ఆంధ్రప్రదేశ్‌

మద్యం దుకాణాలకు సుప్రీం శరాఘాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 17: జాతీయ రాష్ట్ర రహదారుల వెంబడి మద్యం దుకాణాలను 2017 మార్చి మాసాంతంలోపు తొలగించాలంటూ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలు మద్యం వ్యాపారులనే కాదు పాలకులను సైతం హడలెత్తిస్తున్నాయి. ఎక్సైజ్ అధికారులు, మద్యం వ్యాపారులు మద్యం సిండికేట్లతో కుమ్మక్కయి ఉన్న చట్టబద్ద నిబంధనలనే తోసి రాజని అడ్డగోలుగా మద్యం దుకాణాలను, బార్ అండ్ రెస్టారెంట్లకు లైసెన్స్‌లు ఇస్తూ వచ్చారు. పైగా వీటిలో 90 శాతం పైగా మద్యం దుకాణాలు పర్మిట్ రూమ్‌లు లేకుండానే నిర్ణీత వేళాపాళా అంటూ లేకుండా తెరచుకోటం నిత్యం కన్పించే దృశ్యాలే. ఇక కొన్ని రూట్లలో ముఖ్యంగా రాత్రివేళ లారీలు బారులుదీరి నిలబడటం అటుంచి కొందరు బస్సు డ్రైవర్లు కూడా మద్యం దుకాణాల సమీపంలో హోటళ్ల వద్ద టీ, టిఫిన్లు, భోజనాలు పేరిట కొంతసేపు నిలుపుతున్న సంఘటనలు కోకొల్లలు. ఇక సుప్రీం తీర్పు వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని మద్యం దుకాణాలను తొలగించాల్సి వస్తుందోనంటూ ప్రభుత్వం ఆరా దీస్తున్నది. ఏది ఏమైనా 2017-18 ఆర్ధిక సంవత్సరంలో మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయానికి భారీగానే గండి పడుతుందంటూ ఎక్సైజ్, ఆర్థికశాఖల ఉన్నతాధికారులు ఇప్పటి నుంచే బెంబేలెత్తుతున్నారు. అవసరమైతే వచ్చే వార్షిక బడ్జెట్‌లో ఏమైనా మార్పులు చేయాల్సి వస్తుందేమోనని కూడా కసరత్తు చేస్తున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 4వేల 300 మద్యం దుకాణాలు, 770 బార్ అండ్ రెస్టారెంట్లు వున్నాయి. వీటన్నింటి ద్వారా సాలీనా దాదాపు రూ.13వేల కోట్లు పైగా రాబడి లభిస్తున్నది. వాస్తవానికి ప్రభుత్వానికి వచ్చే రాబడిలో మొదటి నుంచి కూడా ఎక్సైజ్ శాఖ ప్రధాన ఆదాయ వనరుగా నిలుస్తున్నది. ఇప్పటివరకు జాతీయ రహదారులపై 100 మీటర్లలోపు మద్యం దుకాణాలకు అనుమతులు లేవు. ఇతర ప్రధాన రహదారులపై 100 మీటర్లలోపే లైసెన్స్‌లు ఇస్తూ గ్రామాల్లో అయితే గ్రామకంఠాల పరిధిలో అదే పట్టణాలు, నగరాల్లో మున్సిపల్ లిమిట్స్ పేరిట యథేచ్ఛగా అనుమతులిస్తున్నారు. ఉదాహరణకు విజయవాడ బెంజిసర్కిల్ నుంచి మచిలీపట్నం వరకు ప్రధాన రహదారిపై అలాగే విజయవాడ-జగ్గయ్యపేట జాతీయ రహదారిలో కంచికచర్ల, నందిగామ ప్రాంతాల్లోని ప్రధాన రహదారులపైనే లెక్కలేనన్ని మద్యం దుకాణాలున్నాయి. సుప్రీం ఆదేశాల మేరకు గ్రామకంఠాలు, మున్సిపల్ లిమిట్స్ అనే అడ్డంకులు లేకుండా అన్ని ప్రధాన రహదారులపై 500 మీటర్ల లోపునున్న మద్యం దుకాణాలన్నింటిని తొలగించాల్సి వుంది. ఈ ప్రకారం రాష్ట్రంలో 2వేల మద్యం దుకాణాలు, 400 బార్ అండ్ రెస్టారెంట్లను తొలగించాల్సి వుందని ఎక్సైజ్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కొత్త మద్యం పాలసీ పేరిట ఏడాదికాలంగా ప్రభుత్వం బార్ అండ్ రెస్టారెంట్లకు ప్రతి మూడు మాసాలకొకసారి లైసెన్స్‌లను పొడిగిస్తూ వచ్చింది. డిసెంబర్ మాసాంతంతో వీటి గడువు పూర్తి కానుండగా వచ్చే మార్చి వరకు పొడిగించే లైసెన్సులను షరతులపై జారీ చేయబోతున్నారు. ఇక మద్యం దుకాణాలకు రెండేళ్ల కాల పరిమితితో కూడిన లైసెన్స్ గడువు 2017 జూన్ మాసాంతం వరకు వున్నప్పటికీ మార్చి మాసాంతంకే కుదించి 500 మీటర్ల లోపు దుకాణాలను తొలగించాల్సి వుంది. వాస్తవానికి ప్రభుత్వం వచ్చే ఆరుమాసాల లైసెన్స్ ఫీజును ఆర్థిక సంక్షోభం పేరిట నూతన ఎక్సైజ్ పాలసీ బూచిని చూపి వసూలు చేయటం ప్రారంభించారు. సుప్రీం ఆదేశాల మేరకు తక్షణం 500 మీటర్లలోపునున్న మద్యం దుకాణాల బోర్డులను తొలగించాల్సి వుండగా ఎక్సైజ్ అధికారులు దీనిపై కసరత్తు చేస్తున్నారు.