ఆంధ్రప్రదేశ్‌

వాజపేయికి సిఎం జన్మదిన శుభాకాంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 25: మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయికి ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దేశం గర్వించదగిన మహాదార్శనికుడు, పరిపాలనాదక్షుడు అటల్ బిహారీ వాజపేయి అని ప్రశంసించారు. వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలోనే తాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సైబరాబాద్‌ను నిర్మించి, ప్రపంచ ఐటి రంగ చిత్రపటంలో హైదరాబాద్ పేరును చిరస్థాయిగా నిలిచే విధంగా తీర్చిదిద్దానన్నారు. స్వర్ణ చతుర్భుజి సహా వౌలిక రంగ అభివృద్ధికి వాజ్‌పేయి కాలంలో విశేష కృషి జరిగిందన్నారు. మంగళగిరి దగ్గర ఎయిమ్స్‌కు అటల్ బిహారీ వాజపేయి పేరు పెట్టాలని ముందుగా తాను సూచించానన్నారు.
శతాధిక వృద్ధుడి మృతి
తెర్లాం, డిసెంబర్ 25: విజయనగరం జిల్లా, తెర్లాం మండలం పాములవలస గ్రామానికి చెందిన శతాధిక వృద్ధుడు పెదిరెడ్ల దాలినాయుడు(115) మృతిచెందాడు. ఈయన రెండురోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం మృతిచెందినట్టు కుటుంబీకులు తెలిపారు. దాలినాయుడికి నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. 10మంది మనవులు, 15మంది ముని మనవళ్లు ఉన్నారని కుటుంబీకులు పేర్కొన్నారు. ఇంతవరకు ఆరోగ్యంగానే ఉండేవారని, రెండురోజులుగా అస్వస్థకు గురయ్యారన్నారు.
బాబు చేతికి
పోలవరం నిధులు
తొలి విడత రుణాన్ని
నేడు అందించనున్న ఉమాభారతి

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ఢిల్లీలో పర్యటించనున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చెయ్యడానికి నాబార్డు తొలి విడత రుణాన్ని చంద్రబాబుకు కేంద్ర జలవనరుల శాఖ ఉమాభారతి అందజేయనున్నారు. ఢిల్లీ ఇండియా హెబిటెట్ సెంటర్‌లో జరగనున్నా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రమంత్రులు ఉమాభారతి, వెంకయ్య నాయుడు, జలవనరుల శాఖ, నాబార్డు అధికారులు పాల్గొంటారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నాబార్డు నుంచి రూ. 1981.54 కోట్ల రుణం విడుదల చేయాలని కేంద్రం ఆదేశం జారీ చేసింది తెలిసిందే. జలవనరులశాఖకు సంబంధించిన కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల సాగునీటి పథకాలకు కేంద్ర సాయాన్ని అందచేస్తామని, ఇందులో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అందించే సాయం కూడా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉమాభారతి లేఖ రాసిన విషయం తెలిసిందే.
నగదు మార్పిడి ముఠా అరెస్టు
వాహనంతో పాటు రూ. 7లక్షలు స్వాధీనం
రేణిగుంట, డిసెంబర్ 25: చిత్తూరు జిల్లా గాజులమండ్యం పోలీస్‌స్టేషన్ పరిధిలో మోసాలకు పాల్పడుతున్న గుంటూరు జిల్లా స్టూవర్టుపురానికి చెందిన నగదు మార్పిడి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి వాహనంతోపాటు రూ.7 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం గాజులమండ్యం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో డిఎస్పీ నంజుండప్ప మాట్లాడుతూ స్టూవర్టుపురం పరిసర ప్రాంతాలకు చెందిన 11 మంది సభ్యులు ముఠా మోసాలకు పాల్పడుతోందన్నారు. ఈ ముఠా తిరుపతికి చెందిన దిలీప్, శ్రీకాంత్‌ల వద్ద రూ.10 లక్షల కొత్త నోట్ల మార్పిడికి 30 శాతం కమీషన్ కింద డీల్ కుదుర్చుకుందన్నారు. పథకం ప్రకారం తిరుపతి అయితే అన్ని కూడళ్లలో సిసి కెమేరాలు ఉంటాయని, అందరూ దొరికిపోతామని నమ్మబలికి రేణిగుంట ఎల్లమ్మగుడి వద్దకు రావాలని తెలపడంతో ద్విచక్ర వాహనంపై తిరుపతికి చెందిన దిలీప్, శ్రీకాంత్ కొత్త రూ 2వేల నోట్లతో అనుకున్న ప్రదేశానికి చేరుకున్నట్లు చెప్పారు. అప్పటికే అక్కడకు చేరుకున్న కొంతమంది ముఠా సభ్యులతో నగదు మార్పిడి లావాదేవీలలో పర్సంటేజ్‌ల గురించి చర్చించుకుంటుండగా ముందుగా అనుకున్న పథకం ప్రకారం ముఠా సభ్యులు కొంతమంది తవేరా వాహనంలో వేగంగా పోలీసుల్లా వచ్చి వాహనం నుంచి దిగి దాడిచేసి వారి వద్ద ఉన్న రూ.7 లక్షల నగదు, మెడలోని బంగారు గొలుసును లాక్కున్నారు.
అక్కడ ఉన్నవారంతా తేరుకుని తలోదిక్కుకు పరుగులు తీశారు. పారిపోయే ప్రయత్నంలో దిలీప్, శ్రీకాంత్‌కు అనుమానం వచ్చి వెనుతిరిగి చూడగా పోలీసులుగా వచ్చిన వారు డీల్ కుదుర్చుకున్న వ్యక్తులు కలిసిపోయి వచ్చిన అదే వాహనంలో పారిపోతుండగా డబ్బులు పోగొట్టుకున్న బాధితులు వారిపై దాడిచేసి వాహనం ముందు అద్దాలను పగులగొట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. అయితే ముఠాసభ్యులు చాకచక్యంగా వారిని తప్పించుకొని వాహనంతో పాటు పరారవుతుండగా తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులకు ఇద్దరు వ్యక్తులు పట్టుబడినట్లు తెలిపారు. వారిచ్చిన సమాచారం మేరకు మరో ఏడుగురిని అరెస్టు చేశామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు ఆయన తెలిపారు.
అన్నదాతకు అందని సహకారం
నోట్ల రద్దుతో చేరుకోని డిసిసి బ్యాంకుల లక్ష్యాలు * సబ్సిడీలు, రుణమాఫీలకు బ్రేక్?

విశాఖపట్నం, డిసెంబర్ 25: నోట్ల రద్దు ప్రభావం కేంద్ర సహకార బ్యాంకుల వ్యాపార లావాదేవీలపై తీవ్రంగా చూపుతోంది. వ్యాపార లక్ష్యాలు ఏలాగూ నెరవేరడంలేదు. చివరకు రైతులకు ప్రభుత్వం తరపున కల్పించే సబ్సిడీ పథకాలు, రుణమాఫీ, ఇతర రుణాలు తదితర వాటికి బ్రేక్ పడింది. దీంతో రైతాంగం అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది. గత నెల మొదటి వారంలో కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో వారం రోజుల వ్యవధిలోనే కేంద్ర సహకార బ్యాంకులకు వీటిని స్వీకరించరాదంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో పాత నోట్ల స్వీకరణ పూర్తిగా నిలిచిపోయింది. దీనివల్ల రైతు సభ్యులకు బ్యాంకులకు పాత రుణాలను చెల్లించడంలో సమస్యలు తలెత్తుతున్నాయి. మరోపక్క వీరి వద్ద కొద్దిపాటి సొమ్మును డిపాజిట్ చేయడానికి వీలు లేకుండా పోయింది. పాత నోట్ల స్వీకరణతోపాటు డిపాజిట్లకు ఎటువంటి అనుమతులివ్వని కేంద్రం ఆదేశాలతో జిల్లాకేంద్ర సహకార బ్యాంకు(డిసిసిబి) యాజమాన్యాలు అయోమయంలో పడ్డాయి. వ్యాపార లక్ష్యాలు సాధించలేని పరిస్థితులకు చేరుకున్న బ్యాంకు పాలకవర్గాలు, ఉన్నతాధికారులకు నోట్ల రద్దు కారణంగా చేతినిండా పనిలేకుండా పోయింది. తెల్లారేసరికి రైతుల కష్టాలు వినడానికే సరిపోతుంది. చేసేదిలేక ఇపుడు మండల కేంద్రాలు, గ్రామీణ పరిధిలో ఉండే సొసైటీల్లో రైతు సభ్యులకు అవగాహన కల్పించడంలో నిమగ్నమవుతున్నారు.
కేంద్రం ఆదేశాలతో రైతులకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయయడం నిలిచిపోగా, పాత నోట్ల డిపాజిట్లు, స్వీకరణకు పూర్తిగా బ్రేక్ పడింది. దీనివల్ల సహకార బ్యాంకులు తీవ్రంగా నష్టపోతున్నాయి. చివరకు రైతుల రుణమాఫీ సైతం అమలకు నోచుకోవడంలేదు. నోట్ల స్వీకరణ, డిపాజిట్లకు అనుమతుల్లేకపోవడంతో రాష్ట్రంలో ఉన్న డిసిసి బ్యాంకులు వ్యాపార లావాదేవీలు నిలిచి, కోట్లాది రూపాయల మేర నష్టాపోవాల్సి వస్తుంది. మరోవైపు రైతుల రుణమాఫీ వర్తింపుచేయక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నోట్ల రద్దుతో రెండు మాసాలుగా రైతుల నుంచి రావాల్సిన బకాయిలు నిలిచిపోయాయయి. ఈ విధంగా రైతుల ప్రయోజనాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తిలోదకాలిస్తుండగా, బ్యాంకుల వ్యాపార లావాదేవీలు జరగని కారణంగా కనీస లక్ష్యాలు సాధించలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాలకు సంబంధించిన 13 డిసిసి బ్యాంకుల పరిధిలో 13లక్షలకు పైగానే రైతు సభ్యులు ఉన్నారు. ఒక్క విశాఖ జిల్లాలోనే 96 ప్రాథమిక వ్యవసాయ పరిపతి సంఘాలు (పిఏసిఎస్)లు నడుస్తున్నాయి. ఈ విధంగా ప్రతిఒక్క జిల్లాలోను 90 నుంచి 100 సొసైటీలుండగా వీటన్నింటికీ సంబంధించి దాదాపు రెండు వేల కోట్ల మర వ్యాపారం జరుగుతుంది. డిపాజిట్లు, బంగారంపై వడ్డీలు, రైతు సభ్యుల నుంచి రుణ బకాయిల వసూళ్ళ రూపంలో ఇవన్నీ విస్తుంటాయి. రైతులకు ప్రతి ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో దీర్ఘకాలక, స్వల్పకాలిక రుణాలు ప్రభుత్వం మంజూరు చేస్తుంటుంది. ఈ విధంగా మంజూరైన రుణాలను కాలవ్యవధిలో డిసిసి బ్యాంకు శాఖకులకు సంబంధిత రైతు సభ్యులు చెల్లించాలి. అయితే, గత నెల మొదటి వారంలో కేంద్రం ప్రవేశపెట్టిన పెద్ద నోట్ల రద్దుతో సహకార బ్యాంకులకు ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించే అవకాశం లేకుండా పోయింది.
నవంబర్, డిసెంబర్ మాసాల్లో రైతుల నుంచి రావాల్సిన బకాయిలకు బ్రేక్ పడింది. వచ్చే ఏడాది మార్చి నెలాఖరికి బకాయిలు నూరు శాతం వసూలు కావాల్సి ఉండగా ఇంతవరకు కనీస స్థాయిక్కూడా లక్ష్యాలు సాధించలేకపోయామంటూ బ్యాంకు అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లాలోను ఇదే పరిస్థితి. దీనిపై ఇటీవల బ్యాంకు ఉద్యోగుల సంఘాలు నిరసన కార్యక్రమాలు నిర్వహించినా ఫలితం లేకపోయింది.
కార్పొరేట్ బ్యాంకు, వాణిజ్య బ్యాంకులకు దీటుగా వ్యాపార లక్ష్యాలు సాధిస్తూ ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలకు నోట్ల రద్దు కాస్త బ్రేక్ వేసింది. దీని నుంచి ఎప్పటికి కోలుకుంటామంటూ బ్యాంకు యాజమాన్యాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.

సాంకేతికత
కుప్పకూలుతుంది
* 2018 వరకూ నోట్ల కష్టాలు తప్పవు
* వౌన అమావాస్య పాటించండి
* జ్యోతిషవేత్త శ్రీనివాస గార్గేయ

విశాఖపట్నం, డిసెంబర్ 25: భవిష్యత్‌లో సాంకేతికత కుప్పకూలే ప్రమాదం ఉందని, పూర్వ పద్ధతిలో చేతిరాత రికార్డులే మేలైన విధానమని జ్యోతిష వేత్త శ్రీనివాస గార్గేయ అభిప్రాయపడ్డారు. సిఎం చంద్రబాబుకు వ్యక్తిగత జ్యోతిష్యునిగా పేరొందిన శ్రీనివాస గార్గేయ విశాఖ నగరంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. 2020 నాటికి సాంకేతికలో చోటుచేసుకునే పరిణామాలు ప్రజలకు తీరని చేటుచేస్తాయని పేర్కొన్నారు. డిజిటలైజేషన్ విధానానికి ప్రస్తుతం ఇస్తున్న ఏనలేని ప్రాధాన్యం భవిష్యత్‌లో కుప్పకూలుతుందన్నారు. ఒకప్పుడు అనుసరించిన చేతిరాత రికార్డుల విధానమే మేలని, ఈ విధానాన్ని అనుసరించడం మేలని పేర్కొన్నారు. కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంపై శ్రీనివాస గార్గేయ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నోట్ల రద్దుతో ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కేవలం 5 శాతం మాత్రమేనని, భవిష్యత్‌లో మరిన్ని కష్టాలు ఎదుర్కొనక తప్పదని జోస్యం చెప్పారు. నోట్ల రద్దు దేశాన్ని ఆర్థిక సంక్షోభం దిశగా తీసుకువెళ్తుందని, ఇంకా అనేక సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తుందన్నారు. నోట్ల రద్దు అవస్థలు మరో ఏడాదిన్నర కాలం తప్పవని పేర్కొన్నారు. నోట్ల రద్దు అనంతరం తలెత్తిన పరిస్థితులు 2018 జూన్ 29 వరకూ కొనసాగుతాయని, అప్పటికి కానీ యాథాస్థితికి వచ్చే అవకాశం లేదన్నారు. అయితే, నోట్ల రద్దు వల్ల కేంద్ర ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. కాలమే ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపుతుందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అధికారం విషయంలో చేప్పేదేమీ లేదన్నారు. వచ్చే ఏడాది జనవరిలో వచ్చే అమావాస్య రోజున ప్రజలంతా వౌనం పాటించాలని సూచించారు. ఖగోల పరిస్థితుల దృష్ట్యా ఆ రోజును వౌన అమావాస్యగా పాటించాలని సూచించారు.
రోజంతా వౌనంగా ఉండటం సాధ్యం కాని పక్షంలో కనీసం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ వౌనంగా ఉండటం శ్రేయస్కరమని అన్నారు. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, పురాణాలు, ఇతిహాసాల్లో ఈ అంశం స్పష్టంగా ఉందన్నారు. అనంతరం వైజాగ్ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో జ్యోతిష్య వేత్త శ్రీనివాస గార్గేయను ఘనంగా సత్కరించారు.
హత్యలు, అక్రమాలకు..
మారుపేరు జగన్
* చంద్రబాబును విమర్శించే అర్హత అతనికి లేదు
* గాలి ముద్దు కృష్ణమనాయుడు ఎదురుదాడి

కడప, డిసెంబర్ 25: హత్యలు చేయడం, చేయించడం ప్రతిపక్ష నాయకుడు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్సీ, శాసనమండలి అభివృద్ధి కమిటీ చైర్మన్ గాలిముద్దు కృష్ణమనాయుడు తీవ్రస్థాయిలో ఆరోపించారు. ఫ్యాక్షన్ హత్యలకు పాల్పడుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేసే వైఎస్ కుటుంబ సభ్యులు సిఎం చంద్రబాబు హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన కడప జిల్లా రాయచోటిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జగన్ కుటుంబ రాజకీయ చరిత్రను ఒకమారు తిరగేస్తే ఫ్యాక్షనిస్టులు, రౌడీయిజం చేసేది ఎవరనేది తెలుస్తుందన్నారు. రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాతే శాంతి భద్రతలు పూర్తిగా మెరుగుపడ్డాయన్నారు. ఫ్యాక్షనిజం, అసాంఘిక కార్యకలాపాలను అణచివేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందన్నారు. అయితే అధికార దాహంతో వైఎస్ కుటుంబం జిల్లాలో మొదలుకుని ఉమ్మడి రాజధాని వరకూ ఏమేమి చేశారో ప్రజలకు బాగా తెలుసు అన్నారు. దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా జగన్ అధికార దాహంతో మతిభ్రమించి ప్రవర్తిస్తున్నారని ఘాటుగా ఆరోపించారు. తండ్రి అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని లక్షల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించుకున్నారని ధ్వజమెత్తారు. అయితే పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో పిచ్చిపట్టి టిడిపి ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, జగన్‌కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు, తమ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి ఎన్.లోకేష్‌బాబు తీసుకొస్తున్న నూతన సంస్కరణలతో 2019 ఎన్నికల నాటికి రాష్ట్రంలో వైకాపా కనుమరుగవుతుందని జోస్యం చెప్పారు. ఆయనతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులురెడ్డి(వాసు), జిల్లా ప్రధానకార్యదర్శి హరిప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డి, రాయచోటి టిడిపి యువనేత ఎస్.ప్రసాద్‌బాబు(చిన్నరాయుడు), జిల్లా కార్యాలయ ఇన్‌చార్జి చింతల శివారెడ్డి ఉన్నారు.