ఆంధ్రప్రదేశ్‌

ఫిన్‌టెక్ వాలీతో విశాఖకు కొత్త రూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 12: విశాఖను ఐటి పరిశ్రమకు కేంద్రంగా అభివృద్ధి చేసే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక చర్యలు చేపడుతున్నారని మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సంస్థ ఆధ్వర్యాన విశాఖ ఎయులో సోమవారం జరిగిన డిజిటల్ సమ్మిట్-2016 సదస్సులో ఆయన మాట్లాడారు. రుషికొండ ఐటి సెజ్‌లో ఫిన్‌టెక్ వాలీ ఏర్పాటు ద్వారా ఔత్సాహిక ఐటి కంపెనీలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. సుమారు 100 ఎకరాల్లో రూపుదిద్దుకుంటున్న ఫిన్‌టెక్ సిటీ లేఅవుట్‌లో చిన్నచిన్న ఐటి కంపెనీలకు అవకాశం కల్పించడం ద్వారా ఐటి రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు 10 నుంచి 20వేల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఔత్సాహికులు నూతన ఆవిష్కరణలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వ తోడ్పాటు ఉంటుందని, రాష్ట్రంలో సాంకేతికతను పెద్ద ఎత్తున ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పింఛన్లు, రేషన్ సరుకుల పంపిణీలో సాంకేతికను అమలు చేయడం ద్వారా పెద్ద ఎత్తున బోగస్ పింఛన్లు, రేషన్ కార్డులను నిలువరించగలిగామన్నారు. నోట్ల రద్దు కారణంగా ఎదురైన పరిస్థితులను ఎదుర్కొనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే సన్నద్ధమైందన్నారు. పెద్ద ఎత్తున నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే విధంగా తీసుకున్న చర్యలు మంచి ఫలితాలు ఇచ్చాయని మంత్రి అన్నారు. భవిష్యత్‌లో నగదు చెలామణిని పూర్తిగా అరికట్టి నగదు రహిత లావాదేవీలకు పెద్దపీట వేయనున్నట్టు వెల్లడించారు. దీనిలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నగదు రహిత లావాదేవీలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించే దిశగా ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపట్టనుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నామని, ఒక్కో కళాశాల గ్రామాలను దత్తత తీసుకుని, నగదు రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక అమలు చేస్తున్నట్టు మంత్రి గంటా వెల్లడించారు. పల్లె ప్రజానీకం బ్యాంకింగ్ వ్యవస్థను ఉపయోగించుకుంటే నగదు చెలామణిని నివారించడంతో పాటు పారదర్శకతకు అవకాశమేర్పడుతుందని మంత్రి పేర్కొన్నారు.

చిత్రం.. డిజిటల్ సమ్మిట్-2016లో మాట్లాడుతున్న మంత్రి గంటా శ్రీనివాసరావు