ఆంధ్రప్రదేశ్‌

ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, నవంబర్ 20 : అనంతపురం నగరంలో ఆదివారం అధికారులు రోడ్ల విస్తరణకు పూనుకోగా స్థానికులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ కోన శశిధర్ సూచనలతో నగరపాలక సిబ్బంది పోలీసుల సహాయంతో నగరంలోని తిలక్‌రోడ్డులో ఆక్రమిత స్థలాల్లోని భవనాలను కూలదోసేందుకు యత్నించారు. దీంతో స్థానికులు జెసిబిని అడ్డుకుని ఆందోళనకు దిగారు. వారికి అధికార పార్టీకే చెందిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకరచౌదరి అనుచరులు మద్దతుగా నిలిచారు. కాగా అనంతపురం ఎంపి జెసి దివాకర్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు నగరాభివృద్ధిలో భాగంగా నగరంలోని రోడ్ల విస్తరణ చేపట్టాలన్న ఆదేశాలున్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వం నగరంలోని తిలక్‌రోడ్డుకు రూ. 60 కోట్లు, గాంధీ బజార్ విస్తరణకు ఆర్‌అండ్‌బి ద్వారా రూ. 27.5 కోట్ల నిధులను ఐదారు నెలల క్రితమే విడుదల చేసింది. రోడ్ల విస్తరణ ఆలస్యం కావడంతో ఎంపి జెసి దివాకర్‌రెడ్డి ఈ నెల 21వ తేదీ(సోమవారం) నగర పాలక సంస్థ ఎదుట ధర్నా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్నాహ్నం తిలక్‌రోడ్డులో పోలీసులు మోహరించి ఆక్రమణల తొలగింపునకు పూనుకున్నారు. దీంతో స్థానికులు, దుకాణదారులు ఆందోళనకు దిగగా వారికి ఎమ్మెల్యే అనుచరవర్గం మద్దతుగా నిలిచి ఎంపి జెసి చర్యలను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. అలాగే జెసిబిని అడ్డుకుని మూకుమ్మడిగా బైఠాయించారు. దీంతో ఓవైపు పోలీసులు, మరోవైపు ఆందోళనకారుల నిరసనలతో తిలక్‌రోడ్డు అట్టుడికింది. దీనికి తోడు టిడిపి నేత రషీద్‌అహ్మద్, కొందరు నాయకులు రోడ్డు విస్తరణ చర్యలను తీవ్రంగా ఖండించారు. ఇళ్లు ఖాళీ చేసేందుకైనా గడువు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు గాంధీబజార్ రోడ్డులో అడ్డంగా ఉన్న దుకాణాల బోర్డులు, ఫ్లెక్సీలు, మెట్లు వంటివి తొలగించే పనులు ప్రారంభించారు. రోడ్ల విస్తరణపై కొందరు హైకోర్టుకెళ్లి స్టే తీసుకొచ్చారు. స్టే లేనివి, ఆక్రమణ స్థలంలోని భవనాలు తొలగించేందుకు చేసిన యత్నం వివాదాస్పదమైంది. కాగా ధర్నా చేయవద్దంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంపి జెసి దివాకర్‌రెడ్డికి సూచించినట్లు సమాచారం. అయితే నిధులు మురిగిపోయే ప్రమాదం ఉందని, స్థానిక ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని, పనులు చేయాల్సి ఉందని ఎంపి సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. ఏదైమైనా సోమవారం నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తారని ఎంపి పేర్కొన్నారని ఆయన వర్గీయులు స్పష్టం చేస్తున్నారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికార యంత్రాంగం ముందుస్తు చర్యలు చేపట్టింది.

చిత్రం.. రోడ్డు విస్తరణ పనులను అడ్డుకుంటున్న స్థానికులు