ఆంధ్రప్రదేశ్‌

‘టార్గెట్ 80’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 13: రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 80 శాతం ఓటర్లకు చేరవయ్యే లక్ష్యానికి తెలుగుదేశం పార్టీ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజలకు చేర్చి, చేసింది చెప్పడం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకోవాలన్న ముందస్తు వ్యూహంతో చంద్రబాబునాయుడు ఈ ప్రణాళిక రచించారు. 80శాతం ఓటర్లకు చేరవయ్యే బాధ్యతను నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇంచార్జులకు అప్పగించారు. రానున్న ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి అత్యంత కీలకంగా మారాయి. జగన్ దూకుడు, పవన్ ఎటువైపు నిలుస్తారో తెలియని అనిశ్చితి, ప్రతిపక్షాలన్నీ కలసి పోటీ చేస్తాయన్న ప్రచార నేపథ్యంలో ఇప్పటినుంచే నియోజకవర్గాలపై దృష్టి సారించాలని బాబు నిర్ణయించారు. అందుకోసం విస్తృత ప్రాతిపదికన దీర్ఘకాలిక వ్యూహరచన చేస్తున్నారు.
ప్రభుత్వం సాధించిన లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకుపోవటం కోసం కార్యకర్తలకు మార్గదర్శకాలు జారీ కానున్నాయి. ప్రధానంగా 50వేల రూపాయల లోపు రైతు రుణాలు రద్దు చేసినందున, లక్షల సంఖ్యలో లబ్ధి పొందిన రైతులకు చేరువయి, ప్రభుత్వం చేసిన ఉపకారాన్ని వారికి గుర్తు చేయనుంది. స్కాలర్‌షిప్పులు, ఫీజు రీ ఇంబర్స్‌మెంట్‌తో లాభపడుతున్న విద్యార్థుల వద్దకు పార్టీ కార్యకర్తలు వెళ్లనున్నారు. రెండున్నరేళ్ల కాలంలో ఎప్పుడూ లేనంతగా ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి భారీ సంఖ్యలో లబ్ధి పొందిన వారినీ పలకరిస్తారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద వచ్చిన దరఖాస్తులపై బాబు మునుపటికి భిన్నంగా పెద్దమనసు చూపిస్తు, ఉదారంగా ఆర్థిక సాయం చేస్తున్నారు.
కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్ల ద్వారా ఇటీవలి కాలంలో ఉన్నత విద్య, చిన్న వ్యాపారాలకు పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం చేస్తున్నారు. వారి సంఖ్య వేలల్లోనే ఉంటుంది. పించన్ల లబ్ధిదారులను కూడా కార్యకర్తలు కలిసి వారికి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరిస్తారు. ఇవి కాకుండా బీసీ, మైనారిటీ, చేతివృత్తుల ఫెడరేషన్ల ద్వారా భారీ సంఖ్యలోనే రుణాలు మంజూరు చేస్తున్నారు. ఆయా లబ్ధిదారులందరి వద్దకు వెళ్లి, ప్రభుత్వం ఇస్తున్న చేయూతను గుర్తు చేసి వారిని తమ వైపు సానుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తారు.
దీంతో పాటు నవ్యాంధ్ర అభివృద్ధి కోసం బాబు పడుతున్న కష్టంపై సానుకూలంగా ఉన్న విద్యాధికులు, మేధావులు, తటస్థులతో చర్చించి వారి మద్దతును కూడా కూడగట్టుకోగలిగితే నియోజకవర్గానికి 80 శాతం బలాన్ని టిడిపికి సమీకరించవచ్చని నాయకత్వం అంచనా వేస్తోంది.
రానున్న ఎన్నికల్లో యువకులు, విద్యార్థుల పాత్ర కీలకం కావడంతో ఇప్పటినుంచే వారిపై దృష్టి సారించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే పార్టీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేష్ కాలేజీ విద్యార్థులతో వీలైనంత ఎక్కువగా ఇష్టాగోష్టులు నిర్వహించాలని భావిస్తున్నారు. లోకేష్ కొంతకాలంగా నిర్వహిస్తున్న భేటీలకు సానుకూల స్పందన కనిపిస్తుండటంతో పార్టీలో సంతృప్తి వ్యక్తమవుతోంది. కాలేజీ యువతతో భేటీ నేపథ్యంలో ఆర్ధిక నేరాలకు పాల్పడి జైలుపాలయిన జగన్ అంశాన్ని ఎక్కువగా ప్రస్తావించడం ద్వారా, యువతలో జగన్‌పై మరింత వ్యతిరేకత పెంచేలా చూస్తున్నారు. ప్రజాప్రతినిధిగా వచ్చే ముందు విద్యార్థులతో వీలైనంత ఎక్కువ సమయం కేటాయించడం వల్ల.. క్షేత్రస్థాయి సమస్యలు, యువకుల ఆలోచనా ధోరణి, ప్రభుత్వంలో జరిగే లోపాలు, ఫిర్యాదులు, ప్రజల అవసరాలు స్వయంగా తెలుసుకునే అవకాశంతోపాటు, అనుభవం సంపాదించే వెసులుబాటు కూడా ఉంటుందని నేతలు చెబుతున్నారు.
ఇవన్నీ నిరంతరం కొనసాగిస్తే నియోజకవర్గానికి 80 శాతం ఓటర్లకు చేరువకావడం కష్టం కాదని బాబు పార్టీ నేతలకు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల పార్టీ సమీక్ష సమావేశంలో కూడా బాబు ఇదే చెప్పడం ప్రస్తావనార్హం. ‘మీరంతా కష్టపడండి. 80 శాతం ప్రజలకు ఎలా చేరువకారో చూస్తా. మీరు కదలకుండా కూర్చుని కబుర్లు చెబుతూ మాట్లాడితే ఫలితాలు రావు. నియోజకవర్గాల్లో ప్రభుత్వ పథకాలతో లబ్థిపొందిన వారిని గుర్తించి వారి వద్దకు వెళ్లండి. మనం ప్రతి ఊరికీ రోడ్లు వేస్తున్నాం. హైవేలు నిర్మిస్తున్నాం. నీళ్లు ఇస్తున్నాం. పెద్ద ఎత్తున పించన్లు ఇస్తున్నాం. ఫీజు రీఇంబర్స్‌మెంట్ ఇస్తున్నాం. ఆర్ధికంగా బలంగా లేకపోయినా ఇంకా మనం ఎంతో చేస్తున్నాం. ఇంతచేస్తుంటే ప్రజలు ఎందుకు మన వెంట రారనుకుంటారు? మనల్ని విమర్శించేవాళ్లుంటారు. కానీ మనల్ని మెచ్చుకునేవాళ్లూ ఉంటారు. వాళ్ల వద్దకు వెళ్లండి. మళ్లీ నియోజకవర్గాల్లో మీరే అధికారంలో ఉంటారు. 80 శాతం ఓట్లు సాధించే బాధ్యత మీదే’నని నియోజకవర్గ నేతలకు బాబు స్పష్టం చేశారు.

చిత్రం.. చంద్రబాబు, లోకేష్