ఆంధ్రప్రదేశ్‌

జనం బాధలో భాగమవండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 15: పెద్దనోట్ల అనంతరం ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. చిన్ననోట్ల కోసం ప్రజలు పడుతున్న కష్టాలు, వారికి సమస్యలు ఎదురవకుండా తీసుకోవలసిన చర్యలపై చంద్రబాబునాయుడు క్యాబినెట్ విస్తృతంగా చర్చించి, మంత్రులను కూడా ఇకపై ఆ అంశంపై జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. గురువారం జరిగిన క్యాబినెట్ భేటీ నగదు కష్టాల చుట్టూ తిరిగింది. సాధారణ ప్రజానీకం అనేక ఇబ్బందులు పడుతున్నారని, తాను కూడా స్వయంగా బ్యాంకుల వద్దకు వెళ్లి పరిస్థితి గమనించానని మంత్రి దేవినేని ఉమ చెప్పినట్లు తెలిసింది. ఇది మన పార్టీకీ ఇబ్బందికరమేనని, ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారని బాబు దృష్టికి తీసుకువెళ్లారు.
ఉమతోపాటు పలువురు మంత్రులు కూడా నగదు సమస్యలపైనే ఏకరవు పెట్టినట్లు సమాచారం. ప్రజల్లోకి వెళ్లడం కష్టంగా మారిందని, ప్రతి ఒక్కరూ మోదీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతున్నారని, ప్రత్యామ్నాయం చూసుకోకుండా కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల ఎప్పుడూ రోడ్డెక్కని తాము గంటలపాటు ఏటిఎం, బ్యాంకుల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందని, వివిధ వర్గాలు తమ ముందే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని బాబు దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్రంలోని బిజెపి తీసుకున్న ఈ నిర్ణయం వల్ల తమ పార్టీ కూడా నష్టపోయే ప్రమాదం వచ్చిందని ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. అందుకు స్పందించిన బాబు.. ఇన్నిరోజులు గడిచినా సమస్య పరిష్కారం ఒక కొలిక్కి రాకపోవడం తనకూ ఆందోళన కలిగిస్తున్నా, అధైర్యపడకుండా సమీక్షలు నిర్వహించడం వల్ల బ్యాంకు అధికారుల్లో కొంత చలనం వచ్చిందన్నారు. ఆర్‌బిఐ పనితీరు బాగోలేదని, ప్రజలకు డబ్బు అందించాల్సిన బాధ్యత వారిదేనన్నారు. త్వరలో మరో 2500 కోట్లు వస్తున్నాయన్నారు. ‘మీరూ జిల్లాల్లో సమీక్షలు నిర్వహించి బ్యాంకర్లతో పనిచేయించండి. ఇది బ్యాంకర్ల వైఫల్యమే. అయినా మనం జనం పక్షాన ఉండాలి. వారి సమస్యల్లో భాగం పంచుకోవాలి. సమస్య వచ్చిందని పారిపోకూడదు. ధైర్యంగా ఎదుర్కోవాల’ని స్పష్టం చేశారు. పెన్షనర్లు ఇబ్బంది పడకుండా చూడాలని, ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించారు. కాగా, ప్రతి క్యాబినెట్ సమావేశానికి సెల్‌ఫోన్లతో వచ్చే మంత్రుల ఉత్సాహానికి ఈసారి బ్రేక్ పడింది. కీలకమైన మంత్రివర్గ సమావేశ సందర్భంలో సెల్‌ఫోన్లు ఉండటం వల్ల అంతరాయంతోపాటు, వారి దృష్టి ఇతర అంశాలపై వెళుతోందని గ్రహించిన బాబు, వారిని క్రమశిక్షణలో ఉంచేందుకు సెల్‌ఫోన్లు తీసుకురావద్దని ఆదేశించారు. దానితో వాటిని బయటే ఉంచి లోపలకు వెళ్లారు. గతంలో బాబు ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు చాలామంది నేతలు ఆయన వద్దకు ఫోన్లతో వెళ్లడం, చర్చల మధ్యలో ఫోన్లు మోగడంతో ఇబ్బందికరంగా ఉండేది. నేతలను ఫోన్లు తీసుకువెళ్లవద్దని అప్పుడు ఆదేశించినా ఎవరూ దానిని పాటించలేదు. ఇప్పుడు మంత్రివర్గ సమావేశాల నుంచి బాబు వారిని ఎట్టకేలకు క్రమశిక్షలో పెట్టినట్టయింది.
అధికారుల సమీక్షలోనూ అదే ఆందోళన
కాగా అంతకుముందు ఉదయం జరిగిన అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, మంత్రుల సమీక్షలో కూడా నగదుపైనే ఆందోళన వ్యక్తమయింది. జనం ఆగ్రహంగా ఉన్న ఈ సమయంలో వారి వద్దకు వెళ్లాలంటేనే భయంగా ఉందని మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు నచ్చచెబితే వినే పరిస్థితిలో లేరన్నారు. పెన్షన్లకూ ఇబ్బందులు తప్పడం లేదని, ఆర్ధిక పరిస్థితి బాగోలేదని అధికారులు చెప్పారు.