ఆంధ్రప్రదేశ్‌

అప్పుల ఊబిలోకి ఆర్టీసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 27: దక్షిణాసియాలోనే అతి పెద్ద ప్రభుత్వరంగ సంస్థ ఎపిఎస్‌ఆర్‌టిసి నేడు అప్పుల నుంచి బైటపడేందుకు మళ్లీ మళ్లీ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నది. ఒకటి.. రెండు కాదు మూడువేల కోట్ల రూపాయల లోటుతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఎన్ని కొత్త సంస్కరణలు.. పొదుపు చర్యలు పాటిస్తున్నప్పటికీ.. సాలీనా ఐదారు వందల కోట్ల రూపాయల నష్టాలను చవిచూడాల్సి వస్తున్నది.. అతి సామాన్యులకు సైతం అందుబాటులో వుండే ఈ సంస్థను సాధ్యమైనంతమేర భారాలు లేకుండా ముందుకు తీసుకెళ్లటానికి వివిధ బ్యాంక్‌ల నుంచి చేసిన అప్పులపై లాభాలు లేకపోయినా వడ్డీకిందనే సాలీనా రూ.250 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తుంటే ఈ అప్పులు తీరేదెన్నడో అంతుబట్టటం లేదు. దీనికితోడు నానాటికీ అసాధారణంగా పెరుగుతున్న డీజిల్ ధరలు పెనుభారంగా మారుతున్నాయి. రాష్ట్రంలో 2700 అద్దె బస్సులతో పాటు మొత్తం 12వేల 500 బస్సులు వుండగా రోజుకు కనీసం 7లక్షల 70వేల లీటర్ల డీజిల్‌ను వినియోగించాల్సి వుంది. గత ఏడాది కాలంలో దాదాపు ఎడెనిమిదిసార్లు డీజిల్ ధరలు పెరిగాయి. అంటే లీటరుకు దాదాపు రూ.9లు ధర పెరిగింది. దీనివల్ల రోజుకు 72లక్షల రూపాయలు చొప్పున నెలకు రూ.22 కోట్లు సాలీనా దాదాపు రూ.300 కోట్లు అదనపు భారం పడుతున్నది. ఇక సాలీనా టిక్కెట్ చార్జీలు.. ఇతరత్రా వ్యాపార లావాదేవీలపై మొత్తంగా వచ్చే ఆదాయం మూడువేల 150 కోట్లు మాత్రమే వుండగా ఖర్చు మూడువేల 700 కోట్ల రూపాయలు దాటుతున్నది. మొత్తం 57వేల మంది ఉద్యోగులు వున్నారు. ఇదిలా వుంటే ఏనాడో పదవీ విరమణ చేసిన కార్మికులు, ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తం రూ.110 కోట్లు పైగా ఉంది. ఆర్థిక సంక్షోభం వలనే ఈ చెల్లింపులు నిలచిపోయాయి. దీనిపై వారు ఆందోళన చేస్తున్నారు. తొలి దశలోనే ఈ ఏడాది దాదాపు రూ.80 కోట్లు వరకు రాబడి లభించింది. అయితే 2017 ఆగస్టు వరకు ఆర్‌టిసితో ఎఎన్‌ఎల్ సర్వీస్‌తో గతంలో జరిగిన ఒప్పందం అమల్లో వుండాల్సి రావటం వల్ల కూడా లగేజి పార్సిల్స్ రవాణా విషయంలో ఆర్‌టిసి యాజమాన్యం ఆచితూచి అడుగులేస్తున్నది. కాంట్రాక్ట్ క్యారేజిగా తిరగాల్సిన ప్రైవేట్ బస్సులు నియమ నిబంధనలకు విరుద్ధంగా ఆర్‌టిసికి ధీటుగా స్టేజి క్యారియర్‌గా యథేచ్ఛగా నడుస్తున్నాయి. ఒక్క విజయవాడ నగరం మీదుగానే అటు హైదరాబాద్, బెంగుళూరు ఇటు చెన్నై, ఇతర సుదూర ప్రాంతాలకు నిత్యం దాదాపు 300 ప్రైవేట్ బస్సులు పైన రాకపోకలు సాగిస్తున్నాయి. విజయవాడలో కొన్ని ప్రాంతాల్లో నిర్ణీత వేళలు మినహా ఇతర ప్రాంతాల్లో ఇళ్లు ఖాళీచేసే సమయంలో వస్తువుల తరలింపుకు మినీ లారీలను సైతం అనుమతించని పోలీసులు టాప్‌పై నాలుగైదు అడుగుల ఎత్తులో లగేజీతో నడిచే ప్రైవేట్ బస్సులకు మాత్రం రెడ్‌కార్పెట్ పరుస్తుండటం దారుణాతి దారుణం. పైగా ప్రధాన రహదారులే వీటికి పార్కింగ్ ప్రదేశాలు, మెకానిక్ షెడ్‌లు కావటం మరో విశేషం.
దుబారాకు చెక్: మాలకొండయ్య
ఎపిఎస్‌ఆర్‌టిసి ఏటేటా పీకల్లోతు నష్టాల్లోకి కూరుకుపోతుండటంపై ఆ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ ఎం.మాలకొండయ్య తీవ్రంగానే స్పందించారు. ఈ నష్టాలు ఈనాటివి కాకపోయినా సాధ్యమైన మేర దుబారా, ఇతర ఖర్చులు తగ్గిస్తూ ఎంతో కొంత రాబడి పెరిగేలా అనుక్షణం చర్యలు చేపడుతున్నామని ఆంధ్రభూమి ప్రతినిధితో అన్నారు. ఏటా రూ.600 కోట్లు పైగా నష్టాలు పెరుగుతుంటే ఇందులో గతంలో బ్యాంక్‌ల నుంచి తెచ్చే రుణాల కింద వడ్డీ రూపేణా కనీసం రూ.250 కోట్లు చెల్లించాల్సి వస్తున్నదన్నారు. ప్రస్తుతం పలు బ్యాంకుల్లో తక్కువ వడ్డీపై అప్పులు ఇస్తున్న నేపధ్యంలో వాటి నుంచి కొత్త అప్పులు చేసి పాత అప్పులను తీర్చి కొంతమేరైనా వడ్డీకి ఉపశమనం కల్గించాలని ఆలోచిస్తున్నామన్నారు. ప్రైవేట్ బస్సులు ఇతర వాహనాలపై అక్రమ రవాణా అదుపు తమ చేతుల్లో లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆర్థిక సంక్షోభం ఎలా వున్నప్పటికీ నిర్ణీత సమయాల్లో బస్సులు రాకపోకలు సాగించేలా అలాగే ప్రయాణికులకు మరిన్ని వౌలిక సదుపాయాలు కల్గించేలా చర్యలు చేపడుతున్నామన్నారు.