ఆంధ్రప్రదేశ్‌

కులాలపై జ‘గన్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, డిసెంబర్ 18: అధికారమే లక్ష్యంగా అడుగులేస్తున్న వైసీపీ అధినేత జగన్ లక్ష్యసాధన కోసం తన పంథా మార్చుకుంటున్నారు. గతంలో తనను, వైఎస్‌ను చూసి జనం ఓట్లేస్తారన్న భ్రమల నుంచి ఇప్పుడు వాస్తవ ప్రపంచంలోకి వస్తున్నట్లు ఆయన వ్యవహారశైలి స్పష్టం చేస్తోంది. ముందుగా తనపై ఉన్న క్రైస్తవ ముద్రను చెరిపేసుకునేందుకు ఆయన ఇటీవలి కాలంలో ఎక్కువగా హిందూ ఆలయాలు, పీఠాలకు వెళ్లి స్వాముల ఆశీస్సులు తీసుకుంటున్నారు. పార్టీలోని కొందరు ప్రముఖులు ఆయనకు నచ్చచెప్పడం వల్ల, జగన్‌లో ఈ మార్పు వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవలి కాలంలో తన సభలకు వేలాదిగా జనాలు తరలిరావడం, పార్టీ ప్రతిపక్షంలో ఉంటూ నేతలపై కేసులు నమోదవుతున్న సమయంలోనూ, స్థానిక సంస్థల నేతలు అధికారంలో ఉన్న తెదేపాకు రాజీనామా చేసి తన పార్టీలో చేరుతుండటం, తనను వ్యతిరేకించే ఒక వర్గ మీడియా కూడా ఇటీవలి కాలంలో తనకు ప్రాధాన్యం ఇవ్వడం జగన్‌లో ఉత్సాహం పెరగడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. తెదేపాకు మద్దతుదారుగా ఉన్న మీడియా సైతం బాబుతో సమానంగా జగన్‌కు ప్రాధాన్యం ఇవ్వడం నేతలను ఆశ్చర్యపరుస్తోంది.
తమ పార్టీకి ఆదరణ పెరుగుతుందని గ్రహించినందుకే ముందుజాగ్రత్తగా ఆ వర్గ మీడియా వైఖరి మారిందని పార్టీ నేతలు విశే్లషిస్తున్నారు. జిల్లాల వారీగా నియోజకవర్గాల స్థాయిలో ఇతర పార్టీల నేతల ప్రాధాన్యం గుర్తించి, వారిని పార్టీలో తీసుకువచ్చే ప్రణాళికలకు జగన్ పదునుపెడుతున్నారు. ప్రధానంగా తెదేపాలో ఇక తమకు అవకాశం రాదని నిర్ణయించుకున్న వారిపై కనే్నశారు. వారి అసంతృప్తిని సొమ్ము చేసుకునేందుకు జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటుచేశారు. ఒక నేత చేరిక వల్ల ఒకటి రెండు నియోజకవర్గాల్లో ప్రభావం ఉంటుందని భావిస్తే,అలాంటి వారిపై కనే్నస్తున్నారు.
ఈ విషయంలో జగన్ జిల్లాల్లో ఉన్న కులాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన వ్యూహం స్పష్టం చేస్తోంది. తాజాగా గుంటూరు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గంలో, మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి తనయుడు కాసు మహేష్‌రెడ్డిని తీసుకోవడం ఇందులో భాగంగానే కనిపిస్తోంది. నర్సరావుపేట ఎంపిగా రెండుసార్లు పనిచేసిన కృష్ణారెడ్డికి, కాసు కుటుంబానికి పల్నాడు రెడ్లపై పట్టుంది. అయితే కాసే కాంగ్రెస్-కాంగ్రెసే కాసు అని చెప్పుకునే కృష్ణారెడ్డి కుటుంబం ఇప్పుడు పార్టీ మారింది.
దానివల్ల పల్నాడు ప్రాంతంలో రెడ్లను మరింత ఎక్కువగా ఆకట్టుకోవచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా గురజాల నియోజకవర్గంలో రెడ్ల ప్రాబల్యం ఉన్నా, కొన్ని దశాబ్దాల వరకూ అక్కడ రెడ్డి నేత లేకుండా పోయారు. ఇప్పుడు కాసు మహేష్‌రెడ్డి చేరినందున ఆ లోటు భర్తీ చేయడంలో జగన్ విజయం సాధించారు.
అయితే, ఇక్కడ తెదేపా ఎమ్మెల్యే ఆర్ధికంగా బలంగా ఉండటమే కాకుండా, జిల్లా పోలీసు యంత్రాంగం అంతా ఆయన కనుసన్నల్లో ఉందన్న ప్రచారం నేపథ్యంలో, మహేష్ చాలా శ్రమించాల్సి ఉంటుంది. అయితే, కాసు చేరిక సందర్భంగా నర్సరావుపేటలో జరిగిన సమకరణకు తెదేపాకు చెందిన కమ్మవర్గ ప్రముఖులు కూడా ఆర్ధికంగా సహకరించడం వైకాపానేతలను ఆశ్చర్యపరిచింది.
ఇక రాజధాని నగరమైన విజయవాడలో వైశ్య వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ను,బిజెపి నుంచి వ్యూహాత్మకంగా వైసీపీలో చేర్చుకోవడం ద్వారా వైశ్యవర్గానికి చేరువయ్యే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. తూర్పు గోదావరిలో పట్టున్న మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌ను కూడా పార్టీలో చేర్చుకున్నారు.
ప్రకాశం జిల్లా అద్దంకిలో రాజకీయ వ్యూహరచయితగా పేరున్న కమ్మ సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బాచిన గరటయ్యను పార్టీలోకి తీసుకోవడంతోపాటు, ఆయనకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడం ద్వారా కమ్మ వర్గానికి చేరువ కావాలన్నది జగన్ లక్ష్యం. ప్రకాశం జిల్లాలోని ఐదారు నియోజకవర్గాల్లో గరటయ్య ప్రభావం ఉంది. అక్కడ తెదేపాలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవి-కరణం బలరాం మధ్య జరుగుతున్న వర్గపోరు,అదే సామాజికవర్గానికి చెందిన గరటయ్యకు అనుకూలిస్తుందని జగన్ అంచనాగా కనిపిస్తోంది.
ఇక విజయవాడలో కాపువర్గానికి పార్లమెంటు, బందరు పార్లమెంటు పగ్గాలు బీసీలకు ఇవ్వడం ద్వారా రెండు పెద్ద కులాలకు చేరువకావచ్చని యోచిస్తున్నారు. ఇప్పటికే యాదవ వర్గానికి చెందిన మాజీ మంత్రి పార్ధసారథి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ సందర్భంగా జగన్ వ్యవహారశైలిలోనూ మార్పులు వస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. కొత్తనేతలను వ్యతిరేకించవద్దని, అధికారం వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తానని భరోసా ఇస్తున్నారు. పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి, వచ్చిన తర్వాత ఏమి ఇస్తామన్నది బహిరంగసభలపైనే చెప్పడం ద్వారా నమ్మకం పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
గురజాలకు కాసును ఇన్చార్జిగా సభలోనే ప్రకటించిన జగన్, అదేవేదికపై తాను సీఎం అయిన తర్వాత ఇప్పటివరకూ అక్కడ ఇన్చార్జిగా ఉన్న జంగాకృష్ణమూర్తికి ఎమ్మెల్సీ ఇస్తామని ప్రకటించారు. దీనితో తనపై విశ్వసనీయత పెరుగుతుందన్నది జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. అదే సమయంలో కాసు వల్ల నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డికి రాజకీయ అభద్రత ఉండదని వేదికపైనే ప్రకటించడం బట్టి, తన పార్టీలో చేరేవారికి భరోసా కల్పించడంతోపాటు, రాజకీయపరమైన అభద్రత ఉండదన్న సంకేతాలిచ్చారు.
కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్లను పార్టీలోకి తీసుకురావటం ద్వారా, భవిష్యత్తు పోరును రెండు పార్టీలకే పరిమితం చేయాలన్న లక్ష్యంతో అడుగులేస్తున్నారు. అయితే, జగన్ వద్ద పనిచేసేందుకు కొందరు కాంగ్రెస్ సీనియర్లు వెనుకంజ వేస్తున్నప్పటికీ, వారి వారసులను వైసీపీలో చేర్పించేందుకు మాత్రం ఉత్సాహం చూపిస్తున్నారు. తాజాగా కాసు కృష్ణారెడ్డి కూడా తాను చేరకుండా తనయుడిని పంపించారు. చాలామంది సీనియర్లు ఇదే విధానం పాటించాలని భావిస్తున్నందున, వారిని పార్టీలో చేర్చుకోవాలని యోచిస్తున్నారు.