ఆంధ్రప్రదేశ్‌

కాపుల గురించి కాంగ్రెస్ మాట్లాడ్డమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 6: గత పదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకమైన పదవులు ఒరగబెట్టిన బొత్స సత్యనారాయణ, వి.హనుమంతరావు, వట్టి వసంతకుమార్ వంటివారు నేడు కాపులకు రిజర్వేషన్ల విషయంపై రంకెలు వేస్తుండటం శోచనీయమని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ అన్నారు. శనివారం నాడిక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడుతూ 1994 ప్రాంతంలో నాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి హడావుడిగా కాపులను బిసిల్లో చేరుస్తూ జారీ చేసిన జీవోకు ఆ తరువాత విలువ లేకుండా పోయిందన్నారు. అందుకే శాస్ర్తియ పద్ధతిలో రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దశ్యంతో తొలిసారిగా కాపు కమిషన్‌ను నియమించటం జరిగిందని ఆయనన్నారు. 9నెలల గడువులో ఇప్పటికే ఎటూ నెలా 10 రోజులు ముగిసిందని మరో 7నెలల 24 రోజులు వేచి వుంటే చాలన్నారు. ఇప్పటికప్పుడే రిజర్వేషన్లు ప్రకటించాలనటం శోచనీయమన్నారు. రాష్ట్రంలోని తొలిసారిగా కాపు కార్పొరేషన్ ఏర్పాటుచేసి తొలుతగా రూ.100 కోట్లు కేటాయించటం జరిగిందని, వచ్చే ఆర్ధిక సంవత్సరంలో రూ.1000 కోట్లు సమకూర్చటం జరుగుతుందన్నారు.

ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 6: కాపులను బిసిల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ఆమరణ దీక్ష చేపట్టిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దంపతులకు మద్దతుగా గోదావరి జిల్లాల్లో రెండో రోజు శనివారం ఆందోళనలు కొనసాగాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు కాపు సామాజికవర్గానికి చెందిన వారు మహిళలు, పిల్లలతో సహా రోడ్డెక్కి కంచాలపై గరిటెలతో కొడుతూ నిరసన వ్యక్తంచేసారు. అయితే రాజమహేంద్రవరంతో పాటు గోదావరి జిల్లాల్లోని అనేక చోట్ల ముద్రగడ దంపతులకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టేందుకు కాపు యువకులు చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. రాజమహేంద్రవరంలోని కోటగుమ్మం సెంటరులో దీక్షా శిబిరాన్ని ఏర్పాటుచేసేందుకు కాపు సామాజికవర్గం నాయకులు టెంటు వేస్తున్న సమయంలోనే పోలీసులు అడ్డుకోవటంతో, రాష్ట్రప్రభుత్వానికి వ్యతిరేకంగా కాపు యువకులు నినాదాలు చేసారు. కోనసీమలో చాలా చోట్ల పోలీసులు అడ్డుకున్నాగానీ, వ్యతిరేకించి దీక్షా శిబిరాలను ఏర్పాటుచేసారు. దాంతో దీక్షా శిబిరాలను ఏర్పాటుచేసి, శిబిరాల్లో కూర్చున్న వారిపై పోలీసులు కేసులు నమోదుచేస్తున్నారు. సెక్షన్ 30, 144సెక్షన్ అమలులో ఉన్నప్పటికీ దీక్షా శిబిరాలను ఏర్పాటుచేయటంతోపాటు, ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారన్న అభియోగంతో పోలీసులు కేసులు నమోదుచేస్తున్నారు. రాయలసీమ, కృష్ణా, గుంటూరు, కర్నూలు, కడప తదితర జిల్లాల నుండి పోలీస్ ఇంటిలిజెన్స్ సిబ్బందిని గోదావరి జిల్లాలకు రప్పించి మరీ కాపు సామాజికవర్గం ఆందోళనపై నిఘా పెట్టారు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి తలెత్తినాగానీ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు శుక్రవారం వరకు ఉన్న బలగాలకు అదనంగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ఆధీనంలోని పోలీసు బలగాలను గోదావరి జిల్లాలకు రప్పించారు. ఇప్పటి వరకు పోలీస్ పికెట్ల సంఖ్యను కిర్లంపూడి చుట్టూ పెంచటంతోపాటు, తనిఖీల తీవ్రతను కూడా పెంచారు. మరోపక్క ఆర్టీసీ, రైల్వే అధికారులు ప్రత్యేకంగా ఇంటిలిజెన్స్ సిబ్బందిని నియమించి, కిర్లంపూడిలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ముద్రగడ దంపతులు దీక్ష చేస్తున్న కిర్లంపూడిలోని పరిస్థితిని బట్టి వేగంగా నిర్ణయాలను తీసుకుని, తమ ఆస్తులను రక్షించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకునేందుకు ఆర్టీసీ, రైల్వే అధికారులు కిర్లంపూడిలో ప్రత్యేక నిఘాను ఏర్పాటుచేసుకున్నారు. విశాఖలో జరుగుతున్న ఇంటర్నేషన్ ఫ్లీట్ రివ్యూ ముగిసే వరకు ముద్రగడ ఆమరణ దీక్షపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని రాష్ట్రప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
కాపులది కంచం పోరాటం
గుంటూరు: కాపులు తమ న్యాయమైన కోర్కెల సాధన కోసం కంచం పోరాటం చేస్తుంటే, తెలుగుదేశం పార్టీ లంచాల కోసం ఆరాట పడుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో మాజీ మంత్రి, కాపునేత ముద్రగడ్డ పద్మనాభం శుక్రవారం సతీమణితో కలిసి చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షకు శనివారం అంబటి రాంబాబు గుంటూరులోని తన స్వగృహంలో కుటుంబ సభ్యులతో కలిసి కంచంపై గెంటతో చప్పుడు చేస్తూ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ బిసిలకు నష్టం వాటిల్లకుండా కాపులకు రిజర్వేషన్ కల్పించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉందన్నారు. తాము ఏ వర్గానికీ వ్యతిరేకం కాదని, తమకు ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం మేరకే శాంతియుతంగా నిరసన, ఆందోళన తెలియజేస్తున్నామన్నారు. ప్రభుత్వం శాంతియుతంగా నిరసన వ్యక్తంచేస్తున్న కాపు సంఘీయులు, నాయకులపై అక్రమ కేసులు బనాయించడం దుర్మార్గమన్నారు.

తిరుపతిలో ప్రేమజంట ఆత్మహత్య
తిరుపతి, ఫిబ్రవరి 6: స్థానిక పద్మావతి మహిళా యూనివర్సిటీ సమీపంలోని రైలు పట్టాలపై ప్రేమజంట ఆత్మ హత్యకు పాల్పడి ఉండటాన్ని శనివారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే వీరు ఏ ప్రాంతానికి చెందిన వారో తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. పెద్దలు వారి ప్రేమ వివాహానికి అంగీకరించకపోవడంతోనే వారు ఈ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.
అరుదైన నక్షత్ర తాబేలు లభ్యం
అవనిగడ్డ, ఫిబ్రవరి 6: కృష్ణా జిల్లా అవనిగడ్డ మండల పరిధిలోని పులిగడ్డ గ్రామంలోని వారధి వద్ద కృష్ణానదిలో 15కిలోల బరువున్న అరుదైన నక్షత్ర తాబేలు లభ్యమైంది. మత్స్య కార్మికుడు పీతా లవయ్యకు శనివారం వల వేసిన సందర్భంలో ఈ తాబేలు చిక్కింది. ఈ తరహా తాబేళ్లు ఒరిస్సా, శ్రీకాకుళం సముద్రతీర ప్రాంతంలో ఉంటాయని, అరుదైన ఈ తాబేలు పులిగడ్డలో ప్రత్యక్షమవటంతో పలువురు ఆసక్తిగా తిలకించారు. ఈ తాబేలుపై నక్షత్రాల గుర్తులు ఉండటంతో నక్షత్ర తాబేలుగా పిలుస్తారు. అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ భవానీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. ఆమె ఆదేశం మేరకు సహాయ ఎఫ్‌ఆర్‌ఓ శ్రీనివాసరావును హంసలదీవి వద్ద కృష్ణా సాగర సంగమంలో ఈ తాబేలును వదలాలని ఆదేశించారు. 15కిలోల బరువున్న తాబేళ్లు తరచూ బయటే తిరుగుతుంటాయంటారు. అయితే దీనికి నక్షత్రాల గుర్తులు ఉండటంతో పలువురు ఆసక్తిగా తిలకించారు.

ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం
సిఆర్‌డిఏ అధికారిణిపై వైసిపి ఎమ్మెల్యే ఫిర్యాదు
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, ఫిబ్రవరి 6: తెలుగుదేశం పార్టీ నాయకులు, సిఆర్‌డిఎ అధికారులు కుమ్మకై విలువైన ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసి భూసమీకరణకు ఇవ్వటమే కాకుండా కౌలు పరిహారాలు పొందుతున్నారని వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఆరోపించారు. శనివారం మంగళగిరి మండలంలోని నిడమర్రు సిఆర్‌డిఎ కార్యాలయం వద్ద రైతులతో కలిసి ఎమ్మెల్యే ఆళ్ల ఆందోళన చేపట్టారు. అంతేకాకుండా అన్యాక్రాంతమైన విలువైన భూమికి సంబంధించిన వివరాలను గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీ్ధర్‌కు సమాచారం అందించారు. జెసి పరిశీలిస్తానని హామీ ఇవ్వటంతో ఆందోళనను విరమించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజధాని ప్రాంతంలో నీటి కుంటలు, అటవీ భూములు, కొండలు, వాగులు, శ్మశానాలకు సంబంధించిన ప్రభుత్వ భూములు అనేకం ఉన్నాయని ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు. నీరుకొండ గ్రామానికి చెందిన 350 సర్వే నెంబరు గల 1.8 ఎకరాల భూమి పంచాయతీ బావి కింద ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎం కోటేశ్వరరావు దానిని భూసమీకరణకు అందజేశారని తెలిపారు. అంతేకాకుండా సిఆర్‌డిఎ అధికారుల నుంచి 30 వేల కౌలుపరిహారం కూడా తీసున్నాడన్నారు. మరో 8.53 ఎకరాలు ఉన్నట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి భూసమీకరణకు ఇచ్చినట్లు ఆరోపించారు. తెలుగుదేశంపార్టీ నాయకుడు కోటేశ్వరరావు నిడమర్రు సిఆర్‌డిఎ ప్రత్యేక డెప్యూటీ కలెక్టర్ శారదాదేవికి 75 సెంట్ల భూమిని ఆమె కుమారుడు చంద్రశేఖర్, కూతురు పి శైలజ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు. కాగా ప్రత్యేక డెప్యూటీ కలెక్టర్ శారదదేవి మాట్లాడుతూ తమ పిల్లలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారని, వారు కొంత భూమిని కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. దీనిలో ఎటువంటి అవకతవకలూ చోటుచేసుకోలేదని స్పష్టం చేశారు.