ఆంధ్రప్రదేశ్‌

పటేల్ ప్రధాని అయఉంటే కాశ్మీర్ మండేది కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, నవంబర్ 4: స్వాతంత్య్రానంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రథమ ప్రధాని అయివుంటే దేశం దశ, దిశ మారిపోయివుండేవని, ముఖ్యంగా నిత్యం రగులుతున్న కాశ్మీర్‌లో కల్లోలం ఉండేది కాదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు అన్నారు. పటేల్ దేశానికి తొలి ప్రధాని కాకపోవడం మన దురదృష్టమన్నారు. కాకినాడ సమీపంలోని అచ్చంపేట వద్ద శుక్రవారం ఒక ప్రైవేటు కార్పొరేట్ స్కూలు ప్రారంభ సభలో ఆయన మాట్లాడారు. స్వాతంత్య్ర సంగ్రామంలో అజరామరమైన సేవలందించిన మహానేతల జీవిత చరిత్రలను పాఠ్యాంశాలుగా విద్యార్థులకు బోధించాల్సి ఉందన్నారు. వల్లభాయ్ పటేల్, స్వామి వివేకానంద, భగత్‌సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు, బి ఆర్ అంబేద్కర్ వంటి గొప్ప నేతల చరిత్రలను పాఠ్యాంశాలుగా చేర్చాలని సూచించారు. విద్య ద్వారా విజ్ఞానాన్ని అందించి, పరిపూర్ణమైన మానవుడిని తయారుచేయాలని పిలుపునిచ్చారు. ఆంగ్ల భాష మంచిదేనని, ఇంగ్లీష్ మనస్తత్వం మాత్రం మంచిదికాదన్నారు. ఉపాధి, ఉద్యోగావకాశాల కోసం ఆంగ్లం నేర్చుకోవడం మంచిదే కానీ, హిందూ సంస్కృతిని మాత్రం మరవకూడదని సూచించారు.
మెకాలే విద్యా విధానాన్ని విడిచిపెట్టి, మన విద్యావిధానాన్ని అవలంభించడానికి కృషిచేయాలని కోరారు. ‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని’ అన్న రాయప్రోలు వారిని, ‘దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్’ అన్న గురజాడ అప్పారావుగారిని స్ఫూర్తిగా తీసుకుని, మన తల్లి, స్వగ్రామం, మాతృ భాష, మాతృదేశంపై ప్రేమను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. అమ్మ అనే పదం కడుపులో నుండి వస్తుందని, మమీ అనే పదం పెదవుల నుండి మాత్రమే వస్తుందని పేర్కొన్నారు. మనం మన భాషలోనే మాట్లాడాలని, తెలుగులో వెలుగుందని వెంకయ్య వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్రమోదీ ఒకప్పుడు రైల్వేస్టేషన్‌లో టీ అమ్ముకునేవారని, భారతరత్న అబ్దుల్‌కలాం న్యూస్ పేపర్లు అమ్ముకుని, దేశానికి అధ్యక్షుడయ్యారన్నారు. నేడు నరేంద్రమోదీ విదేశాలల్లో పర్యటిస్తుంటే ఆయా దేశాలు ఎంతో గౌరవిస్తున్నాయని, బ్రిటీష్ ప్రధాని సతీమణి కూడా ఆ దేశంలో చీర కట్టుకుని, భారతీయ సంప్రదాయంతో మోదీకి స్వాగతం పలికారని గుర్తుచేశారు. మన కట్టు,బొట్టు, మాట, యాస, భాషలను మరచిపోకూడదని, ప్రపంచమంతా నేడు భారత్ వైపే చూస్తోందన్నారు. మతం అనేది వ్యక్తిగతమని, మనందరి గతం ఒకటేనని వ్యాఖ్యానించారు. మతం అనేది పూజాపద్ధతి అని, హిందూ అనేది జీవన పద్ధతి అన్నారు. హిందూ అనేది మతానికి ప్రాతిపదిక కాదని, దేశానికి ప్రాతిపదికగా భావించాలని సూచించారు. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో మైటీగా తయారై, బ్యూటీగా మారిపోవచ్చని, సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ళ, పూర్ణ వంటి భారతీయ మేధావులు నేడు ప్రపంచ ఐటి రంగంలో ప్రఖ్యాతిగాంచారని వెంకయ్య పేర్కొన్నారు. సభకు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి శేషారెడ్డి అధ్యక్షత వహించారు. ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, విశాఖ ఎంపి డాక్టర్ కంభంపాటి హరిబాబు, కాకినాడ ఎంపి తోట నరసింహం, రాజమహేంద్రవరం ఎంపి ఎం మురళీమోహన్, అమలాపురం ఎంపి డాక్టర్ పి రవీంద్రబాబు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిత్రం.. కాకినాడలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలవేస్తున్న వెంకయ్యనాయుడు