ఆంధ్రప్రదేశ్‌

తూ.గోలో ఆక్వా జోన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, అక్టోబర్ 17: సారవంతమైన వ్యవసాయ భూములను ఆక్వా చెరువులుగా మార్చడాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు తీసుకుంటోంది. వ్యవసాయ భూముల్లో అధికారికంగా, అనధికారికంగా చెరువులు తవ్వుతూ ఆక్వా సాగు చేస్తున్న రైతులపై కఠినంగా వ్యవహరించడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఆక్వా జోన్ల నిర్ధారణకు రాష్ట్ర శాటిలైట్ అప్లికేషన్స్ సెంటర్ ఆధ్వర్యంలో శాటిలైట్ సర్వే నిర్వహించారు. అలాగే మత్స్య, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో గ్రౌండ్ సర్వే నిర్వహించి, ఈ రెండు సమాచారాలను క్రోడీకరించారు. సాగు యోగ్యమైన సారవంతమైన వ్యవసాయ భూములను ఆక్వా కల్చర్ చెరువులుగా మార్చడాన్ని నిరోధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. శాటిలైట్ సర్వే ద్వారా ఆక్వా జోన్లను నిర్ధారించనున్నారు. తాత్కాలిక ఆర్ధిక ప్రయోజనాలను ఆశించి, వ్యవసాయ భూములను ఆక్వా చెరువులుగా మార్చడం వలన పర్యావరణానికి, తాగునీటి వనరులకు, భూముల సహజ స్వభావానికి తీవ్ర విఘాతం కలుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఆక్వా సాగు జరుగుతున్న ప్రాంతాలకు సంబంధించి శాటిలైట్ సర్వే ద్వారా 49 మ్యాప్‌లను జారీచేశారు. మత్స్య, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో గ్రౌండ్ సర్వే నిర్వహించి రెండు సమాచారాలను క్రోడీకరించారు. ఈ సర్వేల ప్రకారం అమలాపురం డివిజన్ పరిధిలో 8563.64 హెక్టార్లు, కాకినాడ డివిజన్‌లో 3113.67 హెక్టార్లు, రాజమహేంద్రవరం డివిజన్లో 619.50 హెక్టార్లు వెరసి 12,296.82 హెక్టార్లలో ఆక్వా సాగు జరుగుతున్నట్టు గుర్తించారు. జిల్లాలో ఆక్వా సాగులో ఉన్న ప్రాంతాలను వాటి స్వరూప స్వభావాల ప్రకారం 3 ప్రధాన కేటగిరీలుగా విభజించనున్నారు. నిరుపయోగమైన, నిస్సారమైన, ముంపునకు గురవుతున్న లోతట్టు భూములను మొదటి షెడ్యూల్ కింద, డ్రెయిన్ల వెంబడి ఆక్వా సాగు జరుగుతున్న భూములను 2వ షెడ్యూల్ కింద, ఇప్పటికే ఆయా మండలాల్లో 50 శాతం విస్తీర్ణం పైబడి ఆక్వా సాగు జరుగుతున్న ప్రాంతాలను మూడవ షెడ్యూల్ కింద విభజిస్తారు. ఆయా ప్రాంతాల్లో ఆక్వా సాగు విస్తీర్ణాన్ని సర్పంచ్‌ల సమక్షంలో ధ్రువీకరించి, తహశీల్దారు, మండల వ్యవసాయాధికారి, మత్స్యశాఖ, ఆర్‌డబ్ల్యుఎస్, ఇరిగేషన్ శాఖల మండల స్థాయి అధికారులతో కమిటీలు ఏర్పాటుచేస్తారు. ఈ కమిటీలు క్షేత్రస్థాయిలో పర్యటించి, ఆక్వా జోన్లను ప్రతిపాదించాల్సి ఉంది. ప్రతిపాదిత జోన్లపై గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వెబ్‌సైట్‌లో ఆ వివరాలను ఉంచుతారు. ప్రజల సలహా, సూచనలను స్వీకరించిన అనంతరం ఆక్వా జోన్లను ఖరారు చేసి ప్రకటిస్తారు. మత్స్య, రెవెన్యూ అనుబంధ శాఖల సమన్వయంతో ఈ మొత్తం ప్రక్రియను నవంబర్ 15వ తేదీ నాటికి పూర్తిచేస్తారు. అనంతరం ప్రకటిత ఆక్వా జోన్‌ల బయట ఆక్వా సాగుకు భూముల కన్వర్షన్‌ను నిషేధిస్తారు. ప్రభుత్వం ప్రకటించిన జోన్ల పరిధిలోనే ఆక్వా చెరువుల తవ్వకాలకు అనుమతులు జారీచేస్తారు.