ఆంధ్రప్రదేశ్‌

సింహాచల ఆలయం ధర్మకర్త పీఠం ఎవరిది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింహాచలం, మార్చి 27: శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి దేవాలయంతో పాటు 108 దేవాలయాల్లో తొలి పూజలు అందుకునే పూసపాటిరాజు వంశీయుల వారసులెవరన్న దానిపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ధర్మకర్తగా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తే వారి పేరున తొలి పూజ చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఆనందగజపతిరాజు మరణించడంతో ధర్మకర్త పీఠం అధిష్ఠించేదెవరన్న అంశం తేలాల్సి ఉంది. ఈ వ్యవహారంపై దేవస్థానం కసరత్తు ప్రారంభించింది. సింహాచల క్షేత్రంలో వచ్చే నెలలో జరగనున్న ఉగాది వేడుకలు, కల్యాణోత్సవం, మే నెలలో చందనోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో దేవస్థానం తరఫున ముద్రించే వాల్ పోస్టర్లు, ప్రముఖులకు పంపే ఆహ్వాన పత్రికల్లో ధర్మకర్త పేరును ముద్రించాల్సి ఉంది. పంచాంగంతో పాటు అనేక ఆహ్వాన పత్రికల కోసం ఇప్పటికే ముద్రణలకు పంపిన దేవస్థానం ఆనందగజపతిరాజు పేరు స్థానంలో త్వరలో ధర్మకర్త కానున్న వారి పేరును ముద్రించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆలయ ధర్మ కర్త బాధ్యతలు స్వీకరించనున్న దెవరు? అన్న విషయాన్ని దేవస్థానం అధికారులు తేల్చుకోవలసి ఉంది. ఈ విషయమై పూసపాటి వంశీయులతో దేవస్థానం అధికారులు చర్చలు జరిపే అంశం పరిశీలిస్తున్నారు. శాస్త్రం, సంప్రదాయాలతో పాటు చట్టాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళతామని ఈవో రామచంద్రమోహన్ చెప్పారు.
ప్రస్తుతం పూసపాటి వంశీయుల్లో కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజుతో పాటు అలకా నారాయణ గజపతిరాజు, మనీష్ గజపతి ఉన్నారు. ఆనందగజపతిరాజు తరువాత దేవాలయంలో జరిగే పూజాదికాల్లో అశోక్‌గజపతిరాజు మాత్రమే పాల్గొనేవారు. స్వామి వారి చందనయాత్ర సందర్భంగా ఆనందగజపతిరాజు హాజరుకాలేని సందర్భాల్లో అశోక్‌గజపతిరాజు రాజ వంశీయుల తరఫున గంధం చెక్కలు, పట్టువస్త్రాలు సమర్పించి తొలి దర్శనం చేసుకునేవారు. పివిజి రాజు రెండవ భార్య సంతానంగా ఉన్న అలకా నారాయణ, మనీష్ గజపతి దేవస్థానంతో సంబంధాలు కలిగి ఉన్న సందర్భాలు లేవు. శాస్తప్రరంగా చట్టపరంగా చూసినా పెద్ద కుమారుడి హోదాలో అశోక్‌గజపతిరాజు ధర్మకర్త పీఠం అధిష్ఠించే అవకాశం ఉంది. అయితే ఈ బాధ్యతలను స్వీకరించేందుకు అశోక్‌గజపతిరాజు సిద్ధంగా ఉన్నారా? లేదా? అన్న దానిపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయనకు అటు విజయనగరం మాన్సాస్ చైర్మన్ పదవి, సింహాచలం దేవస్థానంతో పాటు 108 దేవాలయాల ధర్మకర్త బాధ్యతలు నిర్వహించడం సవాల్‌గా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అశోక్‌గజపతి తీసుకునే నిర్ణయం కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సింహాచలం దేవస్థానం మాత్రం వీలైనంత త్వరలో ఈ వ్యవహారంపై స్పష్టత తీసుకునే పనిలో కసరత్తు మొదలుపెట్టింది.