ఆంధ్రప్రదేశ్‌

పెరుగుతున్న డీజిల్ ధరతో ఆర్టీసీపై పెనుభారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 17: మూలిగే నక్కపై తాడిపండు పడిన చందంగా రూ.500, రూ.1000 నోట్ల రద్దుతో కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఎపిఎస్‌ఆర్‌టిసికి దాదాపు రూ.50కోట్ల రూపాయలు పైగా నష్టం వచ్చింది. గత కొన్ని ఏళ్లుగా వెంటాడుతున్న నష్టం దాదాపు రూ.400 కోట్లపైనే వుంది. ఈ లోటును భర్తీ చేసేందుకు.. అలాగే ఇదే సమయంలో ప్రయాణీకులపై భారం పడకుండా గతంలో నండూరి సాంబశివరావు, తాజాగా ఎం.మాలకొండయ్య కొత్త సంస్కరణలు, ఆకర్షణలతో సంస్థను ముందుకు తీసుకుపోతుంటే నెలకోసారి పెరుగుతున్న డీజిల్ ధరలు సంస్థపై పెనుభారం మోపుతోంది. తాజాగా డీజిల్ లీటరు ధర రూ.61.20పైసల నుంచి రూ.63.26 పైసలకు పెరిగింది. అంటే ఒకేసారి రూ.2 రూపాయల 06 పైసలకు పెరిగింది. దీనివల్ల ఆర్‌టిసిపై సాలీనా మరో రూ.60కోట్లు అదనపు భారం పడుతుంది.
రాష్ట్రంలో 2100 అద్దె బస్సులుండగా మొత్తం 12వేల బస్సులకు రోజూ కనీసం 7 లక్షల 70వేల లీటర్ల డీజిల్‌ను వినియోగించాల్సి వుంది. పెరిగిన రేటుతో పాటే రోజుకు కనీసం 16 లక్షలు చొప్పున నెలకు ఐదు కోట్లు, సంవత్సరానికి రూ.60 కోట్లు అదనపు భారం పడినట్లయింది. గత మూడు మాసాలుగా ఇప్పటికి ఆరుసార్లు డీజిల్ ధర పెరగటం వల్ల ఇప్పటికే సాలీనా రూ.200 కోట్లు పైగా భారం పడింది. అంటే కేవలం డీజిల్ రేటు పెంపు ఎప్పటి నుంచో వస్తోన్న నష్టానికి చేరువవుతుంటే ఇక ఈ భారాన్ని ప్రయాణికులపై మోపవలసిన పరిస్థితి కన్పిస్తోంది. కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డీజిల్ ధర పెంపు తన చేతిలో లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న వాణిజ్య పన్నుకు రాయితీనివ్వగల్గితే గుడ్డిలో మెల్లగా ఆర్టీసీపై కనీసం ఐదో వంతు భారం తగ్గుతుంది. అసలు పెట్రో ఉత్పత్తుల అమ్మకాలపై కేంద్రం 22.25 శాతం పన్ను అంటే పెట్రోల్‌పై లీటరుకు రూ.16లు, డీజిల్‌కు రూ.10.70లు వసూలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా ఏకంగా వ్యాట్ రూపేణా 4 శాతం పన్నును డీజిల్, పెట్రోలు బంక్‌లకు చేరకుండానే ముందుగా గుంజుకుంటున్నది. ఇక రాజధాని విజయవాడ నగరంలో వాహన యజమానులపై రోజుకు రూ.13 లక్షలు వరకు అదనపు భారం పడనుంది. నగరంలో 45 ఆయిల్ బంకులు ఉంటే వీటిలో సగటున 9వేల లీటర్ల డీజిల్, ఐదువేల లీటర్ల పెట్రోలు చొప్పున విక్రయం జరుగుతున్నది.

జగన్ మెప్పు కోసమే
పార్థసారథి విమర్శలు

విజయవాడ, డిసెంబర్ 17: ఆంధ్రప్రదేశ్ నీటి వనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రెక్కల కష్టంతో వచ్చిన పట్టిసీమ నీళ్లతో చేపల చెరువులు, పంటలు పండించుకుంటున్న పార్ధసారథికి దేవినేనిని విమర్శించే నైతిక అర్హత లేదని రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్మన్ పంచుమర్తి అనూరాధ తీవ్రంగా ధ్వజమెత్తారు. కేవలం జగన్ మెప్పుకోసమే పార్థసారధి ఆత్మవంచన చేసుకుని మాట్లాడుతున్నారని, పట్టిసీమను అడ్డుకున్న జగన్మోహన్‌రెడ్డికి వకాల్తాగా ఉండడానికి నీ అంతరాత్మ నిన్ను ప్రశ్నించలేదా? అమరావతి రాజధానిని వ్యతిరేకించిన జగన్మోహన్‌రెడ్డి పంచన చేరడానికి మీకు ద్రోహంగా లేదా? చంద్రబాబును చెప్పులతో కొట్టండి, రాళ్లతో కొట్టండి, చీపుర్లతో కొట్టండన్న జగన్మోహన్‌రెడ్డి హీనమైన వ్యాఖ్యలను పార్థసారధి సమర్ధిస్తూ దేవినేని ఉమామహేశ్వరరావుపై నోరు పారేసుకోవడానికి నీరు అర్హత లేదని వ్యాఖ్యానించారు. జగన్‌ను ఎన్టీఆర్ వైద్యసేవ - ఆరోగ్యశ్రీ పై బహిరంగ చర్చకు రమ్మని వైద్యశాఖ మంత్రులు ఆహ్వానిస్తే జగన్ పారిపోలేదా? వైఎస్ మేనిఫేస్టో, చంద్రబాబు నాయుడు హామీల అమలుపై బహిరంగ చర్చకు నారా లోకేష్ ఆహ్వానిస్తే జగన్ పారిపోలేదా? జగన్ పరపతి రోజురోజుకి దిగజారుతున్న సంగతి రాష్ట్రంలో ఏ పిల్లవాడిని అడిగినా చెబుతారని విమర్శించారు. కేవలం విమర్శించడానికే వారి నాయకుడు జగన్ లోటస్‌పాండ్ నుండి బయటకు వస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. ప్రజా సమస్యలు పట్టకుండా ఆయన పర్యటన అంతా పరామర్శలకే పరిమితమవుతున్న సంగతిని ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు. పార్థసారధి ఇలానే మాట్లాడితే కృష్ణా జిల్లావాసులు బుద్ధి చెబుతారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కాదు కదా రెండంకెల సీట్లు కూడా ఆ పార్టీకి రావని అనూరాధ జోస్యం చెప్పారు.

జగన్ జైల్లో ఉంటేనే
సమాజానికి క్షేమం

విజయవాడ క్రైం, డిసెంబర్ 17: పులులు, సింహాలు అడవిలో ఉండాలి.. జగన్ లాంటి వారు జైల్లో ఉంటేనే సమాజానికి క్షేమమని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. శనివారం జలవనరుల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెలకోసారి కుంభకుర్ణుడు నిద్ర వదిలి హైదరాబాద్‌లో బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టులో దిగుతారని, దిగిన తర్వాత కర్టన్‌రైజర్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబుని, టిడిపి జాతీయ కార్యాదర్శి లోకేష్‌ని తిట్టే కార్యక్రమం చేపడతారన్నారు. నిడమనూరులో కొత్తకారు కాకుండా పాత కారును తగులబెట్టిన దుండగులను పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి దోషులను పట్టుకుంటామన్నారు. ఇలాంటి ఫ్యాక్షన్ చర్యలు జగన్ గన్నవరం పర్యటనకు ముందు జిల్లాలో చోటు చేసుకుంటాయన్నారు. రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలలో జిల్లాలో చేయాలని చూస్తే తొక్కినార తీస్తామని జగన్ ఖబర్దార్ అని హెచ్చరించారు. పేదవాడి కారు తగుల బెట్టాల్సిన అవసరం మా ప్రమేయం లేదని, జగన్ వచ్చే ముందే ఇలాంటివి సంఘటనలు జరుగుతున్నాయని, కొత్త కారును వదిలి పాత కారును తగులబెట్టడం విచిత్రంగా ఉందని తెలిపారు. 11 సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసుల కింద ఇప్పటికే రూ. 40వేల కోట్లు జప్తు చేశారని, అలాంటి వ్యక్తి మా ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరన్నారు. దండుకున్న డబ్బులతో బెంగుళూరులో వైట్ హౌస్, హైదరాబాద్‌లో లోటస్‌పాండ్‌ను నిర్మించారన్నారు. అమరావతి రాజధానికి ఒక ఇటుకను కూడా ఇవ్వని జగన్ నీతులు చెపుతున్నారని, త్వరలో వెలగపూడిలో అసెంబ్లీ భవనాలు నిర్మాణం పూర్తయి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని ఆ సమావేశాలకు ఏ మోహం పెట్టుకుని హాజరవుతారని ప్రశ్నించారు.
ఎబివిపి కార్యవర్గం ఎన్నిక

విజయవాడ, డిసెంబర్ 17: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడుగా మాలపాటి తిరుమలరెడ్డి, కార్యదర్శిగా మన్నూరు మల్లికార్జున 2016-17 సంవత్సరానికి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి అంజనీ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. నూతనంగా ఎన్నికైన వీరు ఈ నెల 23 నుండి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగే 62వ జాతీయ మహాసభల్లో బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు. ఎబివిపి అధ్యక్షుడుగా ఎన్నికైన తిరుమలరెడ్డి అనంతపురం నగరంలో ఎంఏ, బి.ఇడి పూర్తిచేసి టీచరుగా పనిచేస్తున్నారు. ఈయన గతంలో ఎబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా, విభాగ్ కార్యాలయ కార్యదర్శిగా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన మల్లికార్జున ఎం.టెక్ పూర్తిచేసి కళాశాల అధ్యక్షునిగా, నగర కార్యదర్శిగా, భాగ్ కన్వీనర్‌గా, జిల్లా కన్వీనర్‌గా, రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.
21, 22 తేదీల్లో కలెక్టర్ల సదస్సు
విజయవాడ, డిసెంబర్ 17: ఈ నెల 21, 22 తేదీల్లో నగరంలో ఎవెన్యూ కనె్వన్షన్ సెంటర్‌లో సిఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరుగనుంది. ఇందుకు సంబంధించి కలెక్టర్ బాబు ఎ శనివారం వివిధ శాఖల అధికారులతో సమామేశమై ఏర్పాట్లు సమీక్షించారు.
కాపు విద్యార్థులకు కార్పొరేషన్ అండ
విజయవాడ (పటమట) డిసెంబర్ 17: గ్రూపు1, 2, 4 ఉద్యోగాలు సాధించాలనుకునే కాపు విద్యార్థులకు కాపు కార్పొరేషన్ కొండంత అండగా నిలుస్తుందని రాష్ట్ర కాపుకార్పొరేషన్ చైర్మన్ చెలమలశెట్టి రామానుజయ అన్నారు. విజయవాడలో శనివారం ఉదయం విద్యోన్నతి పథకం ద్వారా కాపు విద్యార్థులకు ఎపిపిఎస్‌సి గ్రూపు1, 2, 4 పరీక్షలకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు సర్ట్ఫికెట్స్ పరిశీలన జరిగింది. గ్రూపు-1లో 1800 మంది విద్యార్థులకు, అలాగే గ్రూపు-2లో 1800 మంది విద్యార్థులకు, గ్రూపు-4లో 2500 మంది విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వటం జరుగుతుందన్నారు. ఒకొక్క విద్యార్థికి కోచింగ్ నిమిత్తం 50 వేల నుండి 70 వేల వరకు ఖర్చు అవుతుందని, ఆ ఖర్చును కాపు కార్పొరేషన్ భరిస్తుందన్నారు. శిక్షణ సమయంలో ఒక్కొక్క విద్యార్థికి 8వేల రూపాయల ఉపకార వేతనం కూడా అందజేస్తామని రామానుజయ పేర్కొన్నారు.
ఇన్నాళ్లకు నోట్లు గుర్తొచ్చాయా?

విజయవాడ, డిసెంబర్ 17: 39 రోజుల తరువాత బయటకు వచ్చిన జగన్మోహనరెడ్డి గవర్నర్‌ని కలవటం చూస్తుంటే దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగిన చందంగా వుందని పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. గవర్నర్ దగ్గరికి వెళ్తున్నది కేవలం ప్రజల సమస్యపైనా? లేకపోతే మీకు పాత నోట్లు మార్చుకోవడంలో కలుగుతున్న అసౌకర్యాన్ని గవర్నర్‌కు చెప్పడానికి వెళ్తారా అని ప్రశ్నించారు. ఇటువంటి నాయకుడి దగ్గర పనిచేస్తూ చంద్రబాబుని విమర్శించే అర్హత తమ్మినేని సీతారామ్‌కు లేదన్నారు. ఆర్బీఐతో చంద్రబాబు ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేస్తూ, అధికారులకు సూచనలిస్తూ ఈరోజు వరకు రాష్ట్రానికి 19,361 కోట్ల రూపాయల నగదును రాష్ట్రానికి రప్పించారు. ఈ చర్యలన్నీ ప్రతిపక్ష నాయకులకు అర్థం కావడం లేదా? అని అనిత ప్రశ్నించారు.

శీతాకాల
సమావేశాలు లేనట్లే

అమరావతి, డిసెంబర్ 17: ఆంధ్రప్రదేశ్ శీతాకాల సమావేశాలు దాదాపు లేనట్టే. వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో నిర్మిస్తున్న అసెంబ్లీ, శాసనమండలి భవనాలు డిసెంబర్ చివరినాటికీ పూర్తయ్యే అవకాశం లేకపోవడం అందుకు ఒక కారణమంటున్నారు. హైదరాబాద్‌లో శాసనసభ సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నప్పటికీ, గత సమావేశాల్లో ఇక హైదరాబాద్‌లో ఇదే చివరి సమావేశాలని చెబుతూ, ఆ సభతో తనకున్న అనుబంధాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుర్తు చేసుకున్న విషయం తెలిసిందే. అప్పుడు ఇక ఇదే చివరి సమావేశాలని చెప్పి, ఇప్పుడు మళ్లీ అక్కడ సమావేశాలు నిర్వహిస్తే, ప్రతిపక్షం దానిని కూడా రాజకీయంగా విమర్శించే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం, శీతాకాల సమావేశాలు నిర్వహించకపోయినా నష్టమేమీలేదని భావిస్తోంది. నిజానికి ఈ ఏడాదిలోగా జీఎస్టీ బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా దానికోసమే శీతాకాల సమావేశాలు నిర్వహించింది. అయితే, పార్లమెంటు సమావేశాల్లోనూ జీఎస్టీ బిల్లు ప్రస్తావన లేకపోవడం, మరో మూడు నెలల వరకూ గడువు ఉండటంతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లోనే ఆ బిల్లును ఆమోదించుకునే వెసులుబాటు ఉన్నట్లు గ్రహించింది. సాంకేతికంగా అందివచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకే శీతాకాల సమావేశాలు నిర్వహించకపోయినా ఇబ్బందిలేదన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.