రాష్ట్రీయం

శాంతి మన లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: మనమంతా ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్నాం. సముద్ర జలాల్లో శాంతి, సుస్థిరత, పరస్పర సహకారం కోసం అన్ని దేశాల నౌకాదళాలు కదలి రావాలని త్రివిధ దళాధిపతి, భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో ప్రధాన ఘట్టమైన ఫ్లీట్ రివ్యూ శనివారం విశాఖ తీరంలో జరిగింది. సర్వసైన్యాధ్యక్ష హోదాలో ప్రణబ్ ముఖర్జీ దేశ, విదేశీ యుద్ధ నౌకలను సమీక్షించారు. యుద్ధ విమాన విన్యాసాలను తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడంతోపాటు, భారతదేశంపై తమకున్న దేశభక్తికి చిహ్నంగా ఫ్లీట్ రివ్యూ నిర్వహిస్తున్నామన్నారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూని నిర్వహించడం ద్వారా వివిధ దేశాలతో తమ బంధం మరింత బలపడిందన్నారు. వివిధ దేశాల నౌకదళ శౌర్య పరాక్రమాలను ఒకేచోట ప్రదర్శించేందుకు ఫ్లీట్ రివ్యూ వేదికైందన్నారు. వివిధ దేశాల నౌకాదళాలు ఒకేచోటికి చేరాయి. సముద్ర జలాల్లో శాంతి, సుస్థిరత కాపాడాలన్నది మన అందరి లక్ష్యం. పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. నౌకాయానం మరింత బలపడేందుకు మనందరం భాగస్వాములం కావాలని రాష్టప్రతి పిలుపునిచ్చారు. అనేక దేశాల నౌకాదళాలు ఐఎఫ్‌ఆర్‌లో పాల్గొనడం ద్వారా ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ స్ఫూర్తిని మరింత పెంచాయన్నారు. భౌగోళికంగా విడిపోయినా, సముద్రపరంగా మనమంతా కలిసే ఉన్నామని ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఇంటర్నేషల్ ఫ్లీట్ రివ్యూ ప్రపంచ దేశాలకు విలువైన సందేశం ఇవ్వబోతోందన్నారు. మానవత్వాన్ని పెంపొందించేందుకు ఒకరికొకరం చేతులు కలిపేందుకు ఈ ఫ్లీట్ రివ్యూ దోహదపడుతుందన్న ఆశాభావాన్ని ప్రణబ్ వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల్లోని నేవీలు తమ ప్రతిష్ఠను పెంచుకుంటూనే, సముద్ర జలాల్లో ప్రశాంతత పెంపొందించేందుకు కృషి చేస్తున్నాయన్నారు. ఫ్లీట్ రివ్యూలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ తమ తమ దేశాల్లో భారత దేశం ఆకాంక్షిస్తున్న శాంతి, సుస్థిరతలను వివరించే అంబాసిడర్‌లుగా వ్యవహరించాలని కోరారు. మీరందిస్తున్న స్నేహ హస్తాన్ని అందిపుచ్చుకుని భద్రత, రక్షణ, శాంతిని నలుదిశలా విస్తరించడానికి భారతదేశం కృషి చేస్తుందని ప్రకటించారు. గత రెండు రోజులుగా మీరు ఈ ప్రాంతంలో ఉంటున్నారు. కలిసి ప్రయాణిస్తున్నారు. ఇది మంచి అనుభూతిగా భావించి, భవిష్యత్‌లోనూ కలిసి పనిచేయడానికి సహకారించాలని ప్రణబ్ విజ్ఞప్తి చేశారు. సువిశాలమైన హిందూ మహాసముద్రంలో సముద్ర రవాణాలో కీలక భూమిక పోషిస్తోందని ప్రణబ్ అన్నారు. ప్రపంచీకరణ, ఆర్థికాభివృద్ధి, మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సముద్ర జలాల్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించాలని ప్రణబ్ విజ్ఞప్తి చేశారు. ఇందుకు అనుగుణంగా భారత నౌకాదళం మారిటైం వ్యూహాన్ని మార్చుకుంటోందని చెప్పారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూని ఇంత అద్భుతంగా, కచ్చితమైన ప్రణాళికతో నిర్వహించిన భారత నౌకాదళాన్ని ప్రణబ్ అభినందించారు. నేవీకి విశాఖ ప్రజలు మంచి సహకారాన్ని అందించడం వలన కార్యక్రమం ఇంతగా విజయవంతమైందన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, విశాఖ నగర ప్రజలకు ప్రణబ్ అభినందనలు తెలియచేశారు. వివిధ దేశాల నుంచి తరలి వచ్చిన విదేశీ అతిథులు తిరిగి వెళుతూ మంచి అనుభూతులను తీసుకువెళతారన్న నమ్మకం తనకు ఉందన్నారు. భారత సంస్కృతి, సంప్రదాయాలతోపాటు, ప్రపంచ శాంతి కోసం భారత్ చేస్తున్న కృషి గురించి తమ దేశాల్లో చాటి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా స్నేహబంధం మరింత బలపడటంతోపాటు, భవిష్యత్‌లో మెరుగైన సముద్రయానానికి మార్గం సుగమవుతుందని ప్రణబ్ పేర్కొన్నారు.
చిత్రం.. విశ్వనౌకా వీక్షణం

ఐఎన్‌ఎస్ సుమిత్రపైనుంచి దేశ విదేశీ యుద్ధనౌకలను సమీక్షిస్తున్న రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, నౌకాదళ అధికారులు.

చిత్రం... ఓ యుద్ధ నౌకపై నుంచి రాష్టప్రతికి గౌరవ వందనం చేస్తున్న నౌకాదళ సిబ్బంది