ఆంధ్రప్రదేశ్‌

నోట్లు ఉంటేనే నాట్లు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, డిసెంబర్ 29: గోదారి జిల్లాల్లో రబీ నాట్లకు నోట్ల దెబ్బ తగిలింది. చిల్లర నోట్లు ఉంటేనే పనుల్లోకి వస్తామని కూలీలు రైతులకు చెప్తుండటంతో దాదాపు సగం విస్తీర్ణంలో నాట్లు మందగించాయి. ప్రస్తుతం అత్యధికంగా రూ.2000 నోట్లు మాత్రమే చెలామణీలో ఉండగా, రూ.500 నోట్లు ఎవరికీ అందుబాటులో లేవు. దీనితో ఏదో విధంగా వంద నోట్లను సిద్ధం చేసుకున్న తర్వాతే నాట్లు వేసేందుకు కూలీలను పిలుచుకునే పరిస్థితి దాపురించింది. ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం 8.62 లక్షల ఎకరాల విస్తీర్ణానికి గాను ఇప్పటికి కేవలం మూడున్నర లక్షల ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే నాట్లు పడ్డాయి. తూర్పు గోదావరి జిల్లా కంటే పశ్చిమ గోదావరి జిల్లాలో కాస్తంత ఎక్కువ విస్తీర్ణంలో నాట్లు పడ్డాయి. కూలీ డబ్బులకు చిల్లర నోట్లు వుంటేనే పనుల్లోకి వస్తామని కచ్చితంగా కూలీలు అడిగి మరీ పనుల్లోకి వస్తున్నారని రైతులు వాపోతున్నారు. ధాన్యం అమ్మిన డబ్బు సైతం బ్యాంకుల్లోనే ఉండిపోవడం వల్ల పెట్టుబడులకు చేతిలో చిల్లిగవ్వ లేని విచిత్రమైన పరిస్థితిని గోదారి రైతులు చవిచూస్తున్నారు. నోట్లు వుంటేనే నాట్లు అన్నట్టుగా తయారైంది. చిల్లర నోట్లు ఎక్కడ నుంచి తెస్తామని చెప్పి విసిగిపోయిన రైతులు ఏకంగా పొలాల వైపే చూడని దుస్థితి దాపురించింది. ఇప్పటికే రబీ నాట్లు పూర్తి కావాల్సి వుంది. కానీ కనీసం 40 శాతం కూడా నాట్లు పడలేదని అంటున్నారు. బ్యాంకుల్లో నాలుగు వేలు మించి రాక, ఎన్ని రోజుల పాటు బ్యాంకుల్లో నిలబడి నగదు పోగు చేసుకోవాలో అర్ధం కాక రబీకి అవసరమైన పెట్టుబడుల నిమిత్తం నగదు సమకూరక అదను దాటిపోతోందని రైతుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. రైతులు, కౌలురైతులు పెట్టుబడులు లేక, మరో వైపు అప్పు పుట్టక బెంగపెట్టుకున్నారు. గోదావరి జిల్లాల్లో ఇటువంటి పరిస్థితి ఎపుడూ దాపురించలేదంటున్నారు. పెట్టుబడికి నగదు సమకూరక పిఠాపురం ప్రాంతంలో ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కూడా చోటు చేసుకుందంటే పరిస్థితి ఏ విధంగా వుందో అర్ధంచేసుకోవచ్చు. ఏభై రోజులుగా నోట్ల కష్టాలు వెండాడుతుండటంతో ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ప్రధాని మోదీ విధించిన 50 రోజుల గడువు పూర్తికావడంతో ఏం మార్పులు చోటుచేసుకుంటాయో అనే ఆసక్తి మాత్రం అందరిలోనూ నెలకొనివుంది. యాభై రోజులు ఓపిక పట్టమన్న మోదీ ఏమి సమాధానం చెప్తారో తెలియదని, సరిగ్గా శతదినోత్సవం అయిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు లక్షలాది మంది నవంబర్ పింఛన్లు అందుకోలేకపోయారు. మరో వైపు డిసెంబర్ పింఛను ఏ విధంగా ఇస్తారో కూడా తెలియని అయోమయం నెలకొంది.