ఆంధ్రప్రదేశ్‌

మున్సిపల్ పాఠశాలల ఆస్తులను ప్రైవేట్‌పరం చేసేందుకే తెలుగు మీడియం రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 5: పట్టణ, నగర ప్రాంతాల్లో కోట్లాది రూపాయల విలువైన మున్సిపల్ పాఠశాలల ఆస్తులను ప్రైవేట్‌పరం చేసే కుట్రతోనే ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలుగుమీడియంను రద్దుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2వ తేదీన జీవో నెం.14ను జారీచేసిందంటూ తెలుగు భాషోద్యమ సమాఖ్య నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. గత ఆగస్టు 29వ తేదీన గిడుగు రామమూర్తి జయంతి రోజున సిఎం చంద్రబాబు స్వయంగా తెలుగు భాషాభివృద్ధి కోసం ప్రత్యేకంగా ప్రాధికార సంస్థ ఏర్పాటుకై విధి విధానాలను ఖరారు చేసేందుకు గాను తెలుగు భాషా సాంస్కృతికశాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి అధ్యక్షతన ఉప సభాపతి మండలి బుద్దప్రసాద్, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ఇతర ప్రముఖులకు కమిటీ ఏర్పాటుచేసిన విషయం మరువక ముందే అందునా ఆ కమిటీ నివేదిక వెలుగుచూడక ముందే అర్ధాంతరంగా ఈ పిడుగులాంటి నిర్ణయం ఏమిటని ప్రశ్నించారు. తెలుగు భాషను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు తక్షణం ఈ రాష్ట్రాన్ని ఆంగ్లప్రదేశ్‌గా, తమ పార్టీని తెలుగుద్వేషం పార్టీగా మార్చుకుంటే బాగుంటుందంటూ ఎద్దేవా చేసారు. మాతృభాషా మాధ్యమం కొనసాగింపుకై తెలుగు కవులు, రచయితలు భాషాభిమానులతో ఈనెల 9న ధర్నాచౌక్‌లో నిరసన దీక్ష చేపట్టబోతున్నామని తెలిపారు.
తెలుగు భాషోద్యమ సమాఖ్య ప్రతినిధి డాక్టర్ సామల రమేష్‌బాబు మాట్లాడుతూ భారత రాజ్యాంగం 350 సెక్షన్ ప్రకారం దేశంలో అల్ప సంఖ్యాకుల మాతృభాషకు కూడా ప్రాధాన్యతనివ్వాలని స్పష్టంగా చెప్పబడిందన్నారు. అయితే మెజార్టీ ప్రజల తెలుగు భాషకే ఈ విధమైన ప్రమాదం ముంచుకొస్తుందనేది నాడు ఊహించలేకపోయారన్నారు. పొరుగునున్న తమిళనాడులో తెలుగుమీడియం రద్దుకు వ్యతిరేకంగా లేఖలు రాసిన చంద్రబాబు నేడు చేస్తున్నదేమిటంటూ ప్రశ్నించారు. మాతృభాష ద్వారానే ఇతర భాషల్లో రాణించగల్గుతారనేది జగమెరిగిన సత్యమన్నారు. అంతర్జాతీయ స్థాయిలో కీర్తిప్రతిష్టలు పొందిన వారెంతో మంది తమ తమ మాతృభాషల్లో రాటుతేలిన వారన్నది గుర్తెరగాలన్నారు. కార్పొరేట్ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం చదవటానికి ఆర్థిక స్థోమత లేనివారే మున్సిపల్ స్కూళ్లలో చదువుతుంటే వారిని ఇక్కడ కూడా దూరంగా వుంచుతారన్నారు. పాఠశాల విద్యార్థులకు పరభాషా మాధ్యమాన్ని తప్పనిసరి చేయడం రాజ్యాంగానికే విరుద్ధమని దీనిపై న్యాయపోరాటం కూడా సాగిస్తామన్నారు. జనసాహితీ ప్రతినిధి కొత్తపల్లి రవిబాబు మాట్లాడుతూ నిన్న మొన్నటివరకు సిఎం రాష్ట్రంలో తెలుగులోనే పరిపాలన చేస్తానని విద్యారంగంలో కూడా తెలుగు అభివృద్ధి చేస్తానంటూ నమ్మించి నేడు దగా చేస్తున్నారని అన్నారు. పాఠశాలలను సరైన మార్గంలో పెట్టడానికి బదులు ప్రభుత్వరంగంలోనున్న పాఠశాలల్లో పూర్తిగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం దారుణమన్నారు. విద్య వికాస వేదిక ప్రతినిధి డాక్టర్ ఎస్‌ఆర్ పరిమి మాట్లాడుతూ రాష్ట్రంలోని 3వేల 425 సక్సెస్ పాఠశాలల్లో 9 లక్షల 19వేల 114 మంది తెలుగు మాధ్యమంలోను, 4 లక్షల 25వేల 066 మంది ఆంగ్ల మాధ్యంలోనూ అధ్యయనం చేస్తున్నారని ఇలా ప్రతి ముగ్గురిలో ఇద్దరు తెలుగు భాష పట్ల మక్కువ చూపుతుంటే తెలుగుమీడియం రద్దు ఏమిటని ప్రశ్నించారు. ఈ సమావేశంలో దివికుమార్ (జనసాహితి), రమేష్ పట్నాయక్, (విద్యాపరిరక్షణ కమిటీ), వి.సింగారావు (తెలుగు భాషా సమాఖ్య) తదితరులు పాల్గొన్నారు.