ఆంధ్రప్రదేశ్‌

పోలీస్ వ్యవస్థ ఆధునీకరణకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 21: తీవ్రవాదాన్ని ఎదుర్కోటంలో భారతదేశంలోనే ఎపి పోలీసుకు ప్రత్యేక స్థానం ఉందంటూ, కాలానుగుణంగా రాష్ట్ర పోలీస్ వ్యవస్థను ఆధునీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఇటీవల కాలంలో సంఘ విద్రోహ శక్తులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్దఎత్తున వినియోగిస్తున్నందున వారికి దీటుగా పోలీస్ వ్యవస్థకు సాంకేతిక పరిజ్ఞానాన్ని, అవసరమైన పరికరాలను అందిస్తున్నామని, వీటిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, కులమత ఘర్షణలు, ప్రాంతీయ వాదాల నుంచి ప్రస్తుతం పోలీస్ వ్యవస్థ పెను సవాళ్లు ఎదుర్కొంటోందని, అయితే విధ్వంసకారులు, నేరస్థులు పోలీసులపై దాడులకు సైతం వెనకాడటం లేదంటూ సిఎం ఆందోళన వ్యక్తం చేశారు. అయినా ఇలాంటి సందర్భాల్లో పోలీస్ యంత్రాంగం గొప్ప తెగువ ప్రదర్శిస్తూ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సామాజిక భద్రతను కాపాడుతోందని ప్రశంసించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా డిజిపి నండూరి సాంబశివరావు ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ముందుగా స్మారక స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించి అనంతరం మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణకు తమ ప్రాణాలను సైతం బలిచ్చిన పోలీసులకు అందరూ రుణపడి ఉండాలన్నారు. సంపద లేనిదే పేదరికాన్ని నిర్మూలించటం సాధ్యం కాదంటూ అలాంటి సంపాదనకు చేస్తున్న ప్రయత్నాలకు సుస్థిరమైన శాంతిభద్రతలు అవసరమన్నారు. పెట్టుబడులు రావాలన్నా, పర్యాటక రంగం అభివృద్ధి చెందాలన్నా ముందుగా శాంతియుత వాతావరణం చాలా అవసరమన్నారు. ఇలాంటి వాతావరణాన్ని నెలకొల్పటంలో పోలీసుల పాత్ర ప్రముఖమన్నారు. పండగలు, సంబరాల వంటి సమయాల్లో అందరూ హాయిగా ఆనందిస్తున్నప్పుడు పోలీసులు విధి నిర్వహణలో తమ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటారన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ అతి తక్కువ సమయంలో కేసుల దర్యాప్తు పూర్తి చేసి దోషులకు శిక్ష పడేలా చేయాలన్నారు.
పోలీసుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని ఇందుకు రూ.15 కోట్ల నిధులు కేటాయించామని, విధి నిర్వహణలో మరణించిన పోలీసుల కుటుంబంలోని వ్యక్తికి ఉద్యోగం కల్పిస్తున్నామన్నారు. విధి నిర్వహణలో మరణించిన హోంగార్డులకు రూ.5 లక్షలు చొప్పున పరిహారం చెల్లిస్తున్నామన్నారు. ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ పోలీసులు విధి నిర్వహణ పట్ల వారికున్న అంకితభావాన్ని తెలియజేస్తుందన్నారు. డిజిపి నండూరి సాంబశివరావు మాట్లాడుతూ శాంతి స్థాపనలో ఎదురయ్యే కఠిన సవాళ్లను చిరునవ్వుతో ఎదుర్కొంటూ పోలీసులు ప్రజలకు భద్రత కల్పిస్తున్నారన్నారు. ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, పలువురు పోలీసు ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
అమర వీరులకు గవర్నర్ నివాళి
పోలీసు సంస్మరణ దినం సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోఏర్పాటు చేసిన పెరేడ్‌లో రాష్ట్ర గవర్నర్ ఇసిఎల్ నరసింహన్ పాల్గొని పోలీసు అమరవీరులకు ఘన నివాళులర్పించారు. సిఎం కంటే ముందుగా ఉదయం 7.20 నిమిషాలకు స్టేడియంకు విచ్చేసిన గవర్నర్‌కు, రాష్ట్ర డిజిపి నండూరి సాంబశివరావు, నగర పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఘన స్వాగతం పలికారు. విజయనగరానికి చెందిన 16వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ పెరేడ్ కమాండర్‌గా పెరేడ్ ప్రదర్శనకు గవర్నర్ అనుమతి పొందారు. గవర్నర్ పోలీసు అమరవీరుల స్మృతి ఫలకం వద్దకు చేరుకుని పుష్పగుచ్ఛాన్ని ఉంచారు. పోలీసు అమరవీరుల గౌరవార్థం 2 నిమిషాలపాటు వౌనం పాటించారు.

దొందూ దొందే
అధికార, ప్రతిపక్షాలపై ఉండవల్లి ధ్వజం
విశాఖపట్నం, అక్టోబర్ 21: రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ విమర్శించారు. విశాఖలో శుక్రవారం జరిగిన మీట్‌ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాలనాపరంగా అధికార పార్టీ పాల్పడుతున్న తప్పులను సమర్ధవంతంగా ఎదుర్కొనడంలో విపక్ష పార్టీ పూర్తిగా విఫలమైందన్నారు. రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయం తీసుకుని కాంగ్రెస్ తగిన మూల్యానే్న చెల్లించిందని, ఇదే సందర్భంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో బిజెపి, టిడిపిలు అనుసరిస్తున్న వైఖరి, వారికి తగిన గుణపాఠం నేర్పుతుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో కలిసి సాగుతున్న టిడిపి విభజన హామీలను సాధించడంలో ఏమాత్రం కృషి చేయట్లేదన్నారు. పారదర్శక పాలన అందిస్తున్నట్టు చెపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన అంటే పారలు, గునపాలు కాదన్నారు. పోలవరం, పట్టిసీమ, రాజధాని అమరావతి నిర్మాణంపై బహిరంగ చర్చకు సిఎం చంద్రబాబు ఎందుకు వెనుకంజ వేస్తున్నారని అ ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన నేపథ్యంలో నిర్మాణం బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడం వెనుక మర్మమేమిటని ప్రశ్నించారు. 2018 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామంటూనే మరోసారి పురుషోత్తపట్నం ఎత్తిపోతలను తెరపైకి తేవడాన్ని తప్పుపట్టారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను కేంద్రమే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఒడిశా, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాలతో తలెత్తే సమస్యలను పరిష్కరించే బాధ్యత కేంద్రం మాత్రమే చేయగలదన్నారు. విభజన సందర్భంగా రెవెన్యూ లోటు రూ.18వేల కోట్లు కేంద్రం విడుదల చేయాల్సి ఉండగా, రాష్ట్రం అడిగిన పాపానపోలేదన్నారు. రెవెన్యూ లోటుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భిన్న ప్రకటనలు చేస్తున్నాయన్నారు.

పొలం వివాదంలో ఘర్షణ
ముగ్గురి దారుణ హత్య
కలిగిరి, అక్టోబర్ 21: నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలోని పాపనముసలి పాలెం గ్రామంలో అదే గ్రామానికి చెందిన పొలం విషయంలో చెలరేగిన ఘర్షణలో ముగ్గురు హత్యకు గురయ్యారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పాపన ముసిలిపాలెంకు చెందిన పది మంది రైతులు ఇరవైఏళ్లకిందట విజయవాడకు చెందిన కొందరికి 24 ఎకరాల భూమిని అమ్మారు. అయితే ఆ భూమిలో భాగస్వాములైన గణేషం లక్ష్మిదేవమ్మ, వారి సమీప బంధువుకు భూమి అమ్మిన విషయం అప్పట్లో మిగిలిన రైతులు చెప్పలేదు. పైగా వారికి భూమికి సంబంధించిన అమ్మిన మొత్తాన్ని కూడా ఇవ్వలేదు. అయితే అది బీడుభూమి కాగా కొనుగోలు చేసిన విజయవాడ వాసులు కూడా అంతగా పట్టించుకోక పోవడం వివాదం వెలుగులోకి రాకుండా కొనసాగుతూ వుంది. ఈనేపధ్యంలో భూమికొనుగోలు చేసిన విజయవాడ వాసులు కొంత కాలం క్రితం కుమ్మరకొండూరుకు చెందిన ఎస్ మహేంద్రరెడ్డి(38), వీరారెడ్డిపాలెంకు చెందిన కె సుబ్బారెడ్డి(40), అనంతసాగరం మండలానికి చెందిన వారి స్నేహితుడు సుబ్బారెడ్డి (40)కి ఆ భూమిని అమ్మారు. కొనుగోలు చేసిన వారు వచ్చి దానిని పరిశీలించగా అప్పట్లో లక్ష్మిదేవమ్మ తమకు అందులో పొలం వుందని చెప్పినట్లు సమాచారం. దీనికి సంబంధించి తమ వద్ద వున్న పాస్ పుస్తకాలు, అడంగల్, 1బి కాపీలను కొనుగోలుదారులకు చూపించినట్లు కూడా చెబుతున్నారు. దీనిని పెడచెవిన పెట్టి పొలానికి బాగు చేసేందుకు ప్రయత్నించిన క్రమంలో వివాదం రేగి విషయం పోలీసుల వరకు వెళ్లింది. వారు ముగ్గురు కొంతమంది కూలీలతో శుక్రవారం గ్రామానికి వచ్చి పొలంలో కంపకర్రకొట్టి చదును చేస్తుండగా లక్ష్మిదేవమ్మ కుటుంబానికి చెందిన గణేషం వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, వారి కుటుంబసభ్యులు సుమారు పది మంది పొలానికి వెళ్లి అడ్డగించారు. అయితే తమను అడగవద్దని పనికోసం పంపిన వారిని అడగాలని కూలీలు గ్రామస్తులకు స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న మహేంద్రరెడ్డి, సుబ్బారెడ్డి, అతని స్నేహితుడు సుబ్బారెడ్డి కలిసి ఘటన స్థలికి రాగానే వాగ్వివాదం ఘర్షణ మొదలు కాగా గ్రామస్తులు వారిపై కారంపొడి చల్లి ఏకధాటిగా కర్రలతో మోదడంతో వారు అక్కడికక్కడే విగత జీవులు అయ్యారు. నిందితులు శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, కలిగిరి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు.

బైక్‌ను ఢీకొన్న కారు
నన్నపనేనికి గాయాలు
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, అక్టోబర్ 21: రోడ్డు ప్రమాదంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి గాయపడ్డారు. తక్కెళ్లపాడు వద్ద ఆమె ప్రయాణిస్తున్న ప్రభుత్వ వాహనం ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. మోటారుబైక్ నడుపుతున్న గుంటూరు బాలాజీనగర్‌కు చెందిన వి గంగయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆందోళనకరమైన స్థితిలో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. రాజకుమారి శుక్రవారం గుంటూరు నుంచి ప్రభుత్వ వాహనంలో తెనాలి బయల్దేరారు. తక్కెళ్లపాడు వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఆమె ప్రయాణిస్తున్న కారు ఢీకొంది.కారు ముందు భాగం దెబ్బతింది. దీంతో ఆమె షాక్‌కు గురయ్యారు. గుంటూరు రూరల్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.