దామని అనుకున్నా, ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయనే భయంతోనే ఆ రైతులను ఇక్కడికి రావాలని కోరానని, సమస్య పక్కదోవ పట్టే అవకాశం లేకుండా వారితో సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు. పరిశ్రమలకు లైసెన్స్‌లు ఇచ్చినపుడే ప్రభుత్వాలు జాగ్రత్త పడాలని, గ్రామాలకు దగ్గరగా పరిశ్రమలు నిర్మించడం వల్ల ఎక్కువ దుష్పరిణామాలు వాటిల్లుతాయని చెప్పారు. సమస్యను మరో నందిగ్రామ్‌గా మలచవద్దని పవన్ సూచించారు. తెలుగు దేశం పార్టీ గెలుపునకు దోహదం చేసింది ఈ రెండు జిల్లాలేనని, సమస్యను పరిష్కరించకుంటే ఆ పార్టీ మళ్లీ ఈ జిల్లాల్లో గెలిచే అవకాశం ఉండదని అన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం మొంటి వైఖరి వీడకుంటే తమతో కలిసి వచ్చే పార్టీలతో శాంతియుత పోరాటానికి సిద్ధమని అన్నారు.

చిత్రం... హైదరాబాద్ మాదాపూర్‌లోని ఇమేజ్ గార్డెన్స్‌లో పవన్ కల్యాణ్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటున్న ఆక్వా పార్కు బాధితులు