ఆంధ్రప్రదేశ్‌

భూమాత సంరక్షణే భావితరాలకు రక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్తిపాడు, డిసెంబర్ 13: భూమాత సంరక్షణకు భావితరాలు నడుం బిగించాలని శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. గుంటూరుకు సమీపంలోని విశ్వగురుపీఠంలో మంగళవారం దత్త జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ‘్భమాత సంరక్షణలో మేధావుల పాత్ర’ అనే అంశంపై పలువురు ప్రముఖులు ప్రసంగించారు. సభకు అధ్యక్షత వహించిన బుద్ధప్రసాద్ మాట్లాడుతూ మానవాళి భూమిని ఓ తల్లిగా కొలుస్తోందని, అయితే పరిరక్షణలో మాత్రం విఫలమవుతోందని అన్నారు. అందువల్లే విపత్తులు సంభవిస్తున్నాయన్నారు. మానవాళి మనుగడకు ‘వృక్షో రక్షతి రక్షితః’ అనే ధర్మాన్ని పాటించాలని సూచించారు. మనిషి స్వార్థం వల్లనే పర్యావరణానికి తూట్లు పడుతున్నాయని, సంకుచిత ప్రయోజనాలను విడనాడి భూమాతను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. సర్వమానవాళితోపాటు సర్వభూతాలను ప్రేమించి మానవత్వాన్ని నెలకొల్పడమే లక్ష్యంగా విశ్వంజీ మహరాజ్ సంకల్పించడం సుకృతమని బుద్ధప్రసాద్ అన్నారు.
విశ్వగురు పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ మాట్లాడుతూ ధర్మమే ప్రకృతిబద్ధమైన మార్గమని, అదే తనవద్దకు రప్పిస్తుందని దత్తుడు ప్రవచించారన్నారు. అనంత విశ్వాన్ని సృష్టించి క్రమం తప్పకుండా రుతువును నడిపిస్తున్న శక్తి దత్తాత్రేయుడేనని, ఆయన ఆకారంగా రావాలంటే ప్రకృతిబద్ధమైన పృథ్వి ఉండాలని అభిభాషించారు. పంచభూతాలతో కూడిన తత్వం వల్లే భూమాత శక్తికి విలువ వస్తుందని, దత్తనామ స్మరణ మనస్సును శక్తిమంతం చేస్తుందన్నారు. దైవాంశ సంభూతులైన గురువులు నమ్మకాన్ని, విశ్వాసాన్ని మానవాళిలో నింపారని, ఇదే సనాతన ధర్మంగా అభివర్ణించారు. ప్రస్తుతం భరతమాత హృదయ స్పందన ప్రేమ, శాంతి అని, అందరూ సమైక్యతతో ముందుకు సాగితేనే రాష్ట్రం, దేశం, ప్రపంచం శక్తిమంతం అవుతాయని, ఇదే దత్తాత్రేయుడు ఉద్బోధ అని చెప్తూ.. ఎక్కడ సమైక్యత ఉంటుందో అక్కడ విజయం తథ్యమన్నారు. ప్రకృతికి విరుద్ధంగా పయనించడం వల్లే ఉపద్రవాలు, విపత్తులు ముంచుకొస్తున్నాయని, విధ్యుక్త్ధర్మం నిర్వర్తించేవారికే గురుదేవులు శక్తిని ప్రసాదిస్తారన్నారు. ఆ శక్తిని సంగ్రహించడం ద్వారా భూమాత పరిరక్షణలో పునీతులు కావాలని పిలుపునిచ్చారు. అమెరికా, భారత్ మధ్య రక్షణ విషయంలో సఖ్యత ఏర్పడుతుందని, ఆపై రష్యా, పాకిస్తాన్ సమైక్యమయ్యే సమయం వస్తుందని, అప్పుడే ప్రపంచం ప్రశాంత నిలయంగా మారుతుందని స్వామీజీ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ మాట్లాడుతూ విశ్వశాంతి, సర్వజన హితం కోసం ఏంచేయాలో తెలుసుకుని, మానవాళికి మేలు చేయాలని విశ్వంజీ సంకల్పించడం గర్వకారణమన్నారు. భూమాత వినాశనంలో మేధావులే కీలకపాత్ర పోషిస్తున్నారని, మానవాళి మనుగడకు అవసరమైన పర్యావరణ పరిరక్షణను ధ్వంసం చేయడంలో కృతకృత్యులయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. దేశ రాజధానినే కాలుష్యభూతం ఆవహించాయని, జీవించే పరిస్థితులు లేని నెంబర్ వన్ నగరంగా మారడం పట్ల మేధావులు, ప్రభుత్వాలు, నాయకులు, పర్యావరణవేత్తలు పట్టీపట్టనట్లు వ్యవహరించడం బాధాకరమన్నారు. అడవుల నరికివేత, తీవ్ర కాలుష్యం వల్లే ఉపద్రవాలు వస్తున్నాయన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు మాట్లాడుతూ మానవ సేవే మాధవసేవగా స్వామీజీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఆయన ఆశీస్సులు రాష్ట్రానికి అవసరమన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ లోకకల్యాణం కోసం స్వామీజీ చేస్తున్న సేవలు అనన్య సామాన్యమన్నారు. సినీనటుడు జయప్రకాశ్‌రెడ్డి విశ్వంజీతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో తానా అధ్యక్షుడు తోటకూర ప్రసాద్, ఎసిబి ప్రిన్సిపల్ చీఫ్ లీగల్ అడ్వయిజర్ పివికె రమణప్రసాద్, గుంటూరు అదనపు ఎస్పీ జె భాస్కరరావు, తిరుపతి పిటిసి అదనపు ఎస్పీ భాస్కరరెడ్డి, విశ్వమానవ సమైక్యత సంసత్ కన్వీనర్ ఆకుల కోటేశ్వరరావు, వ్యాపారవేత్త మైనేని ప్రసాద్, ఎకె గుప్తా, పాల్గొన్నారు.

చిత్రం..అనుగ్రహ భాషణం చేస్తున్న విశ్వంజీ మహారాజ్. మంత్రులు ప్రత్తిపాటి, శిద్ధా, ఉప సభాపతి బుద్ధ ప్రసాద్ ఉన్నారు