ఆంధ్రప్రదేశ్‌

బెజవాడలో అభివృద్ధి జాడేదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 15: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు ఆగమేఘాలపై సరికొత్త ప్రాజెక్టులు మంజూరు చేయించడమే కాకుండా నిధులు మంజూరు చేయించి శంకుస్థాపనలు, ఆపై ప్రారంభోత్సవాలు కూడా జరిపిస్తున్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు తాజాగా రాజధాని అమరావతిపై దృష్టి సారించారు. ఇటీవలి కాలంలో సగటున వారానికోసారైనా రాష్ట్ర పర్యటనకు వస్తూ విజయవాడను మాత్రం తప్పక సందర్శిస్తున్నారు. ఇక వెంకయ్య కేంద్ర పట్టణాభివృద్ధి శాఖను చేపట్టిన తర్వాత విజయవాడ నగరం త్వరితగతిన అభివృద్ధి చెందుతుందనే ఆశలు నగరవాసుల్లో పెరిగాయి. ఇదే సమయంలో వెంకయ్య నాయుడు కూడా ఎప్పటికప్పుడు వేగుల ద్వారా నగరాభివృద్ధికి సంబంధించిన వివరాలు రాబడుతున్నారు. తాను ప్రత్యేక శ్రద్ధతో మంజూరు చేస్తున్న ప్రాజెక్టులు ఆశించిన మేర కార్యరూపం దాల్చడం లేదనే అసహనం కూడా ఆయనలో ఇప్పుడిప్పుడే మొదలౌతోంది. ప్రధానంగా ఇష్టారాజ్యంగా ఆక్రమణలు, నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలు పెరుగుతున్నాయంటూ ఇటీవల జరిగిన ఓ బహిరంగ సమావేశంలోనే ఆయన అధికారుల వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలందరికీ సొంత గూడు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం, స్థానిక సంస్థలపై ఉంది. అయితే కాలువగట్లు, రహదారులు, భవిష్యత్ అవసరాల కోసం ఖాళీగా ఉంచిన స్థలాలు కబ్జాకు గురవుతుంటే అధికారులు చోద్యం చూస్తున్నారా?.. అంటూ మండిపడుతున్నారు. ప్రధానంగా దేశ విదేశాల నుంచి నిత్యం వచ్చిపోయే అతిథుల రాకపోకలు పెరుగుతున్నప్పటికీ పారిశుద్ధ్య పరిస్థితి మాత్రం అధ్వానంగా ఉందని ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. నగరం నడిబొడ్డు నుంచి వెళ్లే కాలువలు వందలాది గ్రామాల ప్రజల దాహార్తిని తీరుస్తుంటే నగరంలోని మురుగు నేరుగా కాలువల్లో ప్రవహిస్తుండటం బాధాకరమని ఆయన ఇటీవల ఆవేదన వ్యక్తపర్చారు. ఇక నగరంలో ఆకస్మిక తనిఖీలు చేస్తూ అధికారులను అప్రమత్తం చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రతి డివిజన్‌కు ఒక టౌన్ ప్లానింగ్ ఉద్యోగి వున్నప్పుడు అక్రమ కట్టడాలు ఎలా వెలుస్తున్నాయంటూ వెంకయ్య ఇటీవల ఓ సందర్భంలో ఆశ్చర్యం వెలిబుచ్చారు. పునాదుల సమయంలో చూసీచూడనట్లు పోతుండటం వల్ల తీరా నిర్మాణాలు పూర్తయ్యాక వాటి జోలికి పోకుండా ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిళ్లు తేవాల్సి వస్తోందంటున్నారు. ఇదిలావుంటే, విజయవాడ ప్రాంతానికి సంబంధించి ఇటీవల గన్నవరం విమానాశ్రయంలో నూతన టెర్మినల్ కోసం రూ.160 కోట్లు, రన్‌వే విస్తరణకు మరో రూ.160 కోట్లు మంజూరయ్యాయి. అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. వందలాది కోట్లలో విజయవాడ చుట్టూ 186 కి.మీల మేర ఔటర్ రింగురోడ్డు నిర్మాణానికి రూ.20వేల కోట్ల కేటాయింపు, మురుగునీటి పారుదల వ్యవస్థకు రూ.460 కోట్లు, హృదయ్ పథకం ద్వారా మెట్రో ప్రాజెక్టు మంజూరు, కనకదుర్గ గుడి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ.450 కోట్లు మంజూరు, రూ.1462 కోట్ల అంచనాతో బెంజి సర్కిల్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణంతో సహా విజయవాడ-మచిలీపట్నం రహదారి విస్తరణ, మురుగునీటి పారుదల వ్యవస్థకు రూ.460 కోట్లు, పేదల కోసం 10వేల ఇళ్లు ఇటీవలే మంజూరయ్యాయి. ఇదిలావుంటే ఈ ప్రాంతానికి చెందిన నేత కాకపోయినా జైపాల్‌రెడ్డి యుపిఏ ప్రభుత్వంలో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా ఉంటూ తొలుతగా నగర చరిత్రలో అంతకు ముందెన్నడూ లేనివిధంగా భారీగానే నిధులు మంజూరు చేయించారనేది అక్షర సత్యం.
మురుగునీటి శుద్ధి ప్లాంట్లతో పాటు భూగర్భ డ్రైనేజీ పథకానికి రూ.750 కోట్లు మంజూరయ్యాయి. ఆ పనులు కూడా పూర్తయ్యాయి. జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం కింద 27వేల గృహాలు మంజూరుకాగా వీటిల్లో 13వేల నిర్మాణాలు పూర్తయ్యాయి. లబ్ధిదారులకు కేటాయింపులు కూడా జరిగాయి. దేశంలోనే తొలిసారిగా జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం కింద అంతర్గత రహదారుల నిర్మాణానికి రూ.82 కోట్లు మంజూరు చేశారు. దీనివల్ల ఇన్నర్‌రింగ్ రోడ్డు నిర్మాణం జరగ్గా ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. రైల్వేలైన్ తొలగించి ఆ స్థానంలో బిఆర్‌టిఎస్ రోడ్డు నిర్మించారు. అయితే పరిసర గ్రామాలన్నింటినీ కలిపి ‘గ్రేటర్ విజయవాడ’గా తీర్చిదిద్దాలనే జైపాల్‌రెడ్డి ఆకాంక్ష మాత్రం నెరవేరలేదు.