కృష్ణ

విలువన్న పార్టీ బిజెపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కైకలూరు, ఏప్రిల్ 6: దేశంలోనే అత్యంత విలువలతో కూడిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని, ఆ పార్టీలో పనిచేయటం గర్వంగా భావించాలని రాష్ట్ర వైద్య విద్య, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. బుధవారం బిజెపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన మండలంలోని ఆటపాకలో, కైకలూరు ట్రావెలర్స్ బంగ్లా వద్ద ఉన్న పార్టీ దిమ్మ వద్ద జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం క్యాంపు కార్యాలయం వద్ద పార్టీ సమావేశం నిర్వహించారు. మంత్రి కామినేని మాట్లాడుతూ 1980, ఏప్రిల్ 6న ముంబాయిలో ప్రారంభమైన ఈ పార్టీ ప్రజల మన్నలను పొందుతూ నేడు ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వాలను కలిగిన ఏకైక పార్టీగా ఎదిగిందని, ప్రస్తుతం 11 కోట్ల సభ్యత్వం కలిగిం ఉందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల మనసులు గెలుచుకోవాలని, పార్టీ సిద్ధాంతాలను ఒమ్ము చేయకూడదనే భావనతో ముందుకు వెళ్లాలని అన్నారు. అన్ని పార్టీల్లోకెల్లా మచ్చలేని పార్టీ ఇదే అని అన్నారు. గత ప్రభుత్వాల ఆధ్వర్యంలో భారతదేశం అధోపాతానికి వెళ్లిందని, నేడు అధికారంలోకి ఉన్న ఈ ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో ఎంతో అభివృద్ధిని సాధించిందన్నారు. ప్రధాన మంత్రి మోదీ అవినీతి అంతంపై పోరాటం చేస్తూ మచ్చలేని ప్రధానిగా ఉన్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో తల్లీకొడుకులు వెనుక ఉండి ప్రధాన మంత్రిని నడిపించేవారని ప్రస్తుతం మోదీ మన దేశాన్ని అగ్రగామి దేశంగా తీసుకుని వెళ్లడానికి కృషి చేస్తున్నారని అన్నారు.
సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
సభలో మంత్రి ఇరువురు బాధితులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను అందించారు. లబ్ధిదారులు పెరికల అంజిబాబుకు రూ. 40,600లను, యెండూరి శేషగిరిరావుకు రూ. 50వేలు చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి వేంపాటి విష్ణురావు, కలిదిండి ఎఎంసి చైర్మన్ తాడినాడ బాబు, బిజెవైఎం జిల్లా అధ్యక్షులు లావేటి వీరశివాజీ, నియోజకవర్గ కన్వీనర్ ప్రత్తిపాటి అమృత కమలాకరరావు, ఎంపిపి బండి సత్యవతి, సర్పంచ్ నర్సపల్లి అప్పారావు, మండల పార్టీ అధ్యక్షులు అడివి కృష్ణ, సామర్ల శివకృష్ణ, చాపరాల దుర్గప్రసాద్, బొల్లా అభిమన్యకుమార్ గౌడ్, అసిఫ్ పాషా, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి మండలాల బిజెపి అధ్యక్షులు పైడిపాటి శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.
చెరకు ట్రాక్టర్‌ను ఢీకొన్న కారు
తోట్లవల్లూరు, ఏప్రిల్ 6: కృష్ణా కరకట్టపై చెరకు ట్రాక్టర్‌ను కారు ఢీకొన్న దుర్ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదం రొయ్యూరు గ్రామం వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రొయ్యూరు వద్ద కరకట్టపై మంగళవారం అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన ఏసీ డీలర్ దాడి వెంకటేశ్వర్లు(47) మృతి చెందాడు. మంగళవారం విజయవాడలో జరిగిన ఏసీ డీలర్ల సమావేశానికి ఆయన కారులో వెళ్ళాడు. రాత్రి 11 గంటల సమయంలో భోజనం చేసి కారుని స్వయంగా నడుపుకుంటూ తిరిగి కరకట్ట మీదుగా రేపల్లెకు బయలుదేరాడు. రొయ్యూరు వద్దకు రాగానే రాత్రి 11.30 గంటల సమయంలో చెరకు ట్రాక్టర్ ట్రక్కును అతివేగంగా వెనుక నుంచి కారు ఢీకొంది. దీంతో చెరకు ట్రక్కు వెనుక భాగంలో కారు చిక్కుకుని పది మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. కారు ముందు భాగం నుజ్జునుజ్జయి వెంకటేశ్వర్లు చిక్కుకుపోయాడు. ఈ ఘటనతో రొయ్యూరుకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ ముసలయ్య భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కరకట్టపై వెళ్లే వాహనదారులు ప్రమాదాన్ని గమనించి కారులో చిక్కుకున్న వెంకటేశ్వర్లు జేబులోని సెల్‌ఫోన్ తీసి మేనల్లుడు శ్రీనివాసరావుకు ఫోన్ చేశారు. అప్పటికే విజయవాడ నుంచి బయలుదేరిన శ్రీనివాసరావు వెంటనే ఘటనా స్థలానికి వచ్చాడు. సమాచారం తెలుసుకున్న రొయ్యూరు గ్రామస్తులు వచ్చి 108 అంబులెన్స్‌కి, పోలీసులకు సమాచారం అందించారు. సీఐ మురళీ రామకృష్ణ, ఎస్‌ఐ ప్రసాద్ సిబ్బందితో చేరుకుని గ్రామస్తుల సహాయంతో గంటకు పైగా శ్రమకోర్చి కారులో చిక్కుకున్న వెంకటేశ్వర్లుని బయటకు తీశారు. అప్పటికే స్పృహ కోల్పోయిన వెంకటేశ్వర్లును 108 అంబులెన్స్‌లో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి 2 గంటలకు ఆయన మృతిచెందినట్లు ఎస్‌ఐ ప్రసాద్ వివరించారు. కృష్ణా కరకట్టపై భారీ వాహనాలకు అనుమతి లేకపోయినా ఇసుక లారీలు, భారీ లోడుతో చెరకు ట్రాక్టర్లు తిరగటం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆర్సీ అధికారులు స్పందించి భారీ వాహనాలు తిరగకుండా కరకట్టపై గడ్డర్లు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
అవనిగడ్డ నియోజకవర్గానికి
71.14 కోట్ల పుష్కర నిధులు
* ఇడి సత్యనారాయణ
మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఏప్రిల్ 6: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అంబేద్కర్ జయంతి రోజున ఎన్‌ఎస్‌ఎఫ్‌డిసి, ఎన్‌ఎస్‌కెఎఫ్‌డిసి లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేయనున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్‌వివి సత్యనారాయణ తెలిపారు. బుధవారం తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ఎన్‌ఎస్‌ఎఫ్‌డిసి పథకం కింద జిల్లాకు 90 యూనిట్లు లక్ష్యం కాగా 196 మంది దరఖాస్తులు చేసుకున్నారన్నారు. వీరిలో 167 మంది ఇంటర్వ్యూలకు హాజరుకాగా 124 మందికి యూనిట్లు మంజూరు చేశామన్నారు. 49 మంది లబ్ధిదారులు మాత్రమే పూర్తిస్థాయిలో డాక్యుమెంట్లు సమర్పించారన్నారు. అలాగే ఎన్‌ఎస్‌కెఎఫ్‌డిసి పథకం కింద 94 యూనిట్లు లక్ష్యం కాగా 226 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. 179 మంది ఇంటర్వ్యూలకు హాజరుకాగా 94 మంది అర్హత సాధించారన్నారు. వీరిలో ఎనిమిది మంది మాత్రమే అన్ని డాక్యుమెంట్లు సమర్పించి యూనిట్లు పొందేందుకు అర్హత సాధించారన్నారు. వీరికి గురువారం ఎస్సీ కార్పొరేషన్ ఇడి కార్యాలయంలో జాయింట్ ఎకౌంట్లు ప్రారంభించి అంబేద్కర్ జయంతి రోజు యూనిట్లు అందచేస్తామని ఆయన వివరించారు.
భానుడి భగభగలకు అల్లాడుతున్న జనం
మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఏప్రిల్ 6: ఏప్రిల్ మొదటి వారంలోనే భానుడి ప్రతాపానికి ప్రజలు, పశుపక్ష్యాదులు అల్లాడుతున్నాయి. ఇక మే నెలలో పరిస్థితి మరేవిధంగా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వడదెబ్బకు ఇప్పటి నుంచే వృద్ధులు పిట్టల్లా రాలిపోతున్నారు. బుధవారం భానుడి భగభగలకు బందరులోని ప్రధాన రహదారులు సైతం జనసంచారం లేక నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. వడగాడ్పులకు వృద్ధులు, చిన్నారులు నీరసించిపోయారు. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావటంలేదు. వాహనచోదకులు ముఖానికి మాస్కులు ధరించి ప్రయాణిస్తున్నారు. దీన్ని అదునుగా చేసుకుని కొబ్బరి బొండాలు, పుచ్చకాయలు, శీతల పానీయాలు, చెరకు రసం, తదితర పానీయాల ధరలను పెంచేశారు. ఉదయం 6గంటల కల్లా సూర్యుడు మండే అగ్నిగోళంగా నిప్పులు చెరిగేందుకు సిద్ధమవుతున్నాడు. ఒకపక్క ఉష్ణోగ్రతలు, మరోపక్క ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పశువులు మురికిగుంటల్లో సేదతీరుతున్నాయి. ప్రజలు ఆహారం కన్నా నీటినే ఎక్కువగా తాగేస్తున్నారు. ఎంత తాగినా దాహం తీరకపోవటంతో గ్యాస్ సమస్య ఏర్పడి సతమతమవుతున్నారు.
ఊబకాయులు ఉక్కపోతను తట్టుకోలేక నీరసించిపోతున్నారు. సాయంత్రం 5గంటలు దాటిన తరువాత మార్కెట్‌కు వస్తున్నారు. పట్టణంలో పగలంతా రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయ. ఏదిఏమైనా ఏప్రిల్‌లోనే భానుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కిరిబిక్కిరౌతున్నారు.

పుష్కరఘాట్లు, పుష్కరనగర్‌లపై సమగ్ర నివేదిక
* అధికారులను ఆదేశించిన కలెక్టర్
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఏప్రిల్ 6: పుష్కరాలకై ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ టీం పుష్కరఘాట్లు, పుష్కరనగర్‌లను పరిశీలించి సమగ్ర నివేదిక రూపొందించి సమర్పించాలని జిల్లా కలెక్టర్ బాబు.ఎ అధికారులను ఆదేశించారు. నగరంలోని స్థానిక క్యాంపు కార్యాలయంలో బుధవారం కృష్ణా పుష్కరాలకై చేపట్టిన ఏర్పాట్లను సంబంధిత శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా తొలుత రైల్వేశాఖ ద్వారా పుష్కరాలకై చేపట్టిన పనులను సమీక్షించారు. పుష్కరాలకై రెవెన్యూ, పోలీస్, వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ టీం ఈ నెల 21న నిర్వహించే తదుపరి సమావేశంలో పుష్కరనగర్, ఘాట్లలో చేపట్టిన, చేపట్టాల్సిన పనులపై సమగ్ర నివేదికతో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో డివిజనల్ రైల్వే మేనేజర్ అశోక్‌కుమార్ మాట్లాడుతూ పుష్కరాలకు వచ్చే యాత్రికులకు గుణదల, రామవరప్పాడు, రాయనపాడు, కొండపల్లి రైల్వే స్టేషన్లలో పుష్కర యాత్రికులకు టికెట్టు కౌంటర్లు, మంచినీరు, వ్యక్తిగత మరుగుదొడ్లు వంటి వౌలిక వసతులను కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పుష్కరాలకై వివిధ ప్రాంతాల నుండి సుమారు 500కు పైగా రైళ్లను నడపటం జరుగుతుందని, యాత్రికుల సంఖ్యను అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. విజయవాడ ప్రధాన జంక్షన్ రైల్లేస్టేషన్, అన్ని స్టేషన్లలో ప్రస్తుతం ఉన్న సిసి కెమెరాలతో పాటు అదనంగా సిసి కెమెరాలను, విద్యుత్ లైట్లను ఏర్పాటు చేస్తున్నామని డివిజనల్ రైల్వే మేనేజర్ కలెక్టర్‌కు వివరించారు. యాత్రికుల రాకపోకలకు మార్గాలను రైల్వే అధికారుల సమన్వయంతో పోలీస్, రెవెన్యూ అధికారులు గుర్తించాలన్నారు. కొండపల్లి రైల్వేస్టేషన్ ఎదురుగా పొదలను తొలగించి శుభ్రం చేయాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. రాయనపాడు రైల్వేస్టేషన్ ఎదురుగా గల సిడబ్ల్యుసి గోడౌన్ ఖాళీ ప్రదేశంలో పుష్కరనగర్‌కు అనువుగా స్థలాన్ని గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. రైల్వేస్టేషన్ నుండి ఘాట్లకు వెళ్లే మార్గం, పుష్కరనగర్‌లలో కాంతివంతమైన విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని ట్రాన్స్‌కో, డిస్కం అధికారులను ఆదేశించారు. పుష్కరాలకై నియమించబడిన స్పెషల్ ఆఫీసర్లు ఘాట్లను పరిశీలించి పుష్కరాలకై ఏర్పాటు చేసే టెలిగ్రాం గ్రూపులో ఫొటోతో కూడిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందుపర్చాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పుష్కరనగర్, అన్ని ఘాట్లలో వైద్యులు, మందులతో కూడిన మెడికల్ యూనిట్లు ఏర్పాటు, రామకృష్ణామిషన్, సత్యసాయి ట్రస్టు వంటి స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఏర్పాట్లపై నివేదిక ఇవ్వాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. పుష్కరాలకై జిల్లాలో విధులను నిర్వర్తించేందుకు వివిధ శాఖలకు చెందిన సుమారు 22వేల మంది ఉద్యోగులు రానున్నారని, వీరికి వసతి సౌకర్యాలను కల్పించేందుకు సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహాల వివరాలను అందించాలని సంబంధిత శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బి శాఖ అధికారులు పుష్కరాలకై చేపట్టాల్సిన రహదారుల పనులను టెండర్ల ప్రక్రియ త్వరితగతిన పూర్తిచేసి నాణ్యతతో పనులు ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. రహదారి పనులకు అవసరమయ్యే మట్టిని పోలవరం కాలువ త్రవ్విన మట్టిని, రొయ్యూరు ఇసుకరీచ్ నుండి ఇసుకను ఉపయోగించుకోవాలని కలెక్టర్ అన్నారు. కనకదుర్గ అమ్మవారి దేవాలయానికి కొండపైకి చేరుకునే రెండవ రహదారి 12 మీటర్ల పొడవు విస్తరణ పనులను దుర్గాఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపడుతున్న సోమా కంపెనీ, మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల సమన్వయంతో చేపట్టాలన్నారు. దుర్గగుడికి సంబంధించిన బ్యూటిఫికేషన్, పలు అభివృద్ధి పనులను జూలై 15 నాటికి పూర్తి చేయాలని ఆలయ ఇఓ చంద్రశేఖర్ ఆజాద్‌ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ పుష్కరాలకై 12 తాత్కాలిక బస్‌స్టేషన్లను ఏర్పాటు చేశామని అధికారులు కలెక్టర్‌కు వివరించగా అన్ని బస్‌స్టేషన్లు పుష్కరనగర్‌లోనే ఉండాలని, మినీ బస్సుల ద్వారా యాత్రికులు ఘాట్లకు చేరుకునేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పుష్కరాలకై మొబైల్ యాప్‌ను రూపొందించటం జరుగుతుందని దీనికై అన్ని శాఖల అధికారులు వారికి సంబంధించిన సమాచారాన్ని, ఫోన్ నెంబర్లను అందించాలని ఆదేశించారు. జిల్లాలో పుష్కరాలకై 92 ఘాట్లను గుర్తించటం జరిగిందని, యంపిడిఓలు, తహశీల్దార్లు, పోలీస్, వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ టీం ఘాట్లను పరిశీలించి అవసరమైతే అదనపు ఘాట్లను గుర్తించాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఘాట్లకు సమీపంలోనే పుష్కరనగర్‌లు ఉండాలని కలెక్టర్ అన్నారు.
ఈ నెల 12న ఉదయం 6 గంటలకు నగరంలోని పిడబ్ల్యుడి మైదానం నుండి అన్ని శాఖల అధికారులు బయలుదేరి పుష్కరాలకై ఏర్పాటు చేయనున్న ఘాట్లు, పుష్కరనగర్‌లు, బస్‌స్టేషన్లను పరిశీలించటం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని రూరల్ ప్రాంతాలలో ఘాట్లు, రహదారులు, పుష్కరనగర్‌లను ఈ నెల 20న అధికారులు పరిశీలిస్తారని కలెక్టర్ అన్నారు. సమీక్షా సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండయన్, సబ్‌కలెక్టర్‌లు డా.జి.సృజన, జి.లక్ష్మీశా, అడిషనల్ సిపి మహేష్, లడ్హా, జిల్లా ఎస్‌పి జి.విజయకుమార్, డిసిపి కాళిదాస్ వెంకటరంగారావు, ఇరిగేషన్ ఎస్‌ఇ సి.రామకృష్ణా, డిఆర్‌ఎం అశోక్‌కుమార్, పంచాయతీరాజ్ ఎస్‌ఇ సి.సూర్యనారాయణ, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ కె.శేషుకుమార్, డిపిఒ వి.కృష్ణకుమారి, గుడివాడ, మచిలీపట్నం ఆర్‌డిఓలు యం.చక్రపాణి, పి.సాయిబాబు, కనకదుర్గ అమ్మవారి దేవస్థానం ఇఓ చంద్రవేఖర ఆజాద్, యంపిడిఓలు, తహశీల్దార్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.