ఆంధ్రప్రదేశ్‌

కొత్త సంవత్సరం.. సమస్యల రహితం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 26: నూతన సంవత్సరం సమస్యల రహితం కావాలని, పెద్దనోట్ల రద్దు సమస్య సహా అన్ని సవాళ్లను అధిగమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. సోమవారం తన నివాసం నుంచి నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ రెండు మూడు రోజుల్లో పూర్తిచేయాలని, వచ్చే నెల నుంచి పాత పద్ధతిలోనే లబ్ధిదారులకు అందించాలని అధికారులను ఆదేశించారు. రూ.334 కోట్లతో క్రిస్మస్, సంక్రాంతి కానుకలు ఇస్తున్నామని, ప్రతి కుటుంబంలో పండుగ సంతోషం కనిపించాలని ఆకాంక్షించారు. ప్రతి పేద కుటుంబానికి పండుగ సరకుల పంపిణీ వల్ల నగదు కొరత సమస్యను చాలావరకు అధిగమించవచ్చన్నారు. నగదు కొరత చింత తీరితే కొత్త సంవత్సరంలో అంతా సంతోషమేనన్నారు. కార్డు, ఫోను, కనీస నగదు దగ్గర ఉంచుకోవడమే సమస్యకు పరిష్కారంగా ఆయన చెప్పారు. ఆధార్‌తో బ్యాంకు ఖాతాను అనుసంధానం చేస్తే ఆధార్ యాప్ ద్వారా బయోమెట్రిక్ విధానంతో ఎవరైనా సులభంగా నగదు లావాదేవీలు జరుపుకోవచ్చన్నారు.
రెండురోజుల్లో 10వేల పోస్ మిషన్లు రాష్ట్రానికి రానున్నాయని, రాబోయే నెలలో లక్షా 50వేల పోస్ మిషన్లను తెప్పించనున్నట్లు తెలిపారు. చౌకడిపోలను బిజినెస్ ఫెసిలిటేటర్లుగా మార్చడంలో బ్యాంకర్లు చొరవ తీసుకోవాలన్నారు. ఎస్‌ఎల్‌బిసి కన్వీనర్ రంగనాథ్ మాట్లాడుతూ మొబైల్ లావాదేవీలు 13.82 శాతం నుంచి 16.62 శాతానికి పెరిగినట్లు చెప్పారు. జన్‌ధన్ ఖాతాలను కొత్తగా ప్రారంభించామని, అన్నింటినీ యాక్టివేట్ చేయనున్నట్లు తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ రాష్ట్రానికి ఎంత నగదు వచ్చిందీ, ఇంకెంత వస్తుందనేది ఆర్థిక, ప్రణాళిక శాఖల అధికారులు ఎప్పటికప్పుడు ఆర్బీఐతో, ఎస్‌ఎల్‌బిసితో సమన్వయం చేసుకోవాలన్నారు. పనిచేయని ఏటిఎంలన్నీ సక్రమంగా పనిచేసేలా చూడాలన్నారు. యూపిఐ, ఆధార్ యాప్‌లను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
జన్మభూమిని జయప్రదం చేయాలి
జన్మభూమి కార్యక్రమం విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. మరో ఆరురోజుల్లో ప్రజల్లోకి వెళ్తున్నామంటూ బ్యాంకర్లు, అధికారులు ప్రజామోదం పొందేలా పనిచేయాలన్నారు. రెవెన్యూ, ఆర్థిక, ప్రణాళిక, పౌరసరఫరాల శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు. పేదలకు పింఛన్లు, కానుకలు, రేషన్ సరకులు సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. అన్ని జిల్లాల్లో పెండింగ్ సమస్యలన్నీ త్వరితగతిన పరిష్కరించాలన్నారు. కరవు ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు, పశుగ్రాసం పంపిణీకి అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. గ్రామాలు, వార్డులను దత్తత తీసుకున్న భాగస్వాములు త్వరితగతిన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సంక్రాంతి సందర్భంగా గ్రామీణ క్రీడలు, గ్రామీణ కళారూపాలను ప్రోత్సహించాలన్నారు. విశాఖపట్నం నమూనాగా అన్ని ప్రాంతాల్లో ఇళ్లపట్టాల సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
రాబోయే మూడునెలల్లో అన్ని జిల్లాల్లో నాబార్డు పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తాము ప్రజాసేవకులమనేది అనుక్షణం గుర్తుంచుకుని పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు హితవు పలికారు. టెలికాన్ఫరెన్స్‌లో ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు, ఆర్థిక శాఖ కార్యదర్శి సునీత, ప్రణాళిక శాఖ అధికారులు సంజయ్ గుప్తా, శాంతిప్రియ పాండే, పౌరసరఫరాల శాఖ కమిషనర్ రాజశేఖర్, సిఎంవో సంయుక్త కార్యదర్శి రాజవౌళి, వివిధ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.