ఆంధ్రప్రదేశ్‌

భవనాల అప్పగింతపై కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 31: హైదరాబాద్‌లోని ఎపి సచివాలయం భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించే అంశంపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌తో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు వీలుగా క్యాబినెట్ సబ్ కమిటీని వేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. త్వరలో కమిటీలో సభ్యులుగా ఉండే మంత్రుల వివరాలు ప్రకటించనున్నారు. విజయవాడలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైదరాబాద్‌లోని ఎపి సచివాలయం భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించాలన్న తీర్మానంపై చర్చించేందుకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌తో ఒక క్యాబినెట్ సబ్ కమిటీని వేసేందుకు ప్రతిపాదిస్తున్నారని ‘ఆంధ్రభూమి’ ముందుగానే కథనం ప్రచురించడం తెలిసిందే. హైదరాబాద్‌లోని సచివాలయ భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించే అంశంపై దాదాపు గంటన్నర సేపు సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం అడిగిన వెంటనే ఇచ్చేస్తే తెలంగాణ, ఎపిలోని ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని పలువురు మంత్రులు వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
అసెంబ్లీ భవనాలను తమకు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం కోరినప్పటికీ విభజన చట్టం 9, 10 షెడ్యూళ్లలోని వివిధ అంశాలు ఇంకా పరిష్కారం కావాల్సి ఉందని కొందరు మంత్రులు అన్నట్లు సమచారం. అసెంబ్లీ భవనాల అప్పగింత వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వ తీవ్రంగా స్పందించకుండా ఉండేలా కూడా నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం భావించింది. దీంతో విభజన చట్టంలోని ఇతర అంశాలు కూడా ఇంకా పరిష్కారం కావాల్సి ఉందని మంత్రులు గుర్తుచేసినట్లు తెలిసింది. క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం రాత్రి విలేఖర్ల సమావేశంలో వివరించారు. విభజన చట్టంతో ముడివడిన చాలా అంశాలు చర్చించాల్సి ఉందని, వాటిని సబ్ కమిటీ పరిధిలోకి తీసుకొచ్చామన్నారు. సచివాలయ తరలింపు ప్రక్రియ ఇంకా సంపూర్ణం కాలేదన్న భావనను మంత్రివర్గం వ్యక్తం చేసిందని చెప్పారు. భవనాల అప్పగింతతో ఉత్పన్నమయ్యే సమస్యలను పరిశీలించేందుకు మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
2005-10 సంవత్సరం మధ్య ఏర్పాటైన స్పిన్నింగ్ మిల్స్‌కు మరో రెండేళ్లపాటు పొడిగింపు ఇచ్చేందుకు నిర్ణయించారు. విద్యుత్ సబ్సిడీని రూపాయికి పెంచేందుకు మంత్రివర్గం నిర్ణయించింది. 2010-15 మధ్య ఏర్పాటైన స్పిన్నింగ్ మిల్స్‌కు 5 సంవత్సరాల పొడిగింపు ఇవ్వాలని, సబ్సిడీని రెండు రూపాయలకు పెంచాలని నిర్ణయించారు. దీనివల్ల 300 కోట్ల రూపాయల వరకూ ప్రభుత్వంపై భారం పడుతున్నప్పటికీ భరించేందుకు సిద్ధమైనట్లు మంత్రి తెలిపారు. ఇది పత్తి రైతులు, స్పిన్నింగ్ మిల్స్‌తో ముడివడి ఉన్న సమస్య అని వివరించారు. ఖాయిలాపడిన జౌళి పరిశ్రమలకు 350 కోట్ల రూపాయల మేర విద్యుత్ రాయితీ ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. గొర్రెలు, మేకల పెంపకం విధానంపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవమిత్ర ఫెడరేషన్‌ను ఏర్పాటుచేసి దానిద్వారా గొర్రెల అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసేందుకు నిర్ణయించారు. ఈ పాలసీ కింద 5వేల మేలుజాతి పొట్టేళ్లను పంపిణీ చేసేందుకు, మూగజీవాల సంరక్షణకు జీవమిత్రల నియామకం, 50శాతం రాయితీపై దాణా తయారీ యంత్రాల పంపిణీకి నిర్ణయం తీసుకున్నారు.
ఉడా, తుడా పరిధిలో భూసమీకరణ పథకం-2016కు ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో నాలుగు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విశాఖలో రెండు, శ్రీసిటీలో, చిత్తూరులో ఒక్కో ప్రైవేట్ వర్శిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మధురవాడ, కొమ్మాదిలో 400 ఎకరాల భూసేకరణకు సిఆర్‌డిఏ తరహాలో ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించారు. విశాఖ నగరాభివృద్ధి సంస్థ (ఉడా) స్థానంలో విశాఖ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటుపై మంత్రివర్గంలో చర్చించారు. ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్ భాయి పటేల్ వివిధ సంస్థానాలను దేశంలో విలీనం చేయడంలో చూపిన చొరవ అసమానమైనదని మంత్రివర్గం శ్లాఘించింది.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఎపి 70.12 శాతంతో రెండో స్థానంలో నిలవడంపై మంత్రిమండలి సంతోషం వ్యక్తం చేసింది. 10 అంశాల్లో వంద శాతం మార్కులు సాధించడం గమనార్హం. గడచిన మూడు నెలల్లో 98శాతం దరఖాస్తులను 21రోజుల్లోనే ఆమోదం తెలిపి చరిత్ర సృష్టించామని మంత్రి యనమల తెలిపారు. ఎపిఐఐసికి ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటుకు గుర్రంపాలెంలో 129 ఎకరాల స్థలం కేటాయింపునకు, పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మావూళ్లమ్మ ఆలయ ముఖమంటపం, తదితర పనులకు 742 చదరపు గజాల స్థలాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరులో థర్మల్ పవర్ స్టేషన్ ఏర్పాటుకు ఎపి జెన్కోకు 13ఎకరాల స్థలం కేటాయింపునకు నిర్ణయం తీసుకున్నారు. చిత్తూరు జిల్లాలో 160 హోంగార్డ్ పోస్టులు మంజూరు చేశారు. 13 జిల్లాల కలెక్టరేట్లలో 46 మంది తహశీల్దార్ల పోస్టుల ఉన్నతికి అనుమతించారు. విజయవాడలో భవానీ ఐలాండ్ టూరిజం కార్పొరేషన్ ఏర్పాటుకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపారు.

చిత్రం... విజయవాడలో సోమవారం జరిగిన మంత్రివర్గ భేటీలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు