ఆంధ్రప్రదేశ్‌

గొంతెండనున్న ‘అనంత’ గ్రామాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, జనవరి 1 : నిత్యం కరవు కోరల్లో చిక్కిశల్యమవుతున్న అనంతపురం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల గొంతెండిపోయే పరిస్థితులు ఏర్పడనున్నాయి. రానున్న వేసవి కాలంలో పూర్తిస్థాయిలో నీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం లేకపోలేదు. ప్రతి ఏటా తాగునీటి సరఫరా, ట్యాంకర్లు, వాహనాల ద్వారా నీటి రవాణాకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా వందలాది గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. గత ఏడాది ఆర్‌డబ్ల్యుఎస్ ద్వారా తాగునీటి రవాణకు చేసిన వ్యయంలో ఇప్పటికీ రూ.3 కోట్లు బకాయి ఉంది. పాత బకాయిలు చెల్లించడంతో పాటు కొత్తగా అవసరమైనన్ని నిధులు విడుదల చేస్తామని ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు హామీ ఇచ్చారు. తాగునీటి శాశ్వత పరిష్కారానికి రాష్ట్రానికి రూ. 4,500 కోట్లు ఇవ్వడానికి ప్రపంచ బ్యాంకు అంగీకరించిందని, ఇందులో ఒక్క అనంతపురం జిల్లాకే రూ. 985 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే పంచాయతీలకు కేంద్రం నుంచి మంజూరవుతున్న 14వ ఆర్థిక సంఘం నిధుల్లో తాగునీటికి అంత్యంత ప్రాధాన్యత ఇచ్చి 20 శాతం ఖర్చు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో గత ఏడాది అనుభవాలతో ఈ ఏడాది నిధులను తాగునీటికి సక్రమంగా ఖర్చు చేయాల్సి ఉంది. అయితే పంచాయతీలకు నేరుగా అందుతున్న 14వ ఆర్థిక సంఘం నిధులను సక్రమంగా వినియోగిస్తారా.. అనే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది రూ. 80 కోట్లు కేవలం తాగునీటి రవాణాకే ఖర్చు చేసినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో భారీగా నిధుల దుర్వినియోగం జరిగినట్లు తెలుస్తోంది. తాగునీటి రవాణాకు ట్రిప్పులు అధికంగా రాసుకోవడం ద్వారా నిధుల్ని బొక్కేశారు. ఇక ఆర్‌డబ్ల్యుఎస్ ద్వారా రక్షిత మంచినీటి పథకాలను సమర్థవంతంగా అమలు చేయాల్సి ఉన్నా, భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో పైప్‌లైన్లు, ట్యాంకుల నిర్మాణాలకే పరిమితం కావాల్సిన పరిస్థితి నెలకొంది.
1200 అడుగుల లోతుకు భూగర్భ జలం
ఇప్పటికే వర్షాభావంతో అనంతపురం జిల్లాలో వేలాది బోర్లు అడుగంటాయి. గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్‌లలో అధికారులు, శాస్తవ్రేత్తలు ఊహించినట్లుగా వర్షాలు కురవలేదు. దీంతో జిల్లాలోని మొత్తం 63 మండలాల పరిధిలోని 1003 గ్రామ పంచాయతీల్లో అత్యధిక గ్రామాల్లో నీటి ఎద్దడి మొదలైంది. భూగర్భ జలాలు సుమారు 1100 నుంచి 1200 అడుగుల లోతుకు పడిపోయాయి. దీంతో కొత్త బోర్లు వేసేందుకు కూడా ఆస్కారం లేకుండా పోయింది. జిల్లాలోని వేలాది గ్రామాల గొంతు తడిపేందుకు ఏర్పాటు చేసిన శ్రీరామరెడ్డి, జెసి నాగిరెడ్డి, చిత్రావతి పథకాలు సక్రమంగా అమలు కావడం లేదు. వీటి నిర్వహణకు ప్రత్యేకాధికారిని వెంటనే నియమించాల్సి ఉంది. హంద్రీనీవా కాలువ వెడల్పు చేసి అక్కడి నుంచి నీటిని జిల్లాకు తరలించి చెరువులు, తాగునీటి ట్యాంకుల్లో నిల్వ ఉంచకపోతే రాబోయే వేసవిలో జిల్లాలో తాగునీటికి ఇబ్బందులు తప్పవని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చిత్రం..అనంతపురం జిల్లాలోని ఓ గ్రామంలో పని చేయని రక్షిత మంచినీటి పథకం బోరు