ఆంధ్రప్రదేశ్‌

తుది దశకు ప్రజాసాధికార సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 4: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజా సాధికార సర్వే తుదిదశకు చేరుకుంటోంది. ఇప్పటివరకు 4.35 కోట్ల పైగా ఉన్న కుటుంబాల్లో 4.25 కోట్ల మంది వివరాలను అధికారులు సేకరించారు. అధికారిక జనాభా లెక్కల ప్రకారం మరో 98 లక్షల మంది వివరాలు రాబట్టాల్సి ఉంది. రాష్ట్రంలో నివసిస్తున్న వారి సమగ్ర వివరాల నమోదుకు ప్రభుత్వం ప్రజా సాధికార సర్వేను ఈ ఏడాది జూన్‌లో ప్రారంభించింది. 17 శాఖలకు చెందిన 30వేల మంది ఉద్యోగులు ఈ సర్వేలో పాల్గొంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు కోటీ 35 లక్షల 20వేల 813 కుటుంబాలను కలిశారు. ఆయా కుటుంబాలకు చెందిన 4 కోట్ల 24 లక్షల 56వేల మంది వివరాలు సేకరించారు. ఈ సర్వేలో భాగంగా ప్రతి వ్యక్తి నుంచి 32 రకాల ప్రశ్నలకు జవాబులు రాబట్టారు. వాటిలో 12 ప్రశ్నలకు ఆధారాలతో కూడిన జవాబులను సేకరించారు. సమాచారంతో పాటు వేలిముద్రలూ తీసుకుంటున్నారు. 400 నుంచి 600 ఇళ్లను ఒక బ్లాక్‌గా తీసుకుని సర్వే చేస్తున్నారు. ఒక్కో బ్లాక్‌కు ఒక్కో ఎన్యూమరేటర్‌ను ప్రభుత్వం నియమించింది. రోజుకు 14 నుంచి 20 ఇళ్ల వరకు సర్వే చేసేలా చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5.23 కోట్ల జనాభా ఉంది. దీని ప్రకారం మరో 98 లక్షల మంది వివరాలు సేకరించాల్సి ఉంది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సాధ్యమైనంత త్వరగా సర్వే పూర్తిచేయాలని స్పష్టం చేసింది. అదే సమయంలో సర్వేలో చురుగ్గా పాల్గొన్న అధికారులకు ప్రోత్సాహకాలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అధికారులు ప్రజా సాధికార సర్వే పూర్తికి అహర్నిశలూ కృషి చేస్తున్నారు. సర్వేకు సహకరించాలంటూ గ్రామాలు, పట్టణాల్లో ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే సర్వే పూర్తయిన ప్రాంతాల్లో మిగిలి ఉన్న వారి కోసం శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఎంత గొప్ప పథకమైనా అర్హులకు అందినప్పుడే దాని ఉద్దేశం నెరవేరుతుంది. కొందరు అక్రమార్కుల వల్ల పథకాలు పక్కదారి పడుతున్నాయి. ఇలాంటి అక్రమాలకు కళ్లెం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిజమైన లబ్ధిదారులకు పథకాలు వర్తించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రజా సాధికార సర్వేకు శ్రీకారం చుట్టింది. అదే సమయంలో రిజర్వేషన్ల కల్పనలోనూ స్పష్టత రావడానికి ఈ సర్వే దోహదపడుతుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు విరివిరిగా అమలుచేస్తోంది. సబ్సిడీపై రేషన్ సరకుల అందజేత, సామాజిక పింఛన్ల పంపిణీ, ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాలకు స్వయం ఉపాధితో పాటు ఉన్నత విద్య కోసం రుణాలు, ఇళ్ల నిర్మాణాలు, మైనార్టీలకు ఆర్థిక భరోసా కల్పించడం.. ఇలా ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలు అర్హులకే వర్తింపజేయాలన్నది ప్రభుత్వం లక్ష్యం. ఇందుకు ఆధార్‌కార్డుల అనుసంధానం చేయడం ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేయనున్నారు. అందుకే సర్వేలో భాగంగా అధికారులు ఆయా వ్యక్తుల వివరాలను ఆధార్ కార్డులతో అనుసంధానం చేస్తున్నారు. సర్వే కోసం అధికారులకు ప్రభుత్వం ట్యాబ్‌లు అందజేసింది. వాటికి 4జి సిమ్‌లు అమర్చి, వాటిద్వారా సేకరిస్తున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజా సాధికార సర్వే పేరుతో ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌కు పొందుపర్చేలా చర్యలు తీసుకుంది. దీంతో రాష్ట్రంలో ఎక్కడ సర్వే చేస్తున్నా క్షణాల్లో ప్రజా సాధికార సర్వే వెబ్‌సైట్‌లో వివరాలు నమోదవుతున్నాయి.