ఆంధ్రప్రదేశ్‌

బాలల ఆత్మీయ నేస్తం ‘హెల్ప్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 14: రాష్ట్రంలో 23 సంవత్సరాలుగా బాలల హక్కుల పరిరక్షణ కోసం పరిశ్రమిస్తున్న ‘హెల్ప్’ స్వచ్ఛంద సంస్థ తన సుదీర్ఘకాల సేవలతో ప్రతిష్ఠాత్మక బాలల అవార్డును పొందటం ద్వారా జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. బాలల సేవలో తరిస్తూ వారి ఆత్మీయ నేస్తంగా ప్రేమాభినామాలు పంచుతూ ఆదరణ పొందిన నిమ్మరాజు రామ్మోహన్ రాష్టప్రతి భవన్‌లో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఉత్సవంలో భారత ప్రథమపౌరుడు ప్రణబ్ ముఖర్జీ చేతులమీదుగా ఆయన పురస్కారం అందుకున్నారు. ఈసందర్భంగా రాష్టప్రతి ప్రణబ్ 3 లక్షల రూపాయల నగదు బహుమతి, శాలువా, జ్ఞాపికతో నిమ్మరాజు రామమోహన్‌ను ఘనంగా సత్కరించారు. కొందరు పాత్రికేయ మిత్రులతో కలిసి బాలల హక్కుల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా 1993లో ‘హెల్ప్’ స్వచ్ఛంద సంస్థను నిమ్మరాజు రామమోహన్ ప్రారంభించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఈ సంస్థ తన సేవలు అందిస్తోంది. బాలల హక్కుల పరిరక్షణతో పాటు బాలలపై లైంగిక వేధింపులు, బాలికలను వేశ్యా వృత్తిలోకి దించడానికి వ్యతిరేకంగా ‘హెల్ప్’ సంస్థ పనిచేస్తోంది. 1995 నుంచి 2000 సంవత్సరం వరకు వ్యభిచార కూపంలో మగ్గుతున్న వందలాది మహిళలను కాపాడి సుఖవ్యాధులు, హెచ్‌ఐవి నిరోధానికి సంస్థ కృషి చేసింది. వ్యభిచారంలో మగ్గుతున్న మహిళల పిల్లలు కూడా దిక్కులేని స్థితిలో అటువైపు వెళ్లకుండా నిరోధించేందుకు 2000 సంవత్సరంలో 50 మంది బాలబాలికలతో ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మాచవరం గ్రామంలో ‘ఆశా సదన్’ అనే ఆశ్రమ పాఠశాలను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దిక్కులేని 650 మంది పిల్లలకు రక్షణ కల్పించటంతో పాటు విద్యాబుద్ధులు నేర్పి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దారు. వీరిలో 150 మంది వరకు వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో ఉద్యోగులుగా రాణించటం ‘హెల్ప్’ సంస్థ సాధించిన ఘనతల్లో మచ్చుకు ఒకటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఐడికి నోడల్ సంస్థగా వుంటూ రాష్ట్రంలో సుమారు 650 మంది మహిళలు, బాలికలను అక్రమ రవాణా నుంచి హెల్ప్ సంస్థ కాపాడింది. వారిని వ్యభిచార రొంపి నుంచి రక్షించగలిగింది. 2006 నుంచి వ్యభిచార వృత్తిలో అలమటిస్తున్న మహిళలు, బాలికల కోసం ‘ఆశా నివాస్’ పేరిట ఓ హోమ్‌ను ఈ సంస్థ ప్రారంభించింది. సుమారు 750 మందికి కౌనె్సలింగ్ ఇచ్చి వృత్తివిద్యలు నేర్పటమే కాకుండా వారికి ప్రభుత్వం నుంచి జీవో ఎంఎస్ నెం. 28, 1 ద్వారా ఒక్కొక్కరికి 10 వేల నుంచి 20 వేల రూపాయల వరకూ ఆర్థిక సహాయం ఇప్పించి పునరావాసానికి తోడ్పడింది.
కేంద్ర మహిళా-శిశు సంక్షేమ శాఖ సహకారంతో నడిచే ‘చైల్డ్‌లైన్ 1098’ తరపున ప్రకాశం జిల్లాలో పనిచేస్తూ 382 బాల్య వివాహాలను ‘హెల్ప్’ సంస్థ అడ్డుకుంది. లైంగిక వేధింపులకు గురైన 85 మంది బాలికల కేసులను పరిష్కరించటంలో తోడ్పడింది. ఇళ్లలో నుంచి పారిపోయిన 238 మంది బాలికలను వెతికిపట్టుకొని కాపాడటంతో పాటు 650 మంది బాలకార్మికులు, వీధిబాలలకు వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించింది. ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ‘జువెనైల్ వెల్ఫేర్’ ఆధ్వర్యంలో విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్‌లోని బాలికల వసతిగృహాలు, విశాఖలోని బాలల వసతిగృహంలో బాలలు స్నేహపూరిత వాతావరణంలో ఎదిగేలా కౌనె్సలింగ్ ఇస్తూ 2013 నుంచి తన సేవలు అందిస్తోంది. బాలల రక్షణ వ్యవస్థను మెరుగుపర్చటానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ‘బాలల సంక్షేమ కమిటీ’లు ఏర్పాటు చేస్తూ ‘హెల్ప్‌లైన్’ వ్యవస్థను నెలకొల్పింది. ఇందులోభాగంగా సిఐడి-పోలీస్ సహకారంతో ‘స్పెషల్ జువైనల్ పోలీస్ యూనిట్స్’, రైల్వే పోలీసులు సుమారు 3 వేల మందికి బాలల హక్కులు, జెజె యాక్ట్, మహిళల అక్రమ రవాణా నిరోధం వంటి అంశాలపై ‘హెల్ప్’ ప్రత్యేక శిబిరాల ద్వారా శిక్షణ ఇచ్చింది.కాగా, తమకు లభించిన అవకాశం ద్వారా బాలల హక్కుల రక్షణకు తోడ్పాటు అందిస్తున్న ఆంధ్ర, తెలంగాణ పోలీసు అధికారులు, మహిళా-శిశు సంక్షేమ శాఖ అధికారులు, జువెనైల్ వెల్ఫేర్ శాఖ అధికారులు, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కరికీ రామమోహన్ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. రాష్టప్రతి పురస్కారం తమపై మరింత బాధ్యతను పెంచిందని వ్యాఖ్యానించారు.